ఎండప్రచండం
ABN , Publish Date - May 21 , 2026 | 03:38 AM
జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. రోహిణి కార్తె రాకముందే సూర్యుడు చెలరేగిపోతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సెగలు కక్కుతున్నాడు.
జిల్లాలోని 25 మండలాల్లో 40డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు
అత్యధికంగా కొండపిలో 45.6 డిగ్రీలు నమోదు
నేడు ఏడు మండలాలకు ఆరెంజ్ అలర్ట్
ఒంగోలు కలెక్టరేట్, మే 20 (ఆంధ్రజ్యోతి) : జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. రోహిణి కార్తె రాకముందే సూర్యుడు చెలరేగిపోతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే సెగలు కక్కుతున్నాడు. దీంతో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతున్నాయి. వడగాడ్పుల తీవ్రత కూడా అధికమవడంతో జనం అల్లాడుతున్నారు. సాయంత్రం ఆరు గంటల వరకు సెగ తగ్గకపోతుండటంతో వృద్ధులు, చిన్నారులు విలవిల్లాడుతున్నారు. జిల్లాలో 28 మండలాలు ఉండగా 25 మండలాల్లో బుధవారం 40డిగ్రీలకుపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కొండపి మండలంలో 45.6డిగ్రీల ఎండ కాచింది. సంతనూతలపాడు మండలంలో 44.7, ఒంగోలు రూరల్‌లో 44.5, పొన్నలూరులో 44.2, కందుకూరులో 44.2, బల్లికురవలో 43.9, టంగుటూరులో 43.7, తాళ్లూరులో 43.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అది కురిచేడు మండలంలో 43.6, నాగులుప్పలపాడులో 43.5, ఉలవపాడులో 43.4, సింగరాయకొండలో 43.4, కొత్తపట్నంలో 43.3, అద్దంకిలో 43.1, వలేటివారిపాలెంలో 43.1, దర్శిలో 43.0, లింగసముద్రంలో 43.0, జరుగుమల్లిలో 42.7, జె.పంగులూరులో 42.4, గుడ్లూరులో 42.1 డిగ్రీలుగా ఉంది. గురువారం అద్దంకి, బల్లికురవ, జె.పంగులూరు, సంతమాగులూరు, మద్దిపాడు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాలకు అరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ ప్రకటించింది.