Share News

‘కందుకూరు’ అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Jul 04 , 2026 | 11:01 PM

నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు అండగా నిలుస్తామని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి హామీ ఇచ్చారు.

‘కందుకూరు’ అభివృద్ధికి కృషి
ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు

ఈ విషయంలో ఎమ్మెల్యే ఇంటూరికి అండగా ఉంటాం

ఏఎంసీ పాలకవర్గ ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రులు ఆనం, డోలా స్వామి హామీ

కందుకూరు, జూలై 4(ఆంధ్రజ్యోతి) : నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకు అండగా నిలుస్తామని మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాలవీరాంజనేయస్వామి హామీ ఇచ్చారు. కందుకూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం శనివారం అట్టహాసంగా నిర్వహించారు. చైర్మన్‌గా రాయపాటి సుభాషిణి శ్రీనివాసరావు, వైస్‌ చైర్మన్‌ పొట్టేళ్ల మురళి, మరో 13మంది పాలకవర్గ సభ్యుల చేత మంత్రుల సమక్షంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ నియోజకవర్గం తమకు ప్రత్యేకమన్నారు. నిన్నటివరకూ నెల్లూరు జిల్లాలో ఉండి, ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉన్నా తాను ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ కందుకూరు, కొండపి నియోజకవర్గాలకు అవినాభావ సంబంధం ఉందన్నారు. ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, బీఎన్‌ విజయ్‌కుమార్‌, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో నాగేశ్వరరావు చేస్తున్న అభివృద్ధి చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంతో తమ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందన్నారు. ఎలాంటి సహకారం కావాలన్నా అందించటానికి తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైం బోర్డు చైర్మన్‌ దామచర్ల సత్య, ఏపీ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌ నూకసాని బాలాజీ, కాకతీయ సేవాసమాఖ్య అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ, యర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరు ఎరిక్షన్‌ బాబు, ఒంగోలు డెయిరీ మాజీ చైర్మన్‌ చల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. తొలుత నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి ఇతర కార్యక్రమాలకు వెళ్లాల్సి ఉండటంతో స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్‌ రాయపాటి సుభాషిణిశ్రీనివాసరావులను అభినందించారు. ఎమ్మెల్యే ఇంటూరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వెళ్లారు. ఈ సందర్భంగా ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద నుంచి తప్పెట్లు, డప్పు వాయిద్యాలతో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును గుర్రంపై ఊరేగిస్తూ అట్టహాసంగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు ఎమ్మెల్యేలు, మంత్రి స్వామి తదితరులతో కలిసి నేతలంతా ఓపెన్‌టా్‌ప వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2026 | 11:01 PM