ప్రపంచ బాలల మహాసభలకు సహకరించండి
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:20 PM
ఆంధ్రసారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 5, 6 తేదీలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ బాలల సాహిత్య మహాసభలకు సహకరించాలని పరిషత్ అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కలెక్టర్ పి.రాజాబాబుకు విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్‌కు గజల్ శ్రీనివాస్ విజ్ఞప్తి
ఒంగోలు కల్చరల్, జూలై 9(ఆంధ్రజ్యోతి) : ఆంధ్రసారస్వత పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 5, 6 తేదీలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచ బాలల సాహిత్య మహాసభలకు సహకరించాలని పరిషత్ అధ్యక్షుడు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ కలెక్టర్ పి.రాజాబాబుకు విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం ఒంగోలు నగరపాలక సంస్థలోని కలెక్టర్ ఛాంబర్‌లో గజల్ శ్రీనివాస్, కలెక్టర్‌ను కలిశారు. ఈ మహాసభలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వివిధ రాష్ర్టాల గవర్నర్లు, విదేశీ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందన్నారు. అదేవిధంగా దేశవిదేశాల్లోని 16 ఏళ్లలోపు తెలుగు బాలబాలికలు వేలాదిగా ఇందులో పాల్గొనే విధంగా తాము కృషిచేస్తున్నట్లు చెప్పారు. స్థానిక కొప్పోలు రోడ్డులోని నెక్ట్స్‌జెన్ పబ్లిక్ స్కూలులో నిర్వహించే మహాసభల గురించి పలు విషయాలను గజల్ శ్రీనివాస్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఇటు ఒంగోలు నగర ఖ్యాతిని, జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసే విధంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం తరఫున పూర్తి సహకారం అందజేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ పి.వెంకటకృష్ణయ్య, నెక్ట్స్‌జెన్ స్కూల్ డైరెక్టర్ కోగంటి శ్రీకాంత్, ప్రరసం అధ్యక్షుడు పొన్నూరి వెంకట శ్రీనివాసులు, బొమ్మరాజు భాస్కరశర్మ, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి పాల్గొన్నారు.