రైతు బజార్లలో సబ్సిడీపై ఉల్లిపాయలు
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:27 PM
సామాన్య ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్న ఉల్లిపాయలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. రైతు బజార్లలో కిలో రూ.35కు విక్రయాలను ఆదివారం నుంచి ప్రారంభించింది.
కిలో రూ.35కు అందజేస్తున్న ప్రభుత్వం
జిల్లాకు తొలివిడత 10 టన్నుల కేటాయింపు
ఒంగోలులో అమ్మకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల
ఒంగోలు కలెక్టరేట్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి) : సామాన్య ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్న ఉల్లిపాయలను ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తోంది. రైతు బజార్లలో కిలో రూ.35కు విక్రయాలను ఆదివారం నుంచి ప్రారంభించింది. జిల్లాకు తొలివిడత 10 టన్నులు కేటాయించింది. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెరుగుతున్న నిత్యావసర ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. రెండు నెలల క్రితం బియ్యం ధరలు భగ్గుమనడంతో రైతు బజార్లు, రైసు మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్‌లను ఏర్పాటు చేసి తక్కువ ధరకు విక్రయించింది. ఇప్పుడు బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధర కిలో రూ.70కు చేరడంతో సబ్సిడీపై రూ.35కే రైతు బజార్లలో విక్రయాలను చేపట్టింది. జిల్లా కేంద్రమైన ఒంగోలులో మూడు, కందుకూరులోని ఒక రైతు బజార్‌లో ఆదివారం నుంచి ఉల్లిపాయల అమ్మకాలను అధికారులు ప్రారంభించారు. ఒక్కో కుటుంబానికి నెలకు రెండు కిలోల చొప్పున ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్‌లో ఉన్న రైతు బజార్‌లో ఉల్లిపాయల కౌంటర్‌ను స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. గుర్తింపు కార్డులు ఉన్న వారికి రెండు కిలోల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం సబ్సిడీపై ఇస్తున్న ఉల్లిపాయలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఒడా చైర్మన్ షేక్ రియాజ్, డీఎ్‌సవో పద్మశ్రీ, మార్కెటింగ్ శాఖ ఏడీ వరలక్ష్మితోపాటు వివిధ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.