Share News

బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం

ABN , Publish Date - May 27 , 2026 | 03:26 AM

రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయంపై అవసరమైన అంచనాకు డెడికేటెడ్‌ కమిషన్‌ కృషి చేస్తుందని కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌మిశ్రా తెలిపారు.

బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం
సమావేశంలో మాట్లాడుతున్న రాజీవ్‌రంజన్‌ మిశ్రా

శాతాన్ని నిర్ణయించేందుకు డెడికేటెడ్‌ కమిషన్‌ కృషి

చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌మిశ్రా.. అధికారులతో సమావేశం

ఒంగోలు కలెక్టరేట్‌, మే 26 (ఆంధ్రజ్యోతి) : రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయంపై అవసరమైన అంచనాకు డెడికేటెడ్‌ కమిషన్‌ కృషి చేస్తుందని కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌మిశ్రా తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం, వినతుల స్వీకరణలో భాగంగా మంగళవారం కలెక్టరేట్‌లోని మీకోసం హాలులో కలెక్టర్‌ రాజాబాబుతో కలిసి జడ్పీ, మునిసి పాలిటీ, గ్రామపంచాయతీ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయ న మాట్లాడారు. బీసీ జనాభా శాతం, రిజర్వేషన్‌ పరిమితులపై కమిషన్‌ సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. అందులో భాగంగా ఏకీకృత కుటుంబ సర్వే (యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వే) సమగ్రంగా నిర్వహించి కచ్చితమైన సమాచారాన్ని సేకరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెనుకబడిన వర్గాల రిజర్వేషన్ల అమలుకు ఈ సమాచారం ఎంతో కీలకమవుతుందన్నారు. పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలో బీసీ కులాలకు సంబంధించి సేకరించే డేటా మ్యాపింగ్‌ పక్కాగా ఉండాలని తెలిపారు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల ద్వారా జరిగే సర్వే ప్రక్రియలను పూర్తిగా పరిశీలిస్తూ సంబంధిత సమాచారాన్ని పంచాయతీరాజ్‌, మునిసిపల్‌ కార్పొరేషన్‌ విభాగాలు సరిచూసుకోవాలన్నారు. గత ఎన్నికల్లో బీసీ వర్గాలకు కేటాయించిన సీట్లు, మొత్తంలో వారి ప్రాతినిథ్యం నిష్పత్తి వివరాలు సేకరించి కమిషన్‌కు అందజేయాలన్నారు. యూనిఫైడ్‌ ప్యామిలీ సర్వే ఖచ్చితత్వంగా ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఆ డేటాను కమిషన్‌ విశ్వసనీయంగా ఉపయోగించుకుంటుందని తెలిపారు. 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల విడుదలకు ఎన్నికలు తప్పనిసరన్నారు. జనాభా వివరాలు, ఓటర్ల సంఖ్య, బీసీ ఓటర్ల నిష్పత్తి వంటి అంశాలను పరిశీలిస్తూ సంబంధిత వివరాలను క్రాస్‌ చెక్‌ చేసుకోవాలన్నారు. కుల సంఘాల ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న సమస్యలను విని వాటిలో కమిషన్‌ పరిధిలో ఉన్న అంశాలను నమోదు చేసి పరిశీలిస్తున్నామని తెలిపారు. కమిషన్‌ పరిధిలోకి నేరుగా రాని అంశాలు వచ్చినప్పటికీ ప్రజల వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొనే దిశగా వాటిని కూడా రికార్డుల్లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ రాజాబాబు మాట్లాడుతూ జిల్లాలో ఏకీకృత కుటుంబ సర్వే సమగ్రంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని బాధ్యులుగా నియమించి పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. నాణ్యమైన సర్వేకు అవసరమైన ఖచ్చిత సమాచారం సేకరిస్తామని పేర్కొన్నారు. జిల్లా జనాభా గణాంకాలు, బీసీ వర్గాల ప్రాతినిథ్యం వంటి అంశాలపై కమిషన్‌కు సమగ్ర వివరాలు అందజేసినట్లు రాజాబాబు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్‌, మునిసిపాలిటీలు, గ్రామ పంచాయతీల వారీ సీట్ల సంఖ్య, అందులో గత ఎన్నికల్లో బీసీ వర్గాల ప్రాతినిథ్యం, సీట్ల వివరాలను సంబంధిత అధికారులు కమిషన్‌కు వివరించారు. కార్యక్రమంలో డెడికేటెడ్‌ కమిషన్‌ సెక్రటరీ డి. చంద్రశేఖర్‌రాజు, అధికారులు చిరంజీవి, ఎం.వెంకటేశ్వరరావు, లక్ష్మానాయక్‌, నిర్మలాజ్యోతి, శ్రీనివాసులరెడ్డి, మునిసిపల్‌ కమిషనర్లు, డీఎల్‌డీవోలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వినతిపత్రాలను స్వీకరించారు.

Updated Date - May 27 , 2026 | 03:26 AM