ఎండప్రచండం
ABN , Publish Date - May 03 , 2026 | 01:34 AM
సూరీడు సెగలు కక్కుతున్నాడు. రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మార్కాపురం జిల్లాపై నిప్పు లు కురిపిస్తున్నాడు. భానుడి ప్రతాపానికి వడగాడ్పులు తోడయ్యాయి.
నిప్పులు కురిపించిన భానుడు
ఏడు మండలాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత
పీసీపల్లిలో 45.1, పామూరులో 45 డిగ్రీలు నమోదు
మార్కాపురం, మే 2 (ఆంధ్రజ్యోతి) : సూరీడు సెగలు కక్కుతున్నాడు. రోజురోజుకూ ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మార్కాపురం జిల్లాపై నిప్పు లు కురిపిస్తున్నాడు. భానుడి ప్రతాపానికి వడగాడ్పులు తోడయ్యాయి. దీంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటిన తర్వాత గడపదాటి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఈలోపు పనులను చక్కబెట్టుకుని ఇళ్లకు చేరుతున్నారు. దీంతో ప్రధాన పట్టణా ల్లోని రోడ్లు మధ్యాహ్న సమయంలో నిర్మానుష్యంగా మారుతున్నాయి. గత కొద్దిరోజులుగా మంటపుట్టిస్తున్న సూరీడు శనివారం మోతాదు పెంచాడు. జిల్లాలో మొత్తం 21 మండలాలకుగాను 7 మండలాల్లో 44 డిగ్రీలకుపైన ఉష్ణోగ్రత నమోదైంది. పీసీపల్లిలో అత్యధికంగా 45.1, పామూరులో 45 డిగ్రీల ఎండ కాచింది. దోర్నాల మండలంలో 44.2 డిగ్రీలు, కనిగిరిలో 44.3, మార్కాపురంలో 43.9, పెద్దారవీడులో 44, పీసీపల్లిలో 45.1, రాచర్లలో 44.4, త్రిపురాంతకంలో 44.5, ఎర్రగొండపాలెంలో 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఠారెత్తిపోయారు. సాయంత్రం 5గంటల వరకూ ‘కాక’ తగ్గకపోవడంతో ప్రజలు వీధుల్లోకి రాలేదు. కనిగిరి, మార్కాపురం, పామూరు, పీసీపల్లి, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం మండలాల్లో శనివారం వడగాడ్పులు వీచాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, 47 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.