Share News

నిలిచిన వేతనాలు

ABN , Publish Date - Apr 19 , 2026 | 03:15 AM

జిల్లాలో డ్రాయింగ్‌ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల (డేటా)ను ట్రెజరీ కార్యాలయానికి పంపడంలో ఆలస్యం చేశారు.

నిలిచిన వేతనాలు

కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల నమోదులో జాప్యం

జిల్లావ్యాప్తంగా 3,500మందికిపైగా..

క్యాడర్‌ స్ట్రెంగ్త్‌ వివరాలు నమోదు చేస్తేనే జీతాలు

ఒంగోలు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో డ్రాయింగ్‌ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాల (డేటా)ను ట్రెజరీ కార్యాలయానికి పంపడంలో ఆలస్యం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిధి పోర్టల్‌ను అమలులోకి తెచ్చింది. దాని ద్వారా వేతనాలు చెల్లించేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఆయా శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను ట్రెజరీ కార్యాలయాలకు పంపించాలని ఆదేశాలు జారీచేసింది. అయితే ఫిబ్రవరిలో ఆయా శాఖల నుంచి ట్రెజరీలకు వివరాలు పంపలేదు. అయినా ప్రభుత్వం ఈ జాప్యాన్ని గుర్తించి ఫిబ్రవరి, మార్చి నెలల్లో జీతాలను చెల్లించింది. అధికారులు తప్పనిసరిగా ఆయా శాఖల్లో ఎంతమంది కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్నారో సంబంధిత హెచ్‌వోడీల ద్వారా ట్రెజరీలకు పంపించాలని మరోసారి ఆదేశాలు జారీచేసింది. అయినా ఆ వివరాలను ఇంతవరకు ట్రెజరీకి పంప లేదు. అందుకు సంబంధించిన సమాచారం ఆయా శాఖల వద్ద సక్రమంగా అందుబాటులో లేకపోవడం, రాష్ట్రస్థాయి నుంచి కూడా సరైన సమాచారం రాకపోవడంతో ఆ ఉద్యోగుల డేటాను నమోదు చేసే ప్రక్రియ నిలిచిపోయింది. జిల్లాలో 72శాఖల పరిధిలో సుమారు 3500 మందికి పైగా కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. ఒక్క ఒంగోలు రిమ్స్‌లోనే సుమారు 200 మంది పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 20మంది డేటా మాత్రమే ట్రెజరీ కార్యాలయానికి వెళ్లింది. మిగిలిన ఉద్యోగుల డేటా ఇంతవరకు చేరలేదు. ప్రభుత్వం రానున్న కాలంలో కాంట్రాక్టు ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేతనాలు చెల్లించాలన్న ఉద్దేశంతో నిధి పోర్టల్‌ను ఏర్పాటు చేస్తే డ్రాయింగ్‌ ఆఫీసర్ల నిర్లక్ష్యం కారణంగా సత్ఫలితాలను ఇవ్వడం లేదు. రెండు నెలలు దాటినా ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల డేటా సంబంధిత శాఖల నుంచి ట్రెజరీ కార్యాలయాలకు వెళ్లని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఏప్రిల్‌లో జీతాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు వెంటనే కాంట్రాక్టు ఉద్యోగుల డేటాను ట్రెజరీ కార్యాలయాలకు పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Apr 19 , 2026 | 03:15 AM