Share News

రిచ్‌గా రికవరీలు

ABN , Publish Date - Aug 25 , 2026 | 11:19 PM

దొంగలను పట్టుకోవడం పోలీసు శాఖ ప్రధానమైన విధుల్లో ఒకటి. వారిని పట్టుకుంటే పోలీసులకు, వారి వద్ద చోరీ సొత్తు రికవరీ చేసి అప్పగిస్తే బాధితులకు ఎంతో సంతృప్తి మిగులుతుంది. జిల్లా పోలీసులు ఇటీవల కాలంలో జరిగిన దొంగతనాలకు సంబంధించి చోరీ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభచూపారు.

రిచ్‌గా రికవరీలు
సోహైల్‌ నుంచి స్వాధీనం చేసుకున్న భారీ సొత్తు(ఫైల్‌)

జిల్లాలో గత 8 నెలల్లో జరిగిన చోరీల్లో రూ.4.33 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం

దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు

బాధితులకు అండగా పోలీసులు

ఒంగోలు క్రైం, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి) : దొంగలను పట్టుకోవడం పోలీసు శాఖ ప్రధానమైన విధుల్లో ఒకటి. వారిని పట్టుకుంటే పోలీసులకు, వారి వద్ద చోరీ సొత్తు రికవరీ చేసి అప్పగిస్తే బాధితులకు ఎంతో సంతృప్తి మిగులుతుంది. జిల్లా పోలీసులు ఇటీవల కాలంలో జరిగిన దొంగతనాలకు సంబంధించి చోరీ సొత్తును రికవరీ చేయడంలో ప్రతిభచూపారు.

ఆరు బృందాలతో దొంగల గాలింపు

దొంగలను పట్టుకోవడానికి ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేకమైన విధానాన్ని అవలంబిస్తున్నారు. పోలీసు అధికారులు, సిబ్బందిలో దొంగలను పట్టుకోవాలనే ఉత్సాహంతో పాటు, నేరాలపై దర్యాప్తు చేయడంలో ప్రతిభ కలిగిన వారిని ఆరు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేశారు. చోరీలు జరిగాక వెంటనే ఆ బృందాలు రంగంలోకి దిగుతాయి. ఎవరి కోణంలో వారు ఆధారాలు రాబట్టే పనిలో నిమగ్నమవుతారు. ఏదైనా క్లూ దొరికిన వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఆ దిశగా దర్యాప్తు వేగవంతం చేసి ఫలితాలు సాధిస్తున్నారు.

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన దొంగ సోహైల్‌ను ఒంగోలు తాలూకా పోలీసులు పట్టుకొని రూ.1.33 కోట్లు రికవరీ చేశారు. ఒక్కరోజు ఒంగోలులో పగటిపూట రెండు దొంగతనాలు చేసి మోటార్‌ బైక్‌పై పరారీ అయిన సోహైల్‌ను పట్టుకోవడంలో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. అతనిని పట్టుకుని మొత్తం 7 కేసులలో భారీ రికవరీ చేశారు.


8 నెలల కాలంలో రూ.4.33 కోట్లు రికవరీ

జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 20 వరకు జరిగిన చోరీల్లో రూ.4.33 కోట్ల విలువైన ఆస్తిని పోలీసులు రికవరీ చేశారు. మొత్తం 367 ఆస్తి దొంగతనాలు జరగగా, 212 కేసులలో 190 మంది నిందితులను అరెస్టు చేశారు. మొత్తం ప్రాపర్టీ రూ.5.41కోట్లు విలువైన సొత్తును దొంగలు దోచుకున్నారు. దానిలో రూ.4.33 కోట్ల ఆస్తిని రికవరీ చేశారు.

దొంగలను పట్టుకోవడం ముఖ్యమైన టాస్క్‌

ఎస్పీ హర్షవర్ధనరాజు

శాంతిభద్రతల పరిరక్షణతో పాటు దొంగలను పట్టుకోవడంలో గొప్ప సంతృప్తి కూడా ఉంటుంది. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని దొంగలు అపహరిస్తే వారి ఆవేదన అంతాఇంతా కాదు. అలాంటి వారికి అండగా పోలీసు శాఖ నిలుస్తుంది. దొంగలను పట్టుకొని చోరీ చేసిన సొత్తును తిరిగి వారికి ఇప్పించడంలో గట్టి కృషి చేస్తున్నాం. అందుకోసమే జిల్లాలో 50 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. దొంగతనాలు జరిగిన వెంటనే ఆరు బృందాలు అక్కడకు చేరి దర్యాప్తు కొనసాగిస్తాయి.

Updated Date - Aug 25 , 2026 | 11:19 PM