రిమ్స్‌లో అరుదైన వ్యాధికి చికిత్స విజయవంతం
ABN , Publish Date - Jun 22 , 2026 | 10:39 PM
ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన వ్యాధికి విజయవంతంగా చికిత్స అందించామని, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్సకు జీజీహెచ్ వైద్యులు ఉచితంగా అందించి నయం చేశారని జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్‌కుమార్ చెప్పారు.
ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని
ఒంగోలు కార్పొరేషన్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అరుదైన వ్యాధికి విజయవంతంగా చికిత్స అందించామని, ప్రైవేటు ఆసుపత్రుల్లో రూ.లక్షల్లో ఖర్చు అయ్యే చికిత్సకు జీజీహెచ్ వైద్యులు ఉచితంగా అందించి నయం చేశారని జీజీహెచ్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్‌కుమార్ చెప్పారు. ఆసుపత్రిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒంగోలులోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో క్యాత్‌లాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న నాగేశ్వరరెడ్డికి అకస్మాత్తుగా చేతులు పట్టుకోల్పోవడం, మరో రెండు రోజులకు కాళ్లు పటుత్వం తప్పిపోవడంతోపాటు అన్నం తినడం కూడా కష్టమైన పరిస్థితుల్లో జీజీహెచ్‌కు విచ్చేసినట్లు తెలిపారు. వైద్యులు సకాలంలో స్పందించి వైద్యం అందించగా పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి వచ్చాడని డాక్టర్ కిరణ్ తెలిపారు. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మరో రెండు రోజుల్లో ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు. వైద్య భాషలో ఈ వ్యాధిని గిలియన్-బారే సిండ్రోమ్ అంటారని, ప్రైవేటు ఆసుపత్రులోఈ వైద్యానికి రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని వివరించారు. జీజీహెచ్ న్యూరాలజీ విభాగం వైద్య నిపుణులు హరి.. రోగిని పరీక్షించి, ప్రాథమికంగా నర్వ్ కండీషన్ స్టడీ చేశారన్నారు. అవసరమైన చికిత్స అందించడం ద్వారా వ్యాధి నయమైనట్లు తెలిపారు. డాక్టర్ హరి మాట్లాడుతూ నాడీ వ్యవస్థ దెబ్బతిని రక్త ప్రసరణ సక్రమంగా జరగనపుడు శరీరం చచ్చుపడిపోతుందని తెలిపారు. కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం బాధితుడు పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. సమావేశంలో సీఎ్‌సఆర్‌ఎం డాక్టర్ మాధవీలత, డాక్టర్ సునీల్ గవాస్కర్ పాల్గొన్నారు.