నీటిని శుద్ధి చేయకుండానే సరఫరా
ABN , Publish Date - Jan 28 , 2026 | 12:33 AM
మండలంలో మార్టూరు తర్వాత రెండో గ్రామంగా వలపర్ల గ్రామం నిలుస్తుంది. ఇంతటి పెద్దగ్రామానికి ఏళ్ల తరబడి చెరువునీటినే ఫిల్టర్ చేయకుండా వదులుతున్నారు.
మార్టూరు,జనవరి27(ఆంధ్రజ్యోతి): మండలంలో మార్టూరు తర్వాత రెండో గ్రామంగా వలపర్ల గ్రామం నిలుస్తుంది. ఇంతటి పెద్దగ్రామానికి ఏళ్ల తరబడి చెరువునీటినే ఫిల్టర్ చేయకుండా వదులుతున్నారు. దీంతో ఆ నీటిని వినియోగించలేని దుస్థితి నెలకొంది.
వలపర్లలో దాదాపుగా 9 వేల మంది ఓటర్లు ఉన్నారు. జనాభా 12 వేలుకు పైగానే ఉంది. ప్రజల తాగునీటి అవసరాలను తీర్చడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మంచినీటి చెరువు ఉంది. ఈ చెరువు నుంచి నీళ్లు బావిలోకి చేరడం, అనంతరం బావి నుంచి నీరును ఓవర్‌హెడ్ ట్యాంక్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి పైప్‌లైన్ల ద్వారా ప్రజలకు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఇదీ ఎంతో కాలం నుంచి వలపర్లలో జరుగుతున్నతంతు. అయితే ఈ తాగునీటిని ప్రజలు ఎక్కువగా వినియోగించడం లేదు. దాదాపుగా అందరూ ప్రైవేటుగా ఆర్ ప్లాంట్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. చెరువునీరు కలుషితంగా ఉండడంతో గ్రామస్థులు పంచాయతీ వారు సరఫరా చేసే మంచినీటిపై ఆధారపడటం లేదు. అంతేగాకుండా బావిలోని నీరును ఫిల్టర్ బెడ్స్ లేకుండా నేరుగా సరఫరా చేస్తున్నారు. దీంతో ప్రజలు ఈ నీటిని వినియోగించుకోవడానికి విముఖత చూపుతున్నారు. దీనికి తోడు గ్రామంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఓవర్ హెడ్‌ట్యాంక్ నుంచి నీరు, గ్రామంలోని అన్ని కాలనీలకు సరఫరా కావడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్‌కు లక్ష లీటర్లు సామర్థ్యం ఉంది. అదనంగా మరో ఓ వర్ హెడ్ ట్యాంక్ ను నిర్మించవలసిన అవసరం ఉంది. గ్రామంలో రక్షిత మంచినీటి పథకంలో మార్పులు చేయాలని, ప్రజలకు పూర్తిగా మంచినీటిని సరఫరా చేయాలని గ్రామస్థులు పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకుపోయారు. వాస్తవంగా కోనంకి ఎన్‌ఎస్పీ పరిధిలో మెయిన్ కాలువకు సాగర్ జలాలు వచ్చినపుడు, రాజుపాలెం మేజరుద్వారా, మొదట వలపర్ల చెరువుకు జలాలు సులభంగా చేరతాయి. సాగర్ కాలువ నుంచి సుమారు 300 మీటర్లలోపే వలపర్ల చెరువు ఉంది. దీంతో కాలువకు నీళ్లు వస్తే వలపర్ల చెరువులోకి నీళ్లు చేరినట్లే. అందువలన చెరువులో నీరు ఎప్పడూ సమృద్దిగా ఉంటుంది. రక్షిత మంచినీటి పథకంలో అదనంగా మరో ఓవర్ హెడ్ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లు ఏర్పాటుచేస్తే ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందించే అవకాశం ఉంది.