పాడి రైతుకు బాసట
ABN , Publish Date - Nov 15 , 2026 | 02:33 AM
పాడి రైతులకు బాసటగా నిలిచేలా ప్రభుత్వం మరో పథకాన్ని ఈ ఏడాది అమలు చేయనుంది. పశుపోషకులకు గ్రాసం ఇక్కట్లు తీర్చేందుకు భారీ రాయితీతో పశుగ్రాస పెంపకం కార్యక్రమాన్ని చేపడుతోంది.
పశుగ్రాసం పెంపునకు భారీ రాయితీ
వీబీ జీరామ్‌జీ ద్వారా గరిష్ఠంగా రూ.70వేలు
ఇప్పటికే పూర్తయిన లబ్థిదారుల గుర్తింపు
1,210 ఎకరాల్లో సాగుకు ప్రతిపాదనలు
సామాజికంగానూ పెంపునకు అవకాశం
పశుపోషకులకు ఉచితంగా విత్తనాలు, శిక్షణ
ఒంగోలు, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : పాడి రైతులకు బాసటగా నిలిచేలా ప్రభుత్వం మరో పథకాన్ని ఈ ఏడాది అమలు చేయనుంది. పశుపోషకులకు గ్రాసం ఇక్కట్లు తీర్చేందుకు భారీ రాయితీతో పశుగ్రాస పెంపకం కార్యక్రమాన్ని చేపడుతోంది. వీబీ జీరామ్‌జీ (ఉపాధి) పథకం ద్వారా దీనిని అమలు చేయనుంది. రెండేళ్లలో గరిష్ఠంగా ఒక్కో లబ్ధిదారునికి ఎకరాకు రూ.69,781 అందనుంది. గతంలో పాడిరైతులకు ఉపకరించేలా ఉపాధి పథకం మెటీరియల్ కోటా నిధులతో పెద్దఎత్తున పశువుల షెడ్ల నిర్మాణాలను ప్రభుత్వం చేపట్టిన విషయం విదితమే. ఒక్కో లబ్ధిదారునికి రూ.2లక్షల వరకు అందుకోసం రాయితీగా ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ కార్యక్రమం విజయ వంతంగా అమలుచేయగా జిల్లాలో మూడువేలకుపైగా షెడ్ల నిర్మాణాలు జరిగాయి. కాగా ప్రస్తుత సీజన్లో పశుగ్రాసం పెంపును ఉపాధి ద్వారా అమలుకు ప్రభుత్వం నిర్ణయిం చింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో చాలా జిల్లాల్లో ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక పంటలు సాగు కాలేదు. కనీస స్థాయిలో కూడా పశుగ్రాస పంటలు సాగే కాక, చాలా ప్రాంతాల్లో పొలాల్లో పచ్చిగడ్డి కూడా దొరక్క పాడి పశువులు అల్లాడుతున్నాయి. దీంతో సమస్యను అధిగమించేందుకు వీబీ జీరామ్‌జీ పథకం నిధులతో పశుపోషకులు పశుగ్రాసం పెంపకం చేసుకునేలా ఊతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పశుగ్రాసం పెంపునకు ప్రోత్సాహం
ఆ పథకం కింద జాబ్ కార్డు కలిగిన చిన్న, సన్నకారు అలాగే ఎస్సీ,ఎస్టీ రైతు లకు చెందిన వ్యక్తిగత భూముల్లో రెండేళ్లపాటు పశుగ్రాసం సాగు, నిర్వహణకు ఆర్థిక సహాయం అందివ్వనున్నారు. రెండు పశువులు ఉన్న వారికి పావు ఎకరం, ఐదు పశువుల వరకు అర ఎకరం, ఐదు కన్నా ఎక్కువ పశువులు ఉన్న వారికి ఎకరా వరకు పశుగ్రాసం సాగుకు రాయితీ అందివ్వనున్నారు. అలా ఎకరాకు గరిష్ఠంగా రెండేళ్లలో రూ.69,781 మేర రాయితీగా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమకానుంది. మేలురకం పశుగ్రాస విత్తనాలు సరఫరాతోపాటు సాగు విధానంపై శిక్షణ కూడా ఇవ్వనున్నారు. పశుసంవర్థకశాఖ ద్వారా లబ్ధిదారులైన పశుపోషకుల ఎంపిక, వారికి శిక్షణ ఇస్తారు. డ్వామా ద్వారా వీబీ జీరామ్‌జీ కింద నిధులు సమకూర్చుతారు. కాగా జిల్లాలో ఇప్పటికే 1,466 మంది లబ్ధిదారులను పశుసంవర్ధకశాఖ అధికారులు గుర్తించారు. వారికి సంబంధించిన 1,210 ఎకరాలలో పశుగ్రాసం సాగుకు ప్రతిపాదించారు. ఆ మేరకు రైతువారీ జాబితాలను డ్వామా కార్యాలయానికి పంపారు.
ఎన్నికల కోడ్‌తో ఆలస్యం
ప్రస్తుతం ఎన్నికలక కోడ్ అమలు నేపథ్యంలో అధికారికంగా మంజూరు ఉత్తర్వులు కాస్తంత ఆలస్యమైనప్పటికీ ఎంపికైన లబ్ధిదారుల గ్రాసం సాగుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలాఉండగా సామూహికంగా పశుగ్రాసం సాగుకు అవకాశం ఉన్నచోట గరిష్ఠంగా పది ఎకరాలలో సాగు చేసేందుకు కూడా భారీ రాయితీతో అవకాశం ఇవ్వనున్నారు. ఏదైనా గ్రామంలో ప్రభుత్వ లేదా వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖకు చెందిన ఖాళీ భూముల్లో బహువార్షిక పశుగ్రాస పంటలు సాగుకు ముందుకు వచ్చే గ్రామంలోని డ్వాక్రా సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, గ్రామీణ ఇతర సహకార సంస్థలకు ఈ రాయితీ మొత్తాలను ఇచ్చే అవకాశం ఉంది. పశుగ్రాస సాగుకు ముందు, కోతల తర్వాత నిర్దేశిత యాప్‌లో జియోట్యాగింగ్ ఫొటోలు అప్లోడ్ ద్వారా అక్రమాలను అరికట్టేలా ప్రభుత్వం ఆదేశించింది.