వాగు ఆక్రమణలను తొలగించాలి
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:47 PM
వాగు అక్రమణలను తొలగించి వరద ముంపు నుంచి పంట పొలాలను కాపాడాలని రైతులు, రైతుసంఘ నేతలు డిమాండ్ చేశారు.
కారంచేడు(పర్చూరు), ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి) : వాగు అక్రమణలను తొలగించి వరద ముంపు నుంచి పంట పొలాలను కాపాడాలని రైతులు, రైతుసంఘ నేతలు డిమాండ్ చేశారు. వాగుఆక్రమణపై మంగళవారం కారంచేడు కాలువ కూడలిలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రైతునేతలు మాట్లాడుతూ పర్చూరు వాగు పరివాహక ప్రాంతాల నుంచి వచ్చే వరద నీటితోపాటు, మురుగు నీటిని తీసుకుపోయే ఉప్పుటూరు - పోతుకట్ల వాగు అక్రమణకు గురైందన్నారు. అధిక వర్షాల సమయంలో వరద నీరు గ్రామాలను సైతం ముంచెత్తే విధంగా పరిస్థితి నెలకొందన్నారు. పర్చూరు - ఉప్పుటూరు - వీరన్నపాలెం మీదుగా పోతు కట్ల గ్రామాల నుంచి ప్రవహించి సాకివాగులో కలిసి తద్వారా కొమ్మమూరు కాలువ ద్వారా అండర్ ట్రైనల్‌కు తీసుకుపోయే వాగు నేడు ఆక్రమణలకు గురైందన్నారు. వాగు పరివాహ ప్రాంతాల్లో ఉన్న కాలువలు సైతం ఆక్రమణ లకు గురయ్యాయ న్నారు. దీంతో ఇటీవల సంభవించిన మొంథా తుఫాను సమయంలో వేల ఎకరాల పంట భూములతో పాటు, గ్రామాల సైతం వరద ముంపుకు గురికావటం జరిగిందన్నారు. ఇలాంటి పరిస్థితి తిరిగి పునరావృతం కాకుండా వాగు అక్రమణను తొలగించి, వరద ముంపు నుండి రైతాంగాన్ని కాపాడాలన్నారు. ఈకార్యక్రమంలో యార్లగడ్డ రాధాకృష్ణమూర్తి, వై.వెంకన్న, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు. ఉన్నతాధికారులు సత్వర మే స్పంధించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
వాగును అభివృద్ధి చేయడమే పరిష్కారం
కొద్దిపాటి నిధులతో వినియోగంలోకి వచ్చే పర్చూరు వాగును అభివృద్ధి చేయడంలో కాలయాపన తగదని నల్లమడ రైతు సంఘం అధ్యక్షు డాక్టర్ కొల్లా రాజమోహన్ అన్నారు. పర్చూరు వాగు అక్రమణలపై కారంచేడులో రైతులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాగు అక్రమణలను తొలగించి, ఉన్న వాగును అభివృద్ధి చేస్తే రైతులకు మేలు చేకూరుతుందన్నారు.