ఎండ మండే
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:50 AM
జిల్లాపై సూర్యప్రతాపం కొనసాగుతోంది. ఎండ మండిపోతోంది. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల నుంచి సుర్రుమంటున్న సూర్యుడు సోమవారం మరింత రెచ్చిపోయాడు.
కొనసాగుతున్న సూర్యప్రతాపం
21 మండలాల్లో 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రత
బల్లికురవలో 44.8 డిగ్రీలు నమోదు
ఒంగోలు కలెక్టరేట్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి) : జిల్లాపై సూర్యప్రతాపం కొనసాగుతోంది. ఎండ మండిపోతోంది. భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. వారం రోజుల నుంచి సుర్రుమంటున్న సూర్యుడు సోమవారం మరింత రెచ్చిపోయాడు. నిప్పులు కురిపించాడు. జిల్లాలో 28 మండలాలు ఉండగా 21 మండలాల్లో 40 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రత నమోదైంది. బల్లికురవ మండలంలో అత్యధికంగా 44.8 డిగ్రీల ఎండ కాచింది. దొనకొండలో 42.8, అద్దంకిలో 42.8, మర్రిపూడిలో 42.5, పొన్నలూరులో 42.3, కందుకూరులో 42.3, లింగసముద్రంలో 42.2, వలేటివారిపాలెంలో 42.2, ముండ్లమూరులో 42.0, కొండపిలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది తాళ్లూరు మండలంలో 41.7, సంతనూతలపాడులో 41.6, ఒంగోలు అర్బన్‌లో 41.0, చీమకుర్తిలో 40.9, కురిచేడులో 40.6, జరుగుమల్లిలో 40.5, టంగుటూరులో 40.5, మద్దిపాడులో 41.3, సంతమాగులూరులో 40.2, దర్శిలో 40.1 డిగ్రీలుగా ఉంది. ఎండల తీవ్రతతో వృద్ధులు, చిన్నారులు విలవిల్లాడారు. మున్ముందు పరిస్థితిని ఊహించుకొని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.