ఈతకు వెళ్లి విద్యార్థి మృతి
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:23 PM
సెలవు రోజు కావడంతో తోటి స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి మృత్యువుకు బలయ్యాడు. ఈ ఘటన ఆదివారం త్రిపురాంతకం మండలంలోని గోళ్లపల్లిలో చోటుచేసుకుంది.
చెరువుకు కంచె లేదని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించిన బంధువులు
ఎర్రగొండపాలెం రూరల్/త్రిపురాంతకం, జూలై 12 (ఆంధ్రజ్యోతి) : సెలవు రోజు కావడంతో తోటి స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన విద్యార్థి మృత్యువుకు బలయ్యాడు. ఈ ఘటన ఆదివారం త్రిపురాంతకం మండలంలోని గోళ్లపల్లిలో చోటుచేసుకుంది. గ్రామస్థులు, బంధువులు, పోలీసుల సమాచారం మేరకు.. గ్రామానికి చెందిన ఉప్పలపాటి పిచ్చయ్య కుమారుడు తిరుమలబాబు (15) తన తోటి మిత్రులతో కలసి గ్రామ సమీపంలోని సమ్మర్ స్టోరేజీ(చెరువులో) ఈతకు వెళ్లారు. ఈత కొట్టేందుకు దిగి జారి ఊపిరి ఆడక తిరుమలబాబు కేకలు వేయడంతో తోటి స్నేహితులు పైకి లాగే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. చెరువు చుట్టూ కంచె లేకనే ఈ ప్రమాదం జరిగిందని, తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత బంధువులు విజయవాడ - అనంతపురం జాతీయ రహదారిపై బైటాయించి నిరసన తెలిపారు. వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ శివరామయ్య సిబ్బందితో చేరుకున్నారు. బాధితులతో మాట్లాడి నచ్చజెప్పారు. అయినా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే కూర్చున్నారు. రెండు గంటల పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అటుగా వెళ్తున్న ప్రభుత్వ చీఫ్ విప్, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వాహనాన్ని ఆపి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడారు. చెరువుకు కంచె ఏర్పాటు చేయాలని లేకుంటే చెరువును తొలగించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ విజయసునీతతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యను పరిష్కరించాలని సూచించారు. దాంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. అనంతరం తక్షణ సాయంగా రూ.10వేలను అందజేశారు.