అపరాలకు ‘మద్దతు’
ABN , Publish Date - May 20 , 2026 | 02:38 AM
జిల్లాలో కందులు, శనగలు వంటి అపరాలను మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయించడం ఆ పంటలను సాగుచేసిన రైతులకు కొంత ఊరట కలిగించింది. పండిన దానిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిమాణం తక్కువే. అయినప్పటికీ మార్కెట్లో ధరలు సరిలేక, నష్టాలకు అమ్ముకోలేక తల్లడిల్లే రైతులకు ప్రభుత్వం ఆ మాత్రం అయినా మద్దతు ధరకు కొనడం లాభించింది.
ఉపకరించిన ప్రభుత్వ కొనుగోళ్లు
మార్క్‌ఫెడ్ ద్వారా 29,243 మెట్రిక్ టన్నుల కందులు, శనగల సేకరణ
మొత్తం రూ.211 కోట్ల మేర కొనుగోళ్లు
రూ.182 కోట్లు ఇప్పటికే చెల్లింపు
ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు
అనంతరం మార్కెట్లో రేట్ల పెరుగుదల
జిల్లాలో కందులు, శనగలు వంటి అపరాలను మార్క్‌ఫెడ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయించడం ఆ పంటలను సాగుచేసిన రైతులకు కొంత ఊరట కలిగించింది. పండిన దానిలో ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిమాణం తక్కువే. అయినప్పటికీ మార్కెట్లో ధరలు సరిలేక, నష్టాలకు అమ్ముకోలేక తల్లడిల్లే రైతులకు ప్రభుత్వం ఆ మాత్రం అయినా మద్దతు ధరకు కొనడం లాభించింది. నేరుగా మార్క్‌ఫెడ్ ద్వారా అమ్ముకున్న రైతులకు మద్దతు ధర దక్కగా, దాని వల్ల బహిరంగ మార్కెట్లో ధరలు పెరిగాయి. ఇది ఇతర రైతులకు ఉపకరించింది.
ఒంగోలు, మే 19 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో కంది, రబీలో శనగ పంటలు అపరాలలో ప్రధానమైనవి. ఎప్పటి లాగే గతేడాది కూడా విస్తారంగా ఆ పంట లను రైతులు సాగు చేశారు. ఉత్పత్తులు చేతికి వచ్చే నాటికి ధరలను వ్యాపారులు గణనీ యంగా తగ్గించి వేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర కూడా ఇవ్వలేదు. అధికార వర్గాల అంచనా ప్రకారం 2025-26 పంట కాలంలో జిల్లాలో సుమారు 92 వేల మెట్రిక్ టన్నుల కందులు, మరో 52వేల మెట్రిక్ టన్నుల శనగల ఉత్పత్తి జరిగింది. సంక్రాంతి నాటికి కందులు ఇళ్లకు చేరాయి. ఫిబ్రవరి తొలి వారానికి శనగలు వచ్చాయి. ఆ సమయంలో క్వింటా కందుల ధర రూ.7వేలు, శనగల ధర రూ.5వేల లోపుగా ఉంది. అది సాధారణంగా వాటికి ఉండాల్సిన ధరల కన్నా క్వింటాకు వెయ్యి రూపాయలకు పైన తక్కువ. అంతేగాక వ్యాపారులు కొనేందుకు కూడా అంతగా ఆసక్తి చూపలేదు. దీంతో రైతుల్లో అయోమయం నెలకొంది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వ మద్దతు ధరకు వాటిని కొనుగోలు చేసేందుకు ఉపక్రమించింది.
కొన్న వాటికి డబ్బులు జమ
పూర్వపు జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో కందుల కొనుగోళ్లకు 45 కేంద్రాలు, శనగల కొనుగోలుకు 60 కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని మార్క్‌ఫెడ్ ద్వారా స్థానికంగా ఆయా ప్రాంతాల్లో పీఏసీఎస్‌లు, ఇతర సహకార సంస్థల ద్వారా ప్రారంభించారు. అప్పుడు కందులు క్వింటా రూ.8వేలు, శనగలు క్వింటా రూ.5,875 మద్దతు ధరగా ఉంది. ఆ ప్రకారం ఫిబ్రవరి 4 నుంచి కందులు, అదే నెలాఖరు నుంచి శనగల కొనుగోళ్లు చేపట్టారు. అలా గత వారం వరకు 8,581 మంది రైతుల నుంచి సుమారు రూ.133.20 కోట్లతో 16,650 టన్నుల కందులు, అలాగే 4,719 మంది రైతుల నుంచి రూ.74 కోట్లతో 12,593 క్వింటాళ్ల శనగలు కొనుగోలు చేశారు. అందుకు సంబంధించి కందుల రైతులకు రూ.125 కోట్లు, శనగ రైతులకు రూ.67కోట్లు చెల్లింపులు కూడా జరిగాయి. మిగిలిన రూ.15కోట్లు ఈ వారంలో జమ అవుతాయని సమాచారం. ఇలా పరిమాణం రూపంలో చూస్తే పండిన పంటలో ప్రభుత్వం కొనుగోలు చేసింది పరిమితమే అయినప్పటికీ ఆ ప్రభావం మొత్తం రైతాంగానికి ఉపకరించింది.
మార్కెట్‌లో పెరిగిన ధరలు
కందుల కొనుగోళ్లను మార్క్‌ఫెడ్ చేపట్టే నాడు మార్కెట్లో క్వింటా రూ.7వేలు ఉండగా రూ. 8వేలకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. దీంతో మార్కెట్లో క్రమంగా వాటి ధరలు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో క్వింటా రూ.8వేలకు కొనుగోళ్లు జరుగుతున్నాయి. అలాగే క్వింటా రూ.5వేలు ఉన్న శనగల ధర ప్రస్తుతం రూ.5,800 నుంచి రూ.6వేలకు చేరింది. శనగ ధర పెరుగుదలకు యుద్ధం ప్రభావంతో విదేశీ దిగుమతులు తగ్గడం కూడా మరో కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధర మరికొంత పెరుగుతుందని సమాచారం. మొత్తం మీద రెండు ప్రధాన పంటలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేయడం వల్ల ప్రత్యక్షంగా కొద్దిమంది రైతులకు లాభించినా ఆ ప్రభావం వల్ల పరోక్షంగా జిల్లాలోని వేలాదిమంది రైతులకు ఉపకరించింది.