Share News

శ్రీరంగాపురం.. శోకసంద్రం

ABN , Publish Date - Oct 11 , 2026 | 02:41 AM

సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన పెనుప్రమాదంతో శ్రీరంగాపురం గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన వారిలో ఇద్దరు మృతితోపాటు మరో ఇద్దరు గల్లంతయ్యారు.

శ్రీరంగాపురం.. శోకసంద్రం
బీచ్‌లో తమ బిడ్డల మృతి విషయం తెలియగానే శ్రీరంగాపురంలో విలపిస్తున్న వారి తల్లులు

పాకల బీచ్‌లో పెనుప్రమాదం

అలల ధాటికి కొట్టుకుపోయిన తొమ్మిది మంది

ఆరుగురిని రక్షించిన స్థానిక మత్స్యకారులు

గల్లంతైన ముగ్గురిలో ఒడ్డుకొచ్చిన ఓ మృతదేహం

చికిత్స పొందుతూ ఒకరు మృతి.. లభించని ఇద్దరి ఆచూకీ

కనిగిరి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో శనివారం మధ్యాహ్నం జరిగిన పెనుప్రమాదంతో శ్రీరంగాపురం గ్రామంలో తీవ్ర విషాదచాయలు అలముకున్నాయి. తీరంలో సరదాగా గడిపేందుకు వెళ్లిన వారిలో ఇద్దరు మృతితోపాటు మరో ఇద్దరు గల్లంతయ్యారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారు. తమ బిడ్డలు విగతజీవులయ్యారని తెలియడంతో వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామదేవత ఉత్సవాలు ముగియడంతో కనిగిరి మండలంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన సుమారు 70 కుటుంబాల వారు శనివారం పాకల బీచ్‌కు వెళ్లారు. తీరంలో ఆనందంగా గడుపుతున్న సమయంలో ఉధృతంగా వచ్చిన రాకాసి అల ధాటికి తొమ్మిదిమంది సముద్రం లోపలికి కొట్టుకుపోయారు. వెంటనే గుర్తించిన సమీపంలోని మత్స్యకారులు ఆరుగురిని రక్షించారు. మిగతా ముగ్గురు గల్లంతయ్యారు. వారిలో పాలడుగు తేజ (20) మృతదేహం కొద్దిసేపటికి ఒడ్డుకు కొట్టుకువచ్చింది. చికిత్స పొందుతున్న వారిలో బత్తుల మహేష్‌బాబు (22) మృతిచెందారు.

ఎటుచూసినా రోదనలు

కొద్దిసేపటి క్రితం వరకూ తమ కళ్ల ముందే నవ్వుతూ, ఆటపాటలతో గడిపిన వారు మధ్యాహ్నానికి సముద్రంలో గల్లంతయ్యారని తెలియడంతో కుటుంబసభ్యుల కన్నీరుమున్నీరయ్యారు. తేజ, మహేష్‌లు మృతి చెందినట్లు తెలుసుకున్న వారి తల్లులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు గ్రామస్థులను కలచివేసింది. ఎదిగొచ్చిన కొడుకు ఇక తిరిగి రాడన్న చేదు నిజాన్ని తట్టుకోలేక తేజ తల్లి పడుతున్న వేదన వర్ణణాతీతం. మరోవైపు సముద్రంలో గల్లంతైన వారిలో నారాయణ అనే యువకుడు కూడా ఉండటంతో అతని తల్లి, కుటుంబ సభ్యులు బోరునవిలపిస్తున్నారు. మిగతా వారు తమ బిడ్డలు క్షేమంగా వస్తారన్న ఆశతో ఎదురుచూస్తున్న తీరు హృదయవిదారకం.

ఆవేదనలు.. ఆక్రందనలు

ఒకవైపు కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రుల ఆక్రందనలు. మరోవైపు ఆచూకీ తెలియని బిడ్డల కోసం ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యుల ఆవేదన గ్రామస్థుల హృదయాలను కలచి వేస్తోంది. గ్రామస్థులు, మృతుల బంధువులు పాకల తరలివెళ్లారు. నిన్నటి వరకు గ్రామదేవతైన పోలేరమ్మ ఉత్సవంతో కళకళలాడిన ఆ పల్లెలో ఇప్పుడు తీవ్ర విషాదం నెలకొంది. బతుకుదెరువు కోసం ఏడాదంతా ఊరికి దూరంగా ఉండి, వినాయక చవితికి స్వగ్రామానికి వచ్చి పోలేరమ్మ ఉత్సవంలో ఒకచోట చేరి ఆనందంగా గడుపుతున్న ఆ కుటుంబాలకు అనుకోని రీతిలో జరిగిన ప్రమాదం తీరని గాయాన్ని మిగిల్చింది. ఘటనపై ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు, శ్రీరంగాపురం వాసులకు ఫోన్‌ చేసి పరామర్శించారు. చికిత్సపొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని తెలిపారు. అవసరమైతే తన అమరావతి ఆస్పత్రికి తరలిస్తానని ఆయన చెప్పారు.

-----------------------------------

Updated Date - Oct 11 , 2026 | 02:41 AM