వేసవి పత్తి.. సాగు జాస్తి
ABN , Publish Date - Apr 28 , 2026 | 01:54 AM
మార్కాపురం జిల్లాలో వేసవి పత్తిసాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. గత సంవత్సరం అల్పపీడనాలు, తుఫాన్‌ల నేపథ్యంలో చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి.
ఈ ఏడాది భారీగా పెరిగిన విస్తీర్ణం
జిల్లావ్యాప్తంగా 7,250 ఎకరాల్లో పంట
చెరువుల్లో నీరు ఉండటం, భూగర్భ జలాలు పెరగడమే కారణం
మార్కాపురం టౌన్, ఏప్రిల్ 27 (ఆంధ్రజ్యోతి): మార్కాపురం జిల్లాలో వేసవి పత్తిసాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. గత సంవత్సరం అల్పపీడనాలు, తుఫాన్‌ల నేపథ్యంలో చెరువులు, కుంటలు పూర్తిగా నిండాయి. భూగర్భ జలాలు మునుపెన్నడూలేని విధంగా పైకివచ్చాయి. దీంతో పత్తిసాగు కూడా పెరిగింది. ఇప్పటి వరకూ 7,250 ఎకరాల్లో రైతులు పంట సాగు చేశారు. ఇంకా 1,250 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. వరి కోతల అనంతరం సాగైన పత్తి ప్రస్తుతం విరుపులకు వచ్చింది. మంచి నేలల్లో 7 నుంచి 10, గరప నేలల్లో 5 నుంచి 7 క్వింటాళ్ల వరకు దిగుబడి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్కెట్‌లో ఽధరలు కూడా స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం సీసీఐ ద్వారా నాణ్యతను బట్టి క్వింటా రూ.8,000 నుంచి రూ.8,500 వరకు ధరతో కొనుగోలు చేస్తున్నారు.
గతంలో 2,500 ఎకరాలు మించని వైనం
మార్కాపురం జిల్లాలో వేసవి పత్తిసాగు నీటి వనరులున్న చోట మాత్రమే చేస్తారు. సరాసరి 2,500 ఎకరాలకు మించి ఈ సీజన్‌లో సాగు ఉండదు. కానీ గత సంవత్సరం అధిక వర్షాలు కురిసి భూగర్భ జలాలు పెరగడంతో ప్రస్తుత సీజన్‌లో రైతులు ఉత్సాహంగా పత్తి సాగు చేశారు. వాస్తవానికి పత్తి సాగుకు సంబం ధించి వ్యవసాయశాఖ అధికారులు పంట నమోదు కూడా చేపట్టలేదు. గ్రామస్థాయిలోని వ్యవసాయ సహా యకులకు ఇచ్చిన యాప్‌లు రబీతోనే ఆగిపోయాయి. దీని కారణంగా పంట నమోదు ఎంత అనేది పూర్తిస్థాయిలో కచ్చితంగా తెలిసే అవకాశం లేదని వ్యవసాయశాఖ అఽధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పత్తి సాగు విస్తీర్ణం 7,250 ఎకరాల వరకూ ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా రాచర్ల, అర్థవీడు, కంభం, తర్లుపాడు, మార్కాపురం, పొదిలి, పీసీపల్లి, సీఎస్ పురం, పెద్దారవీదు, పెద్దదోర్నాల, పుల్లలచెరువు మండలాల్లో ఈ సంవత్సరం పత్తి ఎక్కువగా సాగైంది. గతంలో వరి కోతలు ముగిసిన వెంటనే పెసర, మినుములాంటి పైర్లు వేసే రైతులు ఈ ఏడాది పత్తి సాగు చేశారు. దీంతో విస్తీర్ణం పెరిగింది.