Share News

వేగవంతంగా భూసేకరణ

ABN , Publish Date - Jan 29 , 2026 | 02:36 AM

రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల స్థాపన కోసం ల్యాండ్‌బ్యాంక్‌ ఏర్పాటే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకెళుతోంది. అందులో భాగంగా ఏపీ మారిటైం బోర్డు ద్వారా భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా చేయిస్తోంది.

వేగవంతంగా భూసేకరణ

చేవూరు, రావూరులలో బీపీసీఎల్‌ కోసం ప్రక్రియ మొదలు

మారిటైం బోర్డుకు 95.13 ఎకరాల ప్రభుత్వ భూమి

మార్కెట్‌ విలువకు కేటాయిస్తూ కేబినెట్‌ తీర్మానం

కందుకూరు, జనవరి 28 (ఆంధ్రజ్యోతి) : రామాయపట్నం పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల స్థాపన కోసం ల్యాండ్‌బ్యాంక్‌ ఏర్పాటే లక్ష్యంగా ప్రభు త్వం ముందుకెళుతోంది. అందులో భాగంగా ఏపీ మారిటైం బోర్డు ద్వారా భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా చేయిస్తోంది. పోర్టుకు అనుబంధంగా భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (బీపీసీఎల్‌) ఆయిల్‌ రిఫైనరీ కమ్‌ పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుని తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. అందుకోసం గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు, ఏలూరుపాడు గ్రామాలతోపాటు కావలి రూరల్‌ మండలంలోని చెన్నాయపాలెం, రుద్రకోట, ఆనెమడుగు గ్రామాల పరిధిలో భూమిని సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు భూసేకరణ ప్రక్రియ చేస్తున్న విషయం తెలిసిందే.

పూర్తికావస్తున్న భూసేకరణ

చేవూరు రెవెన్యూ పరిధిలోని చేవూరు, ఏలూరుపాడు గ్రామాలలో నాలుగేళ్లుగా భూసేకరణ ప్రక్రియ జరుగుతోంది. అప్పట్లో చేవూరు పరిధిలో ఇండోసోల్‌ సోలార్‌ ప్రాజెక్టు కోసం ఏపీ మారిటైం బోర్డు ద్వారా భూసేకరణ జరిగింది. బీపీసీఎల్‌ రిఫైనరీ కమ్‌ పెట్రో కెమికల్‌ కారిడార్‌ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాష్ట్రంలో ఏర్పాటుకావాలన్న లక్ష్యంతో ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఇండోసోల్‌ సోలార్‌ ఎనర్జీ ప్రాజెక్టును కరేడుకు మార్పు చేసి చేవూరు, రావూరులలో బీపీసీఎల్‌ కోసం భూసేకరణ జరుపుతున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో చేవూరులో 80శాతానికి పైగా రైతుల నుంచి భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. చేవూరు, ఏలూరుపాడు గ్రామాలలో రైతులు కోర్టును ఆశ్రయించిన కొద్దిశాతం భూములు మినహా మిగిలిన భూముల సేకరణ ప్రక్రియ పూర్తయింది. రావూరులో ప్రభుత్వ ధరకు, భూమి మార్కెట్‌ విలువకు వ్యత్యాసం ఉంది. దీంతో పరిహారం విషయంలో తేడా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తూ వచ్చారు. ఇటీవల కలెక్టరు, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పలుదఫాలు రైతులతో చర్చలు జరిపారు. ఆమోదయోగ్యమైన పరిహారం ప్రకటించడంతో రైతులు భూములను మారిటైం బోర్డుకు అప్పగించేందుకు అంగీకరించారు. దీంతో ఆ గ్రామంలోనూ భూసేకరణ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది.

మారిటైం బోర్డుకు అప్పగిస్తూ క్యాబినెట్‌ ఆమోదం

చేవూరు, రావూరు గ్రామాల పరిధిలో ఉన్న 95.13 ఎకరాల ప్రభుత్వ భూమిని మార్కెట్‌ విలువ ప్రకారం మారిటైం బోర్డుకు అప్పగించేందుకు బుధవారం అమరావతిలో జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో ఆమోదించారు. ఇందులో రావూరు గ్రామంలో 78.67 ఎకరాలు, చేవూరు గ్రామపరిధిలో 16.46 ఎకరాలు ఉంది. రావూరులో ఎకరం రూ.15 లక్షల వంతున, చేవూరులో ఎకరం రూ.20.12 లక్షల వంతున ప్రభుత్వానికి చెల్లించి మారిటైం బోర్డు ఆ భూములను పరిశ్రమల ఏర్పాటు కోసం స్వాధీనం చేసుకునేలా తీర్మానాన్ని ఆమోదించారు. రావూరులో సర్వే నెం. 659-9, 660-4లలో 8.06 ఎకరాల భూమిని కోటి 20లక్షల 90వేల రూపాయలు, రావూరులోనే సర్వేనెం. 39, 48-1లలో ఉన్న 70.61 ఎకరాలకు 10 కోట్ల 59లక్షల 15వేల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి మారిటైం బోర్డు స్వాధీనం చేసుకునేందుకు క్యాబినెట్‌ ఆమోదించింది. అలాగే చేవూరు గ్రామంలోని సర్వేనెం.185, 198లలో 16.46 ఎకరాలను 3కోట్ల 31 లక్షల19వేల 200 రూపాయలు ప్రభుత్వానికి చెల్లించి ఆ భూమిని మారిటైం బోర్డు స్వాధీనం చేసుకునేలా క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Updated Date - Jan 29 , 2026 | 02:36 AM