బెట్టింగ్ ముఠాలపై నిఘా
ABN , Publish Date - Mar 18 , 2026 | 02:43 AM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెలరేగిపోతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు నిఘాపెట్టారు. టీ20 వరల్డ్ కప్ నడుస్తున్న సమయంలో దర్శి కేంద్రంగా బెట్టింగ్‌లు వేయించి అమాయకులను మోసం చేసిన ముఠాలో కొందరిని ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే.
పోలీసుల అదుపులో 10 మంది
మూలాలు వెతికే పనిలో టాస్క్‌ఫోర్స్
ఒంగోలు క్రైం, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చెలరేగిపోతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాలపై పోలీసులు నిఘాపెట్టారు. టీ20 వరల్డ్ కప్ నడుస్తున్న సమయంలో దర్శి కేంద్రంగా బెట్టింగ్‌లు వేయించి అమాయకులను మోసం చేసిన ముఠాలో కొందరిని ఇటీవల అరెస్టు చేసిన విషయం విదితమే. ఇప్పటికే ఈ ముఠాకు హైదరా బాద్, బెంగళూరులకు చెందిన పెద్ద బుకీలతో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. దర్శిలో డెన్‌పై దాడిచేసిన పోలీసులు నరసరావుపే టలో ముఠాకు నేతృత్వం వహించే వ్యక్తిని అదుపులోకి తీసుకొని రూ.24 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ ముఠాలో ఉన్న వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే 10 మందిని అదుపులోకి తీసుకొన్న టాస్క్‌ఫోర్సు పోలీసులు వారిని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. రానున్న ఐపీఎల్ సీజన్ వచ్చేసరికి క్రికెట్ బెట్టింగ్‌రాయుళ్ల ఊసే లేకుండా చేయాలని ఎస్పీ చర్యలు చేపట్టారు. అందుకోసమే ముందస్తుగా ఆయా ముఠాలతో సంబంధం ఉన్న వారిపై జిల్లా అంతా దృష్టిసారించారు. అదేక్రమంలో సింగరాయకొండ ప్రాంతంలో బెట్టింగ్ ముఠాకు నాయకత్వం వహించే వారు ఇప్పటికే పరారైనట్లు తెలిసింది. మరలా ఐపీఎల్ మ్యాచ్‌లు ప్రారంభం కాగానే ఈ ముఠాలు రంగంలోకి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కావలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తితోపాటు మరొకరు సింగరాయకొండ, ఒంగోలు, కొండపి, కావలి, నెల్లూరు ప్రాంతాలలో కీలకంగా డెన్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిసి పోలీసులు నిఘా పెట్టారు.