సమగ్రశిక్ష ఉద్యోగులకు ట్రెజరీ జీతాలు
ABN , Publish Date - Aug 09 , 2026 | 02:45 AM
సమగ్ర శిక్ష జిల్లా ప్రాజె క్టులో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. వీరికి కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది.
చెల్లింపుల్లో భారీ మార్పులు
ఎస్పీడీకి బదులుగా పాఠశాల విద్య డైరెక్టర్ ద్వారా బడ్జెట్
ఆర్బీఐ నుంచి నేరుగా బ్యాంకు ఖాతాలకు జమ
ఒంగోలు విద్య, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : సమగ్ర శిక్ష జిల్లా ప్రాజె క్టులో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాల చెల్లింపులో ప్రభుత్వం భారీ మార్పులు చేసింది. వీరికి కూడా ఇతర ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రత్యేకంగా ఎస్‌ఎన్‌ఏ (సింగిల్ నోడల్ ఏజెన్సీ) స్పార్ష్ పేరుతో కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ఉద్యోగులకు జీతాలు, కేజీబీవీ విద్యా ర్థులకు డైట్‌చార్జీలు చెల్లించే అధికారం సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ (ఏపీసీ) నుంచి తప్పించి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయ డీడీవో అయిన అసిస్టెంట్ డైరెక్టర్-1కు బదలాయించింది. సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టుకు అప్రూవల్ బోర్డు ఆమోదించిన బడ్జెట్‌ను గతంలో రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ విడుదల చేసేవారు. ప్రస్తుతం బడ్జెట్ విడుదల అధికారాన్ని పాఠశాల విద్య డైరెక్టర్‌కు అప్పగించారు. తద్వారా ఆర్బీఐ ద్వారా నేరుగా సంబంధిత బ్యాంకు ఖాతాలకు నిధులను జమ చేస్తారు. గతంలో పీఎఫ్‌ఎంఎస్ ద్వారా జరిగే చెల్లింపులు ఎస్‌ఎన్‌ఏ స్పార్ష్ సీఎఫ్‌ఎంఎస్, ఆర్బీఐ ద్వారా జరగనున్నాయి. ఇప్పటివరకు సిబ్బంది జీతాలు, పాఠశాల గ్రాంట్లు, సివిల్ వర్క్‌లు అన్నింటికీ సమగ్ర శిక్ష ఏపీసీ చెల్లింపులు చేసేవారు. కేంద్ర నిధులు 60శాతం, రాష్ట్ర నిధులు 40శాతం కలిపి ఒక ఫండ్‌గా లేకపోయినా ఏ నిధులు అందుబాటులో ఉన్నా చెల్లింపులు జరిగేవి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ఆ పద్ధతికి స్వస్తిపలికారు. ఫండ్‌లో కేంద్ర, రాష్ట్ర వాటాలు ఏది విడుదలైనా ఇప్పటి వరకూ చెల్లింపులు జరుగుతున్నాయి. కేవలం కేంద్ర వాటా లేక రాష్ట్రవాటాతో ఇక నుంచి చెల్లింపులు జరగవు. ఇప్పటివరకు సమగ్ర శిక్ష నిధులు బ్యాంకు జీతాల నుంచి ఏపీసీ సంతకాలతో చెక్కులు జారీచేస్తే సంబంధిత ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జమయ్యేవి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. జూన్, జూలై మాసాలకు జీతాలు, డైట్ బిల్లుల చెల్లింపునకు ప్రభుత్వం విడుదల చేసిన రూ.8.65కోట్లు ఈ విధానంలోనే చెల్లింపులు జరగనున్నాయి.