అయినా దిద్దాల్సిందే!
ABN , Publish Date - Apr 07 , 2026 | 02:16 AM
ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. టెన్త్ విద్యార్థులకు సబ్జెక్టులు బోధించని హైస్కూలు ప్లస్ టీచర్లతో పేపర్లు దిద్దిస్తున్నారు.
సబ్జెక్ట్ బోధించకపోయినా రావాల్సిందే
టెన్త్ స్పాట్‌లో విచిత్ర పరిస్థితి
మూల్యాంకనానికి టీచర్ల కొరత
ఒంగోలు విద్య, ఏప్రిల్ 6 (ఆంధ్ర జ్యోతి) : ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో విచిత్ర పరిస్థితి నెలకొంది. టెన్త్ విద్యార్థులకు సబ్జెక్టులు బోధించని హైస్కూలు ప్లస్ టీచర్లతో పేపర్లు దిద్దిస్తున్నారు. స్పాట్ నియామకాలకు సంబంధించి మార్చి 25న ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులకు బోధిస్తున్న వారినే చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లుగా నియమించాల్సి ఉంది. కానీ ఇక్కడ హైస్కూలు ప్లస్‌లో ఇంటర్మీడియేట్ విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయులు కొందరు ఇంటర్ మూల్యాంకనానికి నియమితు లయ్యారు. వారినే పదో తరగతికి కూడా పేపర్లు దిద్దేందుకు నియమిం చారు. కొందరు ఇంకా ఇంటర్ స్పాట్‌లో ఉండటంతో వారు టెన్త్ మూల్యాంకనానికి హాజరు కాలేదు.
వంద మంది కొరత
మూల్యాంకనానికి సుమారు వంద మంది టీచర్లు ఇంకా అవసరం ఉంది. అసలు స్పాట్ నియామకాల్లోనే లోపం జరిగింది. గతంలో అవసరమైన వారికి కనీసం 20శాతం మందిని అదనంగా నియమించేవారు. ప్రస్తుతం ఆటోమే షన్ విధానంలో కచ్చితంగా ఎంత మంది అవసరమో అంతమందికే ఉత్తర్వులు ఇచ్చారు. వీరిలో కొందరు వాస్తవిక కారణాలతో మినహాయింపులు కోరగా, కొందరు సిఫార్సులతో మినహాయింపులు పొందారు. ఈ విధంగా సుమారు 150మందికి మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. వీరికి ప్రత్యామ్నాయం ఇక్కడి డీఈవో కార్యాలయం చూపించగా వారికి సోమవారం ఉదయం ఉత్తర్వులు అందాయి. వీరిలో కొందరు స్పాట్ విధులకు డుమ్మా కొట్టారు. ఆరోగ్యవంతులకు సిఫార్సులతో మినహాయింపులు ఇచ్చిన అధికారులు నిజంగా బాధపడుతున్న వారిని కనికరించలేదని ఉపాధ్యాయులు విమర్శిస్తున్నారు. అవసరమైన వారిని ప్రత్యామ్నాయంగా నియమించేందుకు ఇక్కడి అధికారులకు అధికారం లేదు. సీఈ, ఏఈ, ఎస్‌ఏలకు ఆరు అంకెల ఐడీ నెంబరు వస్తేనే వారు పేపర్లు దిద్ది మార్కులు ఎంట్రీ వేసేందుకు అర్హులు. ప్రస్తుతం స్పెషల్ అసిస్టెంట్లు 25, గణితం 14, ఇంగ్లీషు 13, సోషల్ 28, పీఎస్ ఆరు, బీఎస్ నాలుగు, హిందీ నలుగురు టీచర్లు ఇంకా అవసరముంది. మూల్యాంకన కేంద్రంలో కనీసం క్యాంటిన్ లేకపోవడంతో టీచర్లు భోజనానికి, టీ, కాఫీలకు ఇబ్బందిపడ్డారు. డీఈవో రేణుక స్పాట్‌ను పర్యవేక్షించారు. మూల్యాంకనానికి హాజరైన వారికి పలు సూచనలు ఇచ్చారు.