Share News

మెరుగుపడని మార్కెట్‌

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:43 PM

క్షిణాది పొగాకు మార్కెట్‌ గతంలో ఎన్నడూ లేనంత గందరగోళంలో కనిపిస్తోంది. ఈ సీజన్‌ వేలం ప్రారంభించి మూడు నెలలు దాటినా ఉత్పత్తి అంచనాలో 15శాతం మించి కొనుగోలు జరగలేదు. రోజువారీ ఈ ప్రాంతంలోని 11వేలం కేంద్రాల్లో కలిపి కొనుగోళ్లు అర మిలియన్‌ కిలోలు మించడం లేదు.

మెరుగుపడని మార్కెట్‌

మందకొడిగానే పొగాకు కొనుగోళ్లు

వేలంలో మొక్కుబడిగా పాల్గొంటున్న పలు కంపెనీలకు చెందిన బయ్యర్లు

ఒత్తిడి చేయలేకపోతున్న బోర్డు అధికారులు

నోబిడ్‌లు తగ్గినా పెరగని ధరలు

ఆశించిన ఫలితమివ్వని ప్రభుత్వ జోక్యం

పంట ఉత్పత్తి అంచనా 148 మిలియన్‌ కిలోలు

కొన్నది 23.10 మిలియన్‌ కిలోలు మాత్రమే!

ఇలా అయితే వేలం పూర్తికి రెండేళ్లు పట్టే అవకాశం

రైతుల్లో తీవ్ర ఆందోళన.. నిత్యం ఏదో ఒకచోట నిరసన

ఒంగోలు, జూలై 5 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్‌ గతంలో ఎన్నడూ లేనంత గందరగోళంలో కనిపిస్తోంది. ఈ సీజన్‌ వేలం ప్రారంభించి మూడు నెలలు దాటినా ఉత్పత్తి అంచనాలో 15శాతం మించి కొనుగోలు జరగలేదు. రోజువారీ ఈ ప్రాంతంలోని 11వేలం కేంద్రాల్లో కలిపి కొనుగోళ్లు అర మిలియన్‌ కిలోలు మించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ సీజన్‌లో రైతులు పండించిన పంట అమ్మకాలు పూర్తయ్యే సరికి రెండేళ్లు దాటుతుంది. పొగాకు మార్కెట్లో సంక్షోభంపై రైతు సంఘాలు ఉధృతంగా ఉద్యమాలు చేపట్టినా, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినా, మంత్రులు వేలం కేంద్రాలు సందర్శించి సూచనలు చేస్తున్నా మార్కెట్‌ మెరుగుపడ లేదు. వ్యాపారుల్లో అంతగా కదలిక కనిపించడం లేదు. సగం మంది వేలం కేంద్రాల్లో కనిపించడం లేదు. వారిని కూడా కొనుగోళ్లలో పాల్గొనేలా చేయడంలో పొగాకు బోర్డు అధికారులు విఫలమవుతున్నారు.

రైతుల వద్ద ఇంకా 135 మిలియన్‌ కిలోల పొగాకు

రాష్ట్రంలో 2025-26 పంట కాలానికి పొగాకు బోర్డు 148 మిలియన్‌ కిలోల పంట ఉత్పత్తికి అనుమతివ్వగా 230 మిలియన్‌ కిలోలు పండినట్లు అంచనా. వేలం ప్రారంభించి మూడు మాసాలు దాటినా ఇంత వరకూ కేవలం 23 మిలియన్‌ కిలోలు మాత్రమే కొనుగోలు జరిగింది. అంటే పంట ఉత్పత్తిలో ఇంకా సుమారు 135 మిలియన్‌ కిలోలు రైతుల వద్ద నిల్వ ఉంది. బోర్డు నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారం వందరోజుల్లో కొనుగోళ్లు పూర్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం కొనుగోళ్ల తీరును చూస్తే ఎప్పటికి పూర్తవుతుందో కూడా అర్థంకాని పరిస్థితి కనిపిస్తోంది. గత సీజన్‌లో కూడా కొంత ఆలస్యమైనప్పటికీ తదుపరి పంట వచ్చే సమయానికి పూర్తి చేశారు. అయితే ఈసీజన్‌ కొనుగోళ్ల ఆరంభంలోనే పలు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. వ్యాపారులు ఇస్తున్న ధరలపై రైతుల్లో తీవ్ర అసంతృప్తి కన్పించింది. భారీగా నోబిడ్‌లు అయ్యాయి. అందుకు జీఎస్టీ పెంపు, పశ్చిమాసియాలో యుద్ధం, అంతర్జాతీయంగా అధిక పంట ఉత్పత్తి అంటూ తొలుత వ్యాపారులు చెప్తూ వచ్చారు. ఈనేపథ్యంలో నెల క్రితం జీఎస్టీలో మార్పులేదన్న స్పష్టత వచ్చింది. యుద్ధ మేఘాలు తొలగి అన్ని వ్యవస్థలూ గాడిన పడ్డాయి. అదేసమయంలో రైతు సంఘాల ఆందోళనలు, సీఎం జోక్యంతోపాటు మంత్రుల సందర్శనలు పెరిగాయి. ఈ పరిణామాలతో మార్కెట్లో ధరలు ఎంత అన్నది పక్కన పెడితే కొనుగోళ్లలో వేగం పుంజుకోవాలి. కానీ అలాంటి పరిస్థితి లేదు.


ధరల్లో కనిపించని మార్పు

సాధారణంగా ఈ సమయంలో రోజువారీ 1.25 మిలియన్‌ కిలోలకు తగ్గకుండా పొగాకు కొనుగోళ్లు జరుగుతాయి. కానీ ప్రస్తుతం అర మిలియన్‌ కిలోలు కొనడమే గగనమైంది. గతం కన్నా నోబిడ్‌లు కొంత మేర తగ్గినప్పటికీ ధరలు మెరుగవలేదు. కొన్ని వేలం కేంద్రాల్లో ఇంకా నిత్యం నాల్గో వంతుపైనే నోబిడ్‌లు ఉంటున్నాయి. సగటు ధరలు తగ్గిపోతున్నాయి. సీఎం సమీక్షకు ముందు జూన్‌ 16వ తేదీ నాటికి దక్షిణాదిలో సుమారు 16 మిలియన్‌ కిలోల పొగాకు కొనుగోలు జరగ్గా సగటున కిలోకు రూ.220 ధర లభించింది. సీఎం సమీక్ష చేసిన వారం తర్వాత జూన్‌ 24నాటికి సుమారు 18.81 మిలియన్‌ కిలోల కొనుగోళ్లు జరగ్గా సగటున కిలోకు రూ.216కు దక్కింది. ఇక ఈనెల 4వ తేదీ నాటికి పరిశీలిస్తే సుమారు 23 మిలియన్‌ కిలోల పంట కొనుగోలు జరగ్గా సగటు ధర కిలో రూ.212 మేర ఉంది. అలా రానురాను సగటు ధర తగ్గిపోతోంది. సగటు ధర కిలో రూ.200కు తగ్గరాదని, నోబిడ్‌లు ఉండకూడదన్న సీఎం ఆదేశాలను వ్యాపారులు పాటించకపోతుండగా వారిని బోర్డు అధికారులు నియంత్రించలేకపోతున్నారు. వ్యాపారుల తీరు మార్చుకోకుండా కొనుగోళ్లను ఇలాగే కొనసాగిస్తే ప్రస్తుత సీజన్‌ వేలం ప్రక్రియ ముగియడానికి మరో రెండేళ్లు పట్టడం ఖాయం. ఈ పరిస్థితి పొగాకు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

Updated Date - Jul 05 , 2026 | 11:44 PM