Share News

కర్ర వర్రీ

ABN , Publish Date - Feb 19 , 2026 | 02:34 AM

వ్యవసాయం గిట్టుబాటు కాక పంటల సాగుకు స్వస్తి చెబుతున్న రైతులు మూడేళ్లుగా మళ్లీ సామాజిక వనాలను ముమ్మరంగా సాగు చేస్తున్నారు. దీంతో జిల్లాలో జామాయిల్‌ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.

కర్ర వర్రీ
కందుకూరు ప్రాంతంలో సాగులో ఉన్న జామాయిల్‌ తోట

గణనీయంగా పెరిగిన సామాజికవనాల సాగు

నాలుగేళ్లలో పదిరెట్లు అయిన విస్తీర్ణం

మాగాణి, రేగడి భూముల్లోనూ తోటలు

నేలచూపులు చూస్తున్న జామాయిల్‌ ధరలు

ఫ్లైవుడ్‌ పరిశ్రమలే ఆధారంగా విక్రయాలు

పేపరు పరిశ్రమ ఏర్పాటుకు కృషి జరిగేనా?

వ్యవసాయం గిట్టుబాటు కాక పంటల సాగుకు స్వస్తి చెబుతున్న రైతులు మూడేళ్లుగా మళ్లీ సామాజిక వనాలను ముమ్మరంగా సాగు చేస్తున్నారు. దీంతో జిల్లాలో జామాయిల్‌ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. నాలుగేళ్ల క్రితంతో పోలిస్తే ప్రస్తుతం పది రెట్లు అధికంగా ఉంది. ఆ మేరకు వ్యవసాయశాఖ అధికారుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ కర్రకు మాత్రం సరైన ధర దొరకడం లేదు. ఒకప్పుడు పంటల సాగుకు ఏమాత్రం అనుకూలం కాని గరపనేలలు, బీడు భూముల్లో మాత్రమే జామాయిల్‌ సాగుచేసే వారు. ప్రస్తుతం మాగాణి, మెట్ట అన్న తారతమ్యం లేకుండా సుబాబుల్‌, జామాయిల్‌, సరుగుడు తోటలు వేయడం పరిపాటిగా మారింది.

కందుకూరు, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ సామాజికవనాల సాగు పెరిగిపోతోంది. గతంలో ధరలు లేక వెనకడుగు వేసిన రైతులు ప్రస్తుతం మిగతా పంటల సాగు ఆశాజనకంగా లేకపోవడంతో జామాయిల్‌ బాట పట్టారు. కందుకూరు ప్రాంతంలో ఏడాదికి రెండు పంటలు పండిచేందుకు అనువుగా నీటి వసతి ఉన్న మాగాణి భూములతోపాటు శనగ, పొగాకు సాగుకు పెట్టింది పేరుగా భావించే నల్లరేగడి నేలల్లోనూ విపరీతంగా జామాయిల్‌ మొక్కలు నాటారు. ప్రసిద్ధిగాంచిన అత్తాకోడళ్లు చెరువుల ఆయకట్టులో 60 శాతానికిపైగా ఈ తోటలే ఉన్నాయి. రాళ్లపాడు రిజర్వాయరు ఆయకట్టులోని అనేక గ్రామాలో ఇదే పరిస్థితి. అలాగే కందుకూరు, కొండపి నియోజకవర్గాల పరిఽధిలో జామాయిల్‌ తోటలు దర్శనం ఇస్తున్నాయి. మామాడి, సపోటా లాంటి పండ్లతోటలు కూడా తీసేసి సాగు చేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కేవలం కందుకూరు నియోజకవర్గంలోనే 70వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు ఉన్నట్లు అంచనా.

వ్యాపారుల మాయాజాలంతో వేలంవెర్రి

సాగు విస్తీర్ణం పెరిగిందో లేదోకర్ర ధర నేల చూపులు చూస్తోంది. స్థానికంగా పేపరు పరిశ్రమలే కాక పల్ఫ్‌, ఫ్లైవుడ్‌ పరిశ్రమలు లేకపోవడమే దీనికి ప్రధానకారణమైంది. గతంలో పేపర్‌ తయారీ పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. వారి డిమాండ్‌కు తగ్గట్లు జామాయిల్‌ కర్ర దొరకక రేట్లు పెంచేశారు. గత సంవత్సరం తాటతీసిన జామాయిల్‌ కర్ర టన్నుకు రూ.7,800 వరకు రైతుకు చెల్లించారు. అంతకుముందు ఏడాది కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కర్ర లభ్యత పెరిగింది. మూ డేళ్ల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు కోతకు సిద్ధంగా ఉన్నాయి. ఇదేఅదనుగా వ్యాపారులు ఆరు నెల నుంచి క్రమేపీ ధర తగ్గిస్తూ వచ్చారు. ప్రస్తుతం టన్ను రూ.6,500 నుంచి రూ.6,600 వరకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. మరో రెండేళ్లు కర్ర లభ్యత పెరిగే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఈ ధరను మరింత దిగ్గోసే ప్రమాదం లేకపోలేదు.

రైతుల్లో ఆందోళన

జిల్లా నుంచి ప్రధానంగా భద్రాచలం పేపరు మిల్లుకు జామాయిల్‌ ఎగుమతి అవుతోంది. కందుకూరు మండలంలోని కోవూరు, కడప జిల్లా బద్వేలు, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలలో ఉన్న ఫ్లైవుడ్‌ పరిశ్రమలకు ఇక్కడి నుంచి కర్ర తరలుతోంది. అడపాదడపా కాగజ్‌నగర్‌, కర్ణాటకలోని ఒకటి రెండు పేపరు పరిశ్రమలకు కూడా కర్ర తరలుతోంది. అయితే వ్యాపారులంతా కూడబలుక్కుని ధరను దిగజారుస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే ఒరవడి కొనసాగితే పదేళ్ల క్రితం నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. మళ్లీ గిట్టుబాటు ధరల కోసం ఆందోళనబాట పట్టక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్కసారి సాగు చేస్తే కనీసం పన్నెండేళ్ల నుంచి ఇరవై సంవత్సరాల వరకు తీసేయటానికి వీలుకాని దీర్ఘకాల పంట కావడంతో ఇప్పుడే ఇలా ఉంటే తమ భవిష్యత్తు ఏమిటన్న ఆందోళన రైతుల్లో ప్రారంభమైంది.

పేపరు పరిశ్రమ ఏర్పాటుచేసేనా?

ఒకప్పుడు జామాయిల్‌కు గిట్టుబాటు ధర లభించేలా చూడటమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా భారీ పేపరు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేసింది. మల్టీనేషనల్‌ కంపెనీ అయిన ఏషియన్‌ పల్ప్‌ అండ్‌ పేపరు (ఏపీపీ) పరిశ్రమ రమారమి రూ.3వేల కోట్ల పెట్టుబడితో రామాయపట్నం పరిసరాల్లో ఏర్పాటుకు ముందుకొచ్చింది. రాష్ట్రప్రభుత్వంతో ఎంవోయూ చేసుకుంది. 2019 ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఏపీపీకి శంకుస్థాపన కూడా చేశారు. అనంతరం రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అనేక పరిశ్రమలు తరలిపోయినట్లే ఏపీపీ ప్రతినిధులు కూడా ఇక్కడ పరిశ్రమ ఆలోచనను విరమించుకున్నారు. దీంతో రైతులకు తీరని అన్యాయం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరిగి అధికారంలో ఉన్న ప్రజాప్రభుత్వమైనా పేపరు పరిశ్రమ ఏర్పాటు ఆలోచనను మళ్లీ కార్యరూపంలోకి తేవాలని రైతులు కోరుకుంటున్నారు.

దూరాభారంతో సమస్య

ప్రకాశం జిల్లాలో లక్షలాది ఎకరాల్లో జామాయిల్‌ ఉండటంతోపాటు పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో కూడా పెద్దఎత్తున సుబాబుల్‌, సరుగుడు సాగు విస్తీర్ణం ఉంది. ఈ రెండు జిల్లాల సరిహద్దులో పేపరు పరిశ్రమ ఏర్పాటు ఆవశ్యకత ఎంతో ఉందని రైతులు పేర్కొంటున్నారు. జామాయిల్‌ ముడిసరుకు అంతా ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో ఉండగా పరిశ్రమలు మాత్రం సుదూరంగా ఉన్న కారణంతో రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని తెలుస్తోంది. టన్నుకు రూ.2వేలు వరకు రవాణా చార్జీలే అవుతున్నాయి. దీంతో దగ్గర్లో పరిశ్రమ లేని కారణంగా వ్యాపారుల మాయాజాలం కారణంగా రైతులు దోపిడీకి గురవుతున్న పరిస్థితి. ఈ స్థితిలో రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా పేపరు పరిశ్రమ ఏర్పాటుకు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు కృషిచేయాల్సి ఉంది. ఏపీపీతో చేసుకున్న ఒప్పందం మేరకు ఈ సంస్థ ప్రతినిధులు రంగంలోకి దిగి పరిశ్రమ ఏర్పాటుచేసేలా ప్రభుత్వంలోని పెద్దలు కృషిచేసేలా చూడాలని రైతులు కోరుతున్నారు. లేనిపక్షంలో మరో సంస్థ ద్వారానైనా ఈ ప్రాంతంలో పేపరు పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

Updated Date - Feb 19 , 2026 | 02:34 AM