Share News

పేద విద్యార్థులకు ఆసరా

ABN , Publish Date - Jul 12 , 2026 | 02:06 AM

ఇళ్లు విడిచి హాస్టళ్లలో ఉండి విద్యనభ్యసించే పేద విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారందరికీ నాణ్యమైన పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో మెస్‌ చార్జీలను 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

పేద విద్యార్థులకు ఆసరా
చింతలలోని ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థులు

మెస్‌ చార్జీలు 10శాతం పెంచుతూ ప్రభుత్వ నిర్ణయం

నాణ్యమైన పోషకాహారం అందించడమే లక్ష్యం

మార్కాపురం, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : ఇళ్లు విడిచి హాస్టళ్లలో ఉండి విద్యనభ్యసించే పేద విద్యార్థుల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి సారించింది. వారందరికీ నాణ్యమైన పోషకాహారం అందించాలన్న లక్ష్యంతో మెస్‌ చార్జీలను 10 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రభుత్వానికి పలువురు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ నిర్ణయం పేద విద్యార్థులకు ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. మార్కాపురం జిల్లాలోని దోర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, పెద్దారవీడు, గిద్దలూరు, అర్ధవీడు మండలాల్లో 14 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇవన్నీ సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో ప్రస్తుతం 2వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. మెస్‌ చార్జీలను 10 శాతం పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా వారికి మేలు చేకూరనుంది. అలాగే జిల్లాలోని గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు ఇలా దాదాపు 55 వసతి గృహాల్లో 6వేల మంది వరకు విద్యార్థులు ఉన్నారు. వారందరికీ కూడా నాణ్యమైన పోషకాహారం అందనుంది. గతంలో 3 నుంచి 5 శాతం అది కూడా ఎన్నో ఏళ్లకొకసారి పెంచేవారు. కానీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ చొరవతో విద్యాభివృద్ధికి ఎన్నో సౌకర్యాలు ఒనగూరుతున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం మెస్‌ చార్జీలను 10 శాతం పెంపుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

Updated Date - Jul 12 , 2026 | 02:06 AM