అపరాలకు ‘మద్దతు’
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:07 AM
దిగజారిన ధరలతో ఆందోళన చెందుతున్న అపరాల రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. పూర్వపు జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో శనగల కొనుగోలుకు 60, కందుల కొనుగోలుకు 45 కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయించింది.
రైతులకు ఊరట
పూర్వపు జిల్లాలో 60 శనగలు, 45 కందుల కొనుగోలు కేంద్రాలు
ఇప్పటికే పలుచోట్ల ప్రారంభం
వారంలో అన్నిచోట్లా మొదలు
ఒంగోలు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : దిగజారిన ధరలతో ఆందోళన చెందుతున్న అపరాల రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది. పూర్వపు జిల్లావ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. మొత్తం ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో శనగల కొనుగోలుకు 60, కందుల కొనుగోలుకు 45 కేంద్రాలను ఏర్పాటుకు నిర్ణయించింది. పది రోజులుగా కందుల కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తుండగా.. నాలుగైదు రోజుల నుంచి శనగల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. పూర్వపు జిల్లాలో శనగ, కంది, మినుము ప్రధాన పంటలు కాగా ప్రభుత్వం శనగలు క్వింటా రూ.5,875, కందులకు క్వింటా రూ.8వేలు, మినుములకు క్వింటా రూ.7,800 మద్దతు ధరగా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో అంతకన్నా ధరలు తగ్గి రైతులు నష్టపోయే పరిస్థితి ఉంటే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని ఆదేశించింది. జిల్లాలో మినుములను బహిరంగ మార్కెట్‌లో రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన దాని కన్నా ఎక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు. శనగలు, కందుల ధరలు మాత్రం తక్కువగా ఉన్నాయి. దీంతో ఆ రెండింటి కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. స్థానికంగా ఉండే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం (పీఏసీ ఎస్), పొగాకు సమాఖ్య, డీసీఎంఎస్ వంటి సంస్థల ద్వారా మార్క్‌ఫెడ్ పర్యవేక్షణలో ఈ కొనుగోలు కేంద్రాలు సాగుతున్నాయి. ఇప్పటికే పూర్వపు జిల్లాలో అన్ని చోట్లా కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. శనగల కేంద్రాలను పది వరకు ప్రారంభించారు.
తాజాగా మరో మూడు ప్రారంభం
తాజాగా మంగళవారం మంత్రి గొట్టిపాటి రవికుమార్ కొరిశపాడు మండలం పమిడిపాడులో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఒంగోలు ఏఎంసీ ఆవరణలో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఉప్పుగుండూరులో పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కె.సీతారామయ్యలు ప్రారంభించారు. పూర్వపు జిల్లాలో 15,039 మెట్రిక్ టన్నుల శనగల కొనుగోలుకు ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌కు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు 850 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారు. ఈ-పంట నమోదులో శనగ సాగు చేసినట్లు నమోదైన రైతులు యాప్‌లో కొనుగోలు కేంద్రంలో అమ్మకానికి అనుమతి కోరుతూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఏ రోజున ఏ కేంద్రానికి వెళ్లాలి అన్న సమాచారం వారి మొబైల్‌కు వస్తుంది. తదనుగుణంగా సరుకు తీసుకెళ్లి అమ్ముకునే అవకాశం కల్పించారు. అలాగే 12,865 టన్నుల కందుల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా ఇప్పటికే 3వేల టన్నులు కొనుగోలు చేశారు. రానున్న వారంరోజుల్లో అన్ని కేంద్రాలను ప్రారంభించి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కొనుగోళ్లకు చర్యలు తీసుకున్నట్లు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ తెలిపారు.