ఒంగోలు టీడీపీ అభ్యర్థిగా శ్రీశిల్ప
ABN , Publish Date - Oct 18 , 2026 | 03:14 AM
ఒంగోలు నగరపాలక సంస్థ టీడీపీ మేయర్ అభ్యర్థిగా నల్లమల్లి శ్రీశిల్పకు అవకాశం లభించింది. ఆ మేరకు శనివారం రాత్రి అధిష్ఠానం ప్రకటించింది. కనిగిరి నుంచి అచ్చాల తిరుపతమ్మకు, చీమకుర్తి నుంచి శిద్దా సుధాకర్‌కు అవకాశం కల్పించారు.
చీమకుర్తికి శిద్దా సుధాకర్
కనిగిరికి అచ్చాల తిరుపతమ్మ
దర్శి నుంచి జనసేన అభ్యర్థిగా దారం సుబ్బారావు
గిద్దలూరు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకటనారాయణ
అక్కడ పోటీకి సిద్ధమవుతున్న టీడీపీ శ్రేణులు
పూర్తయిన కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక
ఒంగోలు నగరపాలక సంస్థ టీడీపీ మేయర్ అభ్యర్థిగా నల్లమల్లి శ్రీశిల్పకు అవకాశం లభించింది. ఆ మేరకు శనివారం రాత్రి అధిష్ఠానం ప్రకటించింది. కనిగిరి నుంచి అచ్చాల తిరుపతమ్మకు, చీమకుర్తి నుంచి శిద్దా సుధాకర్‌కు అవకాశం కల్పించారు. దర్శి నుంచి జనసేన అభ్యర్థిగా దారం సుబ్బారావు పోటీచేయనున్నారు. గిద్దలూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ జాది వెంకటనారాయణ బరిలోకి దిగనున్నారు. దీంతో జిల్లాలో ఎన్నికలు జరగనున్న ఒంగోలు కార్పొరేషన్, మిగిలిన మున్సిపాలిటీల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. గిద్దలూరు బీజేపీకి ఇవ్వడాన్ని సమర్థించని టీడీపీ శ్రేణులు ఆదివారం పోటీ నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. అలాగే చీరాలలో కాంగ్రెస్ తరఫున ఆమంచి కూడా చైర్మన్ అభ్యర్థిని రంగంలోకి దింపడం చర్చనీయాంశమైంది.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
ఉమ్మడి జిల్లాలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు ఆరు మున్సిపాలిటీలకు 28వ తేదీ ఎన్నికలు జరగ నున్నాయి. ఆదివారం నామినేషన్ల దాఖలుకు చివరి రోజు. దీంతో మిగిలిన స్థానాల అభ్యర్థులను ఆయా పార్టీలు శనివారం రాత్రి ప్రకటించాయి. టీడీపీ.. ముఖ్యంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఒంగోలు మేయర్ అభ్యర్థి ఎంపిక విషయంలో వ్యూహాత్మ కంగా వ్యవహరించారు. ఇటు ఆర్యవైశ్య, అటు కాపు సామాజికవర్గాలు కలిసొచ్చే విధంగా శ్రీశిల్పను ఎంపిక చేసినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. విద్యాధికురాలైన ఆమె కాపు సామాజి కవర్గం కాగా ఆమె భర్త నల్లమల్లి బాలు ఆర్యవైశ్య వర్గానికి చెందిన వ్యాపారి. కీలకమైన ఈ అభ్యర్థి ఎంపికపై టీడీపీ విభిన్న వర్గాల ప్రజల అభిప్రా యాలను కూడా సేకరించింది. గత మూడు రోజు ల నుంచి అరడజను మంది నాయకుల పేర్లపై ఐవీఆర్ఎస్ సర్వే చేశారు. ఇద్దరు వ్యాపారులపై చేసిన సర్వేకు సానుకూల స్పందన లభించలేదని తెలిసింది. దీంతో మరోసారి మరికొన్ని పేర్లతో సర్వే చేసి శ్రీశిల్పకు అవకాశం ఇచ్చారు.
కనిగిరిలో కార్యకర్తకు ప్రాధాన్యం
కనిగిరిలో ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి కుమా ర్తెకు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై పార్టీశ్రేణుల నుంచి పూర్తి సానుకూలత సర్వేలో వ్యక్తమైంది. సాధారణ ప్రజల్లోనూ మెజారిటీ వచ్చినట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యే తన కుమార్తెకు ఇవ్వడం కరెక్టు కాదని, పార్టీశ్రేణులకు టికెట్ ఇచ్చినా గెలిపిస్తానని చెప్పడంతో ఆరంభం నుంచి పార్టీలో ఉన్న రెడ్డి సామాజికవర్గానికి చెందిన తిరుపతమ్మకు అవకాశం కల్పించారు.
చీమకుర్తిలో మారిన సీన్
చీమకుర్తి మున్సిపాలిటీ నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం ఇవ్వాలని తొలుత అధిష్ఠానం భావించింది. తదనుగుణంగా ఏకాభిప్రాయానికి రావాలని ఆ సామాజికవర్గ నాయకులకు ఎమ్మెల్యే విజయ్‌కుమార్ సూచిం చారు. అది సాధ్యపడకపోవడంతో ఆర్యవైశ్య సామాజికవర్గానికి చెందిన శిద్దా సుధాకర్‌కు అవకాశం ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గిద్దలూరులో పోటీకి టీడీపీ సిద్ధం?
గిద్దలూరును బీజేపీకి కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్న అక్కడి టీడీపీ శ్రేణులు తమ అభ్యర్థికే బీజేపీ నుంచి టికెట్ ఇవ్వాలని ఆ పార్టీని కోరారు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ససేమిరా అని ఆ పార్టీకి చెందిన డాక్టర్ నారాయణను చైర్మన్ అభ్య ర్థిగా ప్రకటించింది. ఆయన వైసీపీ అభ్యర్థికి సన్నిహితుడన్న పేరుంది. దీనికితోడు సామాజికంగా ఏమాత్రం బలం లేని వర్గానికి చెందిన వారు కావడంతో తీవ్ర విమర్శలు చెలరేగాయి. దీంతో టీడీపీ నాయకులు ఆదివారం కృష్ణకిశోర్రెడ్డితో నామినేషన్ వేయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రానున్న రెండు రోజుల్లో గిద్దలూరు విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాల్సి ఉంది.
జనసేనలో చేరిన సుబ్బారావు
దర్శికి చెందిన టీడీపీ నాయకుడు దారం సుబ్బా రావు శనివారం రాత్రి జనసేనలో చేరారు. తొలుత టీడీపీ నుంచి దర్శి చైర్మన్ అభ్యర్థిగా పోటీకి ఆయన ప్రయత్నించారు. అయితే ఆ స్థానం జనసే నకు దక్కింది. జనసేన తొలుత ఇప్పటికే ఆపార్టీ లో ఉన్న ఆర్యవైశ్య నాయకుల సమర్థతపై సర్వే చేసింది. సానుకూల స్పందన రాకపోవడంతో సుబ్బారావు అభ్యర్థిత్వంపై సర్వే చేసి ఆయన్ను పార్టీలో చేర్చుకొని పోటీకి దింపినట్లు తెలిసింది.