పొగాకు, ఆక్వా రైతులకు దన్నుగా..
ABN , Publish Date - Jul 21 , 2026 | 03:13 AM
తీవ్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులకు కేంద్రప్రభుత్వం దన్నుగా నిలిచి సాయపడాలని రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నా యుడు, డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్ కోరారు. ఈ మేరకు వారు రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రతినిధి బృందంగా సోమవారం ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఈ సమస్యలపై చర్చించారు.
కేంద్రాన్ని కోరిన మంత్రులు అచ్చెన్న, స్వామి, గొట్టిపాటి
రామ్మోహన్‌నాయుడు నేతృత్వంలోపియూష్ గోయల్, రాజీవ్ రంజన్‌లతో భేటీ
ఒంగోలు, జూలై 20 (ఆంరఽధజ్యోతి) : తీవ్ర సంక్షోభంలో ఉన్న రాష్ట్రంలోని పొగాకు, ఆక్వా రైతులకు కేంద్రప్రభుత్వం దన్నుగా నిలిచి సాయపడాలని రాష్ట్ర మంత్రులు కె.అచ్చెన్నా యుడు, డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్ కోరారు. ఈ మేరకు వారు రాష్ట్రప్రభుత్వం తరఫున ప్రతినిధి బృందంగా సోమవారం ఢిల్లీలోని పలువురు కేంద్ర మంత్రులను కలిసి ఈ సమస్యలపై చర్చించారు. పొగాకు ఆక్వా రెండింటిపై దృష్టిసారించి స్వయంగా సీఎం చంద్రబాబునాయుడు పలుమార్లు సమీక్షలు చేశారు. అయితే వీటికి సంబంధించి కీలక అంశాలు ప్రధానంగా కేంద్రప్రభుత్వ పరిధిలో ఉండటంతో ఇటీవల రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన మాట్లాడారు. తదనుగుణంగా మరింత వివరంగా కేంద్రమంత్రులను కలిసి చర్చించాలని రాష్ట్ర మంత్రులకు సూచించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేతృత్వంలో జిల్లాకు చెందిన మంత్రులు డాక్టర్ స్వామి, గొట్టిపాటి రవికుమార్ ఆదివారం రాత్రికి ఢిల్లీ చేరారు. సోమవారం ఉదయం రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయులు, ఇతర ముఖ్యనేతలతో రాష్ట్రమంత్రులు తొలుత ఈ అంశాలపై చర్చించారు. ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. సాయంత్రం వారంతా తొలుత ఆక్వా రైతుల సమస్యలపై కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్‌రంజన్‌సింగ్‌ను కలిశారు. రాష్ట్రానికి చెందిన మరో కేంద్రమంత్రి శ్రీనివాసరాజు, రాష్ట్రానికి చెందిన మరికొంతమంది కీలక నేతలు కూడా వారితో ఉన్నారు. ఆక్వా ఫీడ్ ధరల తగ్గింపు, సోయాబీన్ దిగుమతులకు అనుమతులు కల్పించడం ద్వారా ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. అనంతరం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కలిశారు. ప్రధానంగా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభ పరిస్థితిని ఆయనకు వివరించారు. ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణంగా ఉన్న సిగరెట్ ఉత్పత్తులపై జీఎస్టీ తగ్గింపునకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పొగాకు విదేశీ ఎగుమతులు అధికంగా లభించేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పలు ఇతర సంబంధిత అంశాలపై వారు చర్చించగా కేంద్రమంత్రులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.