స్త్రీశక్తి సక్సెస్.. ఆర్టీసీకి స్ట్రెస్
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:07 AM
మార్కాపురం జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లలో పరిస్థితి ఇదీ. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేయడంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటు లోకి వచ్చింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
కిక్కిరిసిపోతున్న బస్సులు
సరిపడా లేని సర్వీసులు
కాలం చెల్లిన వాహనాల నిలిపివేత
కొత్త వాటి ఊసే కరువు
అధిక లోడుతో నడుస్తున్న వైనం
తప్పని ఫుట్ బోర్డు ప్రయాణం
సీట్ల కోసం నిత్యం గొడవలు
సంస్థలో సిబ్బంది కొరత
నూతన నియామకాలు నిల్
ఉన్నవారికే అదనపు డ్యూటీలు
గత నెలలో మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. శ్రీశైలం వెళ్లేందుకు సరిపడా బస్సులు లేవని అధికారులపై విరుచుకుపడ్డారు. తరువాత ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో ఆ రోజుకు సమస్య సద్దుమణిగింది.
ఓ బస్సులో పరిమితికి మించి ఎక్కుతున్న ప్రయాణికులను డ్రైవర్ వారించారు. అడ్డుగా నిల్చున్న అతనిని డోర్‌లో నుంచి పక్కకు నెట్టి మరీ మహిళలు బస్సులోకి ఎక్కారు. తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో ఆ డ్రైవర్ బస్సును ముందుకు తీయాల్సి వచ్చింది.
కొండపి వెళ్లే పల్లె వెలుగు బస్సు మంగళవారం పొదిలి బస్టాండ్ వద్దకు రాగానే అందులో ఎక్కేందుకు మహిళలు పోటీపడ్డారు. బస్సు పూర్తిగా నిండిపోయిందని కండక్టర్ వారించినా వినకుండా ఫుట్‌పాత్‌పై వేలాడుతూ ఉండిపోయారు. దీంతో బస్సును కదలనిచ్చేది లేదంటూ దాదాపు 45 నిమిషాలపాటు డ్రైవర్ నిలిపివేశారు. ఆ తర్వాత ప్రయాణికులను సర్దుబాటు చేశాక అక్కడి నుంచి బస్సు కదిలింది.
మార్కాపురం జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లలో పరిస్థితి ఇదీ. ప్రభుత్వం స్త్రీశక్తి పథకం అమలు చేయడంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటు లోకి వచ్చింది. ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. అదేసమయంలో సర్వీసుల సంఖ్య పెంచకపోవడం సమస్యగా మారింది. దీంతో బస్టాండ్‌లలో బస్సులు వచ్చినప్పుడు ప్రయాణికుల పరుగులు, సీట్ల కోసం గొడవలు, డ్రైవర్‌లు, కండక్టర్‌లతో వాగ్వివాదాలు నిత్యకృత్యమయ్యాయి.
మార్కాపురం, జూలై 7 (ఆంధ్రజ్యోతి) : స్త్రీశక్తి ద్వారా మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అందుబాటు లోకి వచ్చింది. మార్కాపురం జిల్లాలో ఇప్పటివరకు 1.36 కోట్ల మంది వనితలు ప్రయాణించారు. అనేక రూట్లలో బస్సులు నిత్యం కిక్కిరిసిపోవడం, పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం కారణంగా డ్రైవర్లు, కండక్టర్లు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులు లేకపోవడం కూడా సమస్యగా మారింది. గ్రామీణ ప్రాంతాలకు తిరిగే పల్లె వెలుగుల్లో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కుతున్నారు. చివరకు మహిళలు సైతం డోర్‌లో నిలుచుని ఫుట్‌బోర్డు ప్రయాణం చేస్తున్నారు. వద్దని వారించిన సిబ్బందిపై తిరగబడుతున్నారు. మరోవైపు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు రెండేళ్లు పెంచడంతో రిటైర్ అవ్వాల్సిన డ్రైవర్లు కూడా అధికలోడుతో ఉంటున్న పల్లె వెలుగు బస్సులను నడుపుతూ నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీసీలో కొత్తగా రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో ఉద్యోగుల కొరత కూడా వేధిస్తోంది. ప్రధానంగా డ్రైవర్లు, కండక్టర్‌లు సరిపడినంత మంది లేని కారణంగా ఉన్న వారితోనే అదనపు డ్యూటీలు చేయిస్తున్నారు. జిల్లాలోని మార్కాపురం, పొదిలి, కనిగిరి, గిద్దలూరు ఆర్టీసీ డిపోల పరిధిలో ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన వారిస్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో ఖాళీల సంఖ్య పెరిగిపోతోంది. ఉదాహరణకు ఒక్క మార్కాపురం డిపోలోనే ఇటీవల 18 మంది డ్రైవర్లు ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఉన్న వారితోనే బస్సు సర్వీసులు నడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. వీటికితోడు బస్సుల కొరత కూడా ప్రధాన సమస్యగా మారింది. ఉన్న వాటిలో కూడా కాలం చెల్లిన వాటిని నిలిపివేయాల్సి రావడంతో సమస్య జటిలంగా మారుతోంది. మార్కాపురం డిపో పరిధిలో గత నెలలో 4 బస్సులను నిలిపివేశారు. ఇలా జిల్లాలో మొత్తం 303 బస్సులు ఉంటే వాటిలో దాదాపు 10 బస్సులు కాలం చెల్లాయి. కొత్తవి రాకపోవడం, పాతవాటిని నిలిపివేస్తుండటం, ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పెరుగుతున్న శ్రీశైలం వెళ్లే భక్తుల సంఖ్య
మార్కాపురం నుంచి శ్రీశైలం వెళ్లే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. మార్కాపురం వరకు రైలు సౌకర్యం ఉండటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి చేరుకొంటున్నారు. ఇక్కడి నుంచి శ్రీశైలం బస్సులో వెళుతున్నారు. అది కూడా స్త్రీశక్తి పథకం అమలులో ఉన్న బస్సులనే ఆశ్రయిస్తున్నారు. దీంతో ఇబ్బందులు వస్తున్నాయి. మార్కాపురం జిల్లా నుంచి తప్ప ఇతర జిల్లాల్లోని ఆర్టీసీ డిపోల నుంచి శ్రీశైలంకు సూపర్ డీలక్స్, ఆలా్ట్ర డీలక్స్ వంటి బస్సులనే నడుపుతున్నారు. కర్నూలు, ఆత్మకూరు వైపు నుంచి వచ్చేవారంతా స్ర్తీశక్తి అమలులో ఉన్న బస్సులను ఎక్కి దోర్నాలకు వస్తున్నారు. ఇంకొంతమంది ఇతర ప్రాంతాల నుంచి మార్కాపురం చేరుకుంటున్నారు. వీరంతా ఒక్కసారిగా ఇక్కడి నుంచి శ్రీశైలం వెళ్లాల్సి రావడంతో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. సీట్ల కోసం గొడవలు నిత్యకృత్యమయ్యాయి.