అమృత్ ధారలు
ABN , Publish Date - Jul 05 , 2026 | 11:42 PM
పట్టణ ప్రాంతాల్లోని ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అమృత్-2 కింద ఉమ్మడి జిల్లాకు గత ఏడాది జూలైలో రూ.744.34 కోట్లు విడుదలయ్యాయి. ఒంగోలులో శనివారం పనులను లాంఛనంగా ప్రారంభించారు. గత టీడీపీ హయాంలో 2016లోనే ఒంగోలులో ఈ పథకం తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజల నీటి కష్టాలను పూర్తిగా విస్మరించింది.
ఉమ్మడి జిల్లాకు తాగునీటి కోసం రూ. 744.34 కోట్లు
అమృత్-2లో ఒంగోలు, మార్కాపురం, పొదిలి, దర్శికి నిధులు
ఒంగోలులో లాంఛనంగా పనులు ప్రారంభం
త్వరలో మిగిలిన చోట్ల మొదలు పెట్టేందుకు చర్యలు
ఆయా పట్టణాల ప్రజలకు తీరనున్న తాగునీటి కష్టాలు
పట్టణ ప్రాంతాల్లోని ప్రజల తాగునీటి కష్టాలు తీరనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న అమృత్-2 కింద ఉమ్మడి జిల్లాకు గత ఏడాది జూలైలో రూ.744.34 కోట్లు విడుదలయ్యాయి. ఒంగోలులో శనివారం పనులను లాంఛనంగా ప్రారంభించారు. గత టీడీపీ హయాంలో 2016లోనే ఒంగోలులో ఈ పథకం తొలిదశ పనులు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రజల నీటి కష్టాలను పూర్తిగా విస్మరించింది. దీంతో ఐదేళ్లపాటు బిందెడు నీటి కోసం ప్రజలు బండెడు కష్టాలు పడ్డారు. ప్రస్తుత ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. అమృత్-2 కింద మరిన్ని నిధులు ఇచ్చింది. ఒంగోలుకు రూ.424.42 కోట్లతోపాటు మార్కాపురానికి రూ.63.14 కోట్లు, పొదిలికి రూ.126.17 కోట్లు, దర్శికి రూ.130.61 కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ఒక్కోచోట పనులను ప్రారంభిస్తున్నారు. ఇవి పూర్తయితే ఒంగోలు నగరంతోపాటు మూడు పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది.
ఒంగోలు కార్పొరేషన్, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం శ్రీకారం పలికింది. అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అమృత్ పథకాన్ని ప్రవేశపెట్టింది. లక్షకు పైగా జనాభా ఉన్న కొన్ని పట్టణాల్లో దీన్ని అమలు చేసింది. అందులో నాడు ఒంగోలుకు ప్రాధాన్యత లభించింది. తొలుత రూ. 330 కోట్లు అవసరమని నగరపాలక సంస్థ అధికారులు కోరారు. అయితే ఒకేసారి అంత మొత్తం విడుదలకు సాధ్యపడకపోవడంతో ఒంగోలుకు అమృత్-1 కింద రూ.123 కోట్లు మంజూరు చేశారు. దీంతో 2016 మేలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఒంగోలులో పనులను ప్రారంభించారు.
అమృత్-2లో ఒంగోలుకు రూ.424.42 కోట్లు మంజూరు
అమృత్-2 కింద ఒంగోలు నగరానికి రెండు ప్యాకేజీల కింద రూ.424.42 కోట్లను ప్రభుత్వం గత ఏడాది మంజూరు చేసింది. మొదటి ప్యాకేజీలో తాగునీటి అవసరాల కోసం రూ.381.70 కోట్లు ఇచ్చింది. అందులో నిర్మాణ పనులకు రూ.320.05 కోట్లు, పదేళ్లపాటు నిర్వహణకు రూ.61.25 కోట్లు కేటాయించారు. నగరంలో 18 ఓవర్ హెడ్ ట్యాంకులు, మూడు ఫిల్టరేషన్ ప్లాంట్లు నిర్మించనున్నారు. 535 కి.మీ పాత పైపులైన్‌ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయనున్నారు. రెండో ప్యాకేజీ కింద రూ.42.72 కోట్లు మంజూరయ్యాయి. వీటితో ఒక ఫిల్టరేషన్ ప్లాంట్, 35 కి.మీ పైపులైన్‌ను ఏర్పాటు చేస్తారు. నిర్మాణాలకు రూ.34.68 కోట్లు, నిర్వహణకు రూ.8.04 కోట్లు కేటాయించారు. రెండు ప్యాకేజీలు తాగునీటి అవసరాలకు ఖర్చు చేయనుండగా, వేర్వేరుగా టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నారు. రామతీర్థం నుంచి నీటిని తీసుకోనున్నారు. ఈ మేరకు శనివారం ఒంగోలు సమీపంలోని మండువవారిపాలెం వద్ద ఉన్న డ్రీమ్ వ్యాలీలో పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. పబ్లిక్ హెల్త్ ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు.