Share News

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు

ABN , Publish Date - Jan 06 , 2026 | 12:02 AM

జీజీహెచ్‌కు విచ్చేసే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ పి. రాజాబాబు చెప్పారు.

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజాబాబు, పక్కన ఎమ్మెల్యే జనార్దన్‌

రిమ్స్‌ అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశంలో కలెక్టర్‌

రూ.10 కోట్లతో జీజీహెచ్‌కు హంగులు : ఎమ్మెల్యే దామచర్ల

ఒంగోలు కార్పొరేషన్‌, జనవరి 5 (ఆంధ్రజ్యోతి) : జీజీహెచ్‌కు విచ్చేసే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ పి. రాజాబాబు చెప్పారు. జీజీహెచ్‌ అభివృద్ధి సొసైటీ కమిటీ సమావేశం సోమవారం రిమ్స్‌ మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ ఛాంబర్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హాస్పిటల్‌కు వచ్చే రోగుల సంఖ్య పెరిగిందన్నారు. అందుకు అనుగుణంగా అవసరమైన వైద్య పరికరాలు మందులు, వైద్యుల సేవలను నిరంతరం అందుబాటులో ఉంచాలని చెప్పారు. పారిశుధ్యం మెరుగ్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్య లేకుండా పైపులైను పనులు చేపట్టాలని, ఆపరేషన్‌ థియేటర్‌కు మరమ్మతులు చేసి, పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని చెప్పారు. ప్రస్తుతం నర్సింగ్‌ విద్యార్థులకు హాస్టల్‌ వసతిని తాత్కాలికంగా మార్చడానికి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని సూచించారు. హాస్పిటల్‌లో వినియోగించని వెంటిలేటర్లను ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆసుపత్రులకు తరలించాలన్నారు.కొత్తగా నిర్మిస్తున్న క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌లో రెండోలిఫ్ట్‌ను ఏర్పాటు చేయడానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. పాత రిమ్స్‌ ఆసుపత్రి ఆవరణ ముందున్న షాపులను ప్రభుత్వ నిబంధనల మేరకు అద్దెలు, కరెంట్‌ బిల్లులు వసూలు చేయాలన్నారు. జీజీహెచ్‌లో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఆరునెలలకు ఒకసారి ఆడిట్‌ చేయించాలని ఆదేశించారు. ప్రత్యేకించి జీజీహెచ్‌ ఆవరణలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, వైద్య సేవల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ మాట్లాడుతూ రూ.10 కోట్లతో జీజీహెచ్‌కు నూతన హంగులు తీర్చిదిద్దుతామన్నారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ మాణిక్యరావు, మెడికల్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ ఏసుపాదం, డీఎంహెచ్‌వో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


సీఎం సహాయనిధితో భరోసా : ఎమ్మెల్యే జనార్దన్‌

ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా భరోసా లభిస్తుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌ పేర్కొన్నారు. సోమవారం ఉదయం తన నివాసంలో 19 మంది లబ్ధిదారులకు రూ. 11.78లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా ఆరోగ్య భద్రత లభిస్తుందని దామచర్ల తెలిపారు.

Updated Date - Jan 06 , 2026 | 12:03 AM