Share News

పనుల్లో వేగం.. చెల్లింపుల్లో నిదానం

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:39 AM

వెలిగొండ ద్వారా వచ్చే జూలైకి నీటి విడుదల సాధ్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినట్లు నీటిని విడుదల చేయాలంటే ఫీడర్‌ కాలువ నిర్మాణాలు పూర్తికావాలి. దీంతోపాటు ముంపు గ్రామాల ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ప్రకటించిన నష్టపరిహారం చెల్లించి గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది.

పనుల్లో వేగం.. చెల్లింపుల్లో నిదానం
శరవేగంగా జరుగుతున్న వెలిగొండ ఫీడర్‌ కాలువ పనులు

చకచకా సాగుతున్న ఫీడర్‌ కాలువ పనులు

నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యం

జూలైకి నీరు విడుదలయ్యేనా?

వెలిగొండ ప్రాజెక్ట్‌ పనుల తీరుతెన్ను

వెలిగొండ ద్వారా వచ్చే జూలైకి నీటి విడుదల సాధ్యమేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించినట్లు నీటిని విడుదల చేయాలంటే ఫీడర్‌ కాలువ నిర్మాణాలు పూర్తికావాలి. దీంతోపాటు ముంపు గ్రామాల ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద ప్రకటించిన నష్టపరిహారం చెల్లించి గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంది. ఈ రెండు పనులపై స్పష్టమైన అవగాహనతోనే జూలైలో నీటి విడుదల చేస్తామని సీఎం ప్రకటించినట్లు అందరూ భావించారు. ఫీడర్‌ కాలువ పనుల తీరును చూస్తే సాధ్యమేనన్న నమ్మకం కలుగుతోంది. కానీ పునరావాస కాలనీల పనులు, ముంపు బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో జాప్యాన్ని చూస్తే అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో యావత్తు జిల్లా ప్రజానీకం దృష్టి ఆ వైపు మళ్లింది.

(ఒంగోలు ఆంధ్రజ్యోతి)

ఫీడర్‌ కాలువకు శంకుస్థాపన అనంతరం పనుల్లో వేగం పెరిగింది. మొత్తం 22 కిలోమీటర్ల పొడవున ఉన్న ఈ ఫీడర్‌ కాలువ లైనింగ్‌, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులు పూర్తిచేయాల్సి ఉంది. అందుకోసం ప్రభుత్వం రూ.456 కోట్లు మంజూరు చేసింది. నీటి పారుదల శాఖ మంత్రి రామానాయుడు ప్రత్యేక దృష్టితో ఈ నిధులను మంజూరు చేయించారు. ఆ ప్రాంత టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా ఒత్తిడి తెచ్చారు. మంత్రి రామానాయుడు రోజువారీ సమీక్ష చేయడంతోపాటు ఒక నెలలోనే నాలుగు సార్లు ఆ ప్రాంతాన్ని సందర్శించి నిర్మాణ వ్యవహారం ముందుకుసాగేందుకు దోహదపడ్డారు. గతనెల 25న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దోర్నాల మండలం గంటవానిపల్లి వద్దకు వచ్చి ఫీడర్‌ కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. అక్కడే సంబంధిత ఇంజనీర్‌లతో పనుల తీరుపై క్షుణ్ణంగా సమీక్ష చేశారు. ఆ తరువాత మార్కాపురం సభలో జూలైలో వెలిగొండ నీటిని విడుదల చేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శంకుస్థాపన అనంతరం నిర్మాణ పనుల్లో వేగం పెరిగింది.

నిర్మాణ పనుల్లో పురోగతి

ప్రస్తుతం రోజుకు వెయ్యి క్యూబిక్‌ మీటర్ల పొడవున ఫీడర్‌ కాలువ కాంక్రీట్‌ పనులు జరు గుతున్నాయి. రోజుకు 1,500 క్యూబిక్‌ మీటర్లు చేస్తేనే నిర్ణీత గడువులోపు పనులు పూర్తికావని మంత్రి రామానాయుడు భావించారు. తదనుగుణంగా పనుల్లో వేగం పెరిగే విధంగా రోజువారీ పర్యవేక్షణ చేస్తున్నారు. తాజాగా పరిశీలిస్తే.. లైనింగ్‌, రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనుల్లో గతంకన్నా వేగం పెరిగింది. రమారమి 5 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉంది. గడచిన ఇరవై రోజుల్లో ఈ పనుల్లో మరింత పురోగతి కనిపించింది. పనులను పరిశీలించిన ఎవరికైనా ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఈ కాలువ పనులన్నీ పూర్తి చేయకుండా, పునరావాస కేంద్రాల బాధితులకు పరిహారం ఇవ్వకుండా ప్రాజెక్టును జాతికి అంకితం చేశానని జగన్‌ చేసిన మోసం కనబడుతుంది. ఆంధ్రజ్యోతి బృందం నిర్మాణ పనుల పరిశీలనకు వెళ్లినప్పుడు వాటిని చూసేందుకు వచ్చిన వైపాలెం నియోజకవర్గానికి చెందిన సాధారణ ప్రజలు ఈవిధమైన అభిప్రాయాన్ని బహిరం గంగానే వ్యక్తం చేశారు. ప్రస్తుతం పనుల తీరును పరిశీలిస్తే ముఖ్యమంత్రి చెప్పిన జూలై కన్నా ఇంకా ముందే వెలిగొండ ప్రాజెక్టు జలాలు వస్తాయన్న భావన వ్యక్తమవుతోంది.

నష్టపరిహారం చెల్లింపులో మీనమేషాలు

రెండో ప్రధాన ఘట్టమైన నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లింపు ఆశించినంత వేగంగా జరగడం లేదు. సుంకేసుల, గొట్టిపడియ రిజర్వాయర్‌ల పరిధిలోనే 11 ముంపు గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంత గ్రామాల ప్రజలందరినీ ఖాళీ చేయిస్తేనే నీటి విడుదల సాధ్యమవుతుంది. వీరికి నష్టపరిహారం కింద సుమారు రూ.900 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ప్రభుత్వం నిర్వాసితులు తక్కువగా ఉన్న ఏడు గ్రామాల్లోని వారికి చెల్లించేందుకు అవసరమైన రూ.80 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఈ ఏడు గ్రామా ల్లోని రమారమి 663 మంది ఖాతాల్లోకి డబ్బులు జమ కావాలి. అయితే జమ ప్రారంభమైన్పటికీ అందరి ఖాతాల్లోకి డబ్బులు పడలేదు. దీంతో పలు సందేహాలను ప్రజలు వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానం లేదు గానీ నిధుల కొరత సమస్యకావచ్చన్న భావనను పలువురు వ్యక్తపరుస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు నిధులు సమకూర్చి లైనింగ్‌ పనులు పూర్తిచేసినట్లే, నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి జూలైకు నీరు ఇస్తారా? లేక మరోమారు వాయిదా వేస్తారా? అన్నది వేచిచూడాల్సి ఉంది.

Updated Date - Mar 22 , 2026 | 01:39 AM