రెండో రోజు జోరు
ABN , Publish Date - Nov 17 , 2026 | 02:46 AM
పల్లె పోరులో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. తొలిదశ ఎన్నికలు జరుగుతున్న ఒంగోలు, కొండపి నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లోని పంచాయతీలకు సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి.
పంచాయతీలకు ఉత్సాహంగా నామినేషన్లు
భారీ ర్యాలీలతో దాఖలు చేసిన కూటమి మద్దతుదారులు
నేటితో తొలిదశకు ముగియనున్న గడువు
రెండో విడతకు ఎస్ఈసీ నోటిఫికేషన్
రేపటి నుంచి వాటిలో నామినేషన్లు
పల్లె పోరులో కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ఉత్సాహంగా సాగుతోంది. తొలిదశ ఎన్నికలు జరుగుతున్న ఒంగోలు, కొండపి నియోజకవర్గాల పరిధిలోని ఎనిమిది మండలాల్లోని పంచాయతీలకు సోమవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా పలుచోట్ల టీడీపీ కూటమి మద్దతుదారులుగా పోటీలో దిగుతున్న అభ్యర్థులు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. వారికి మద్దతుగా టీడీపీ శ్రేణులు, స్థానిక ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీలకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది.
ఒంగోలు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక్కో విడత రెండేసి నియోజకవర్గాల్లోని పంచాయతీల్లో నిర్వహిస్తున్నారు. అందులో తొలి దశ ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లోని ఎనిమిది మండలాల్లో ఉన్న 139 పంచాయతీల్లో సర్పంచ్లు, వాటి పరిఽధిలోని 1,396 వార్డు సభ్యుల ఎన్నికకు ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ జరుగుతోంది. వీటిలో ఆదివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా తొలిరోజు సర్పంచ్ పదవులకు 55, వార్డుసభ్యుల పదవులకు 94 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండోరోజైన సోమవారం ఆయా గ్రామాల్లో భారీగా నామినేషన్లను అభ్యర్థులు సమర్పిం చారు. ప్రక్రియ మంగళవారంతో ముగియనుండటం, సోమవారం మంచి రోజు కావడంతో రెండో రోజున వందలాది మంది నామినేషన్లను దాఖలు చే శారు. ఇటీవల జరిగిన పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కూటమి పూర్తి అధిక్యతను చాటింది. ప్రస్తుతం అత్యధిక పంచాయతీల్లోనూ ఆ పార్టీల మద్దతుదారులే భారీ ఆధిక్యాలతో గెలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పార్టీ గుర్తులు కాకుండా అందరూ అభ్యర్థులు స్వతంత్రులుగానే పోటీచేసే అవకాశం ఉండటంతో చాలా పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులే రెండు, మూడు గ్రూపులుగా ఏర్పడి పోటీపడుతున్నారు. అలా అనేక గ్రామాల్లో ఎన్నికల వేడి కనిపిస్తోంది. టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతలు దృష్టి సారించి అలాంటి గ్రామాల్లో సర్దుబాట్లు చేసి పార్టీ మొత్తంగా ఒక అభ్యర్థి పక్షానే నిలిచేలా ప్రయత్నిస్తున్నారు. అలా సర్దుబాటు కాని చోట పార్టీ మద్దతు ఫలానా అభ్యర్థికి అన్న సంకేతాలను కార్యకర్తలకు ఇస్తున్నారు.
అట్టహాసంగా నామినేషన్ల దాఖలు
కూటమి మద్దతు అభ్యర్థులపై స్పష్టత రావడంతో అధిక గ్రామాల్లో రెండో రోజైన సోమవారం నామినేషన్లు కార్యక్రమాలు ఉత్సాహంగా సాగాయి. కొన్నిచోట్ల సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్ల ర్యాలీలలో కీలక నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ డీఎస్బీవీ స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, మారిటైం బోర్డు దామచర్ల సత్యల స్వగ్రామమైన టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం సర్పంచ్ స్థానం ఈసారి జనరల్ మహిళకు రిజర్వు అయింది. దీంతో అక్కడి దామచర్ల సత్య తల్లి, పారిశ్రామికవేత్త పూర్ణచంద్రరావు సతీమణి అయిన విజయలక్ష్మి సర్పంచ్ స్థానానికి టీడీపీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. సోమవారం తూర్పునాయుడుపాలెంలో ఆమె నామినేషన్ దాఖలు చేయగా మంత్రి డాక్టర్ స్వామితోపాటు పూర్ణచంద్రరావు, సత్య, ఎమ్మెల్యే జనార్దన్ సోదరుడు డాక్టర్ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
మేజర్ పంచాయతీలలో ర్యాలీలు
జిల్లాలో పదివేల కన్నా అధికంగా ఓట్లు ఉండి పట్టణ ప్రాంతాలుగా గుర్తింపు ఉన్న మండల కేంద్రాలైన సింగరాయకొండ, టంగుటూరు పంచాయతీల్లో టీడీపీ మద్దతుదారులుగా పోటీచేస్తున్న అభ్యర్థులు సంధానిబాషా, బెల్లం జయంత్బాబులు పార్టీశ్రేణులతో కలిసి భారీ ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. వారి నామినేషన్ల కార్యక్రమంలో మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పాల్గొన్నారు. మండల కేంద్రమైన కొత్తపట్నం పంచాయతీలోనూ టీడీపీ మద్దతుదారులైన అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్లు దాఖలు చేశారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతర పంచాయతీల్లోనూ అలాగే కోలాహలంగా నామినేషన్లు సాగాయి.
అద్దంకి, దర్శిల నోటిఫికేషన్ వచ్చేసింది
తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. దీంతో రెండో దశ ఎన్నికలకు రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఈసీ సోమవారం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ ప్రకారం జిల్లాలోని అద్దంకి, దర్శి నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో రెండో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ రెండు నియోకవర్గాల్లోని పది మండలాల్లో 198 పంచాయతీలు ఉండగా వాటి సర్పంచ్ పదవులతోపాటు 2,014 వార్డుసభ్యుల పదవులకు ఈనెల 29న ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం సోమవారం ఎస్ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా 18వ తేదీ నుంచి 20 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సర్పంచ్లకు 447వార్డు పదవులకు 1,496
జిల్లాలోని ఒంగోలు, కొండపి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఎనిమిది మండలాల్లోని 139 సర్పంచ్ పదవులకు, 1,396 వార్డు సభ్యుల పదవులకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది. రెండోరోజైన సోమవారం సర్పంచ్ పదవులకు 447, వార్డు సభ్యులకు 1,496 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇప్పటి వరకూ మొత్తం సర్పంచ్ పదవులకు 502, వార్డు పదవులకు 1,590 అందాయి. కాగా నామినేషన్ల ప్రక్రియ మంగళవారం సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది. దీంతో ఆయా కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తును కల్పించారు. నామినేషన్ల దాఖలు సమయంలో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా నిరంతర నిఘా పెట్టారు. అలాగే అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసుకునే విధంగా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అందుకు అన్నీ సిద్ధం చేశారు.