Share News

నేటి నుంచి ‘ప్రత్యేక’పాలన

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:50 AM

ఐదేళ్లుగా ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాల ఆధీనంలో సాగిన పట్టణ స్థానిక సంస్థల పాలన బుధ వారం నుంచి ప్రత్యేక అధికారుల చేతుల్లోకి రానుంది. వాటి పాలక మండళ్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈలోపు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలనా వ్యవహారాలకు అటంకం లేకుండా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం ఇప్పటికే నియమించింది.

నేటి నుంచి ‘ప్రత్యేక’పాలన
ఒంగోలు కార్పొరేషన్‌ కార్యాలయం నుంచి తమ నేమ్‌ బోర్డులు తీసుకొని బయటకు వస్తున్న మహిళా కార్పొరేటర్లు

స్థానిక సంస్థల పాలకవర్గాలకు ముగిసిన పదవీకాలం

మాజీలైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు

చివరిరోజు జరిగిన ఒంగోలు కార్పొరేషన్‌ సమావేశం

వచ్చేనెల 2తో ముగియనున్న పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం

వాటికి కూడా స్పెషలాఫీసర్ల నియామకానికి యంత్రాంగం కసరత్తు

ఒంగోలు, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : ఐదేళ్లుగా ప్రజలు ఎన్నుకున్న పాలకవర్గాల ఆధీనంలో సాగిన పట్టణ స్థానిక సంస్థల పాలన బుధ వారం నుంచి ప్రత్యేక అధికారుల చేతుల్లోకి రానుంది. వాటి పాలక మండళ్ల పదవీకాలం మంగళవారంతో ముగిసింది. ఈలోపు ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలనా వ్యవహారాలకు అటంకం లేకుండా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం ఇప్పటికే నియమించింది. రెండు జిల్లాల పరిధిలో ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు అద్దంకి, చీమకుర్తి, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి పట్టణ స్థానికసంస్థల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లుగా పని చేసి కీలకంగా వ్యవహరించిన నేతలంతా మాజీలయ్యారు. బుధవారం నుంచి పాలకమండలి బాధ్యతలను ప్రభుత్వం తరఫున ప్రత్యేక అధికా రిగా నియమితులైన వారు నిర్వర్తించనున్నారు. ఒంగోలు కార్పొరేషన్‌కు కలెక్టర్‌ రాజాబాబు, మిగిలిన వాటికి డిప్యూటీ కలెక్టర్‌ స్థాయి అధికారిని ప్రత్యేకాధికారులుగా నియమించారు. ఇప్పటికే ఎన్నికలు జరగని కందుకూరు, పొదిలి పట్టణాలు ప్రత్యేక అధికారుల పాలనలోనే కొనసాగుతున్నాయి. ఇక దర్శిలో ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో మరికొంత కాలం ప్రస్తుత పాలకవర్గం కొనసాగనుంది. పదవీ కాలం ముగుస్తున్న అన్ని పట్టణాల్లో చివరి సమావేశాలు గత రెండు, మూడు రోజులుగా జరగ్గా ఒంగోలు కార్పొరేషన్‌ చివరి సమావేశం మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేశారు. వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి 20 అంశాలతో కూడిన అజెండాతో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులు

గ్రామపంచాయతీలు కూడా మరో రెండు వారాల్లో ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి. వచ్చేనెల 2తో పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం ముగుస్తుంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగే సూచనలు లేవు. దీంతో వాటికి కూడా ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమించనుంది. అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించింది. తదనుగుణ చర్యలపై వారు దృష్టి సారించారు. ఐదేళ్ల క్రితం 2021 ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ప్రకటన ఇవ్వగా అప్పట్లో ఉమ్మడి జిల్లాలో 1,046 పంచాయతీలు ఉన్నాయి. వివిధ కారణాలతో కొన్ని ఆగిపోగా 1,018 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం జిల్లా పునర్విభజన జరిగి మూడు జిల్లాల్లోకి వెళ్లిన విషయం విదితమే. ప్రస్తుత ప్రకాశం జిల్లాలో 519, మార్కాపురం జిల్లాలో 406 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటిలో పాలకవర్గాల పదవీకాలం ముగుస్తున్న వాటికి ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. పట్టణాలకు స్పెషలాఫీసర్లుగా జిల్లాస్థాయి అధికారులను నియమించిన ప్రభుత్వం.. గ్రామపంచాయతీలకు మండలస్థాయి అధికారులను నియమించాలని నిర్ణయించింది. అందుకు అవసరమైన ప్రతిపాదనలు నివేదించాలని ఇప్పటికే ఎంపీడీవోలను ఉన్నతాధికారులు ఆదేశించారు. మండల స్థాయిలో గెజిటెడ్‌ హోదా కలిగిన ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థకశాఖ, వైద్యశాఖల అధికారులను నియమించనున్నారు. ఇంజనీరింగ్‌ మినహా మిగతా శాఖలకు చెందిన మండలస్థాయి అధికారులను నియమించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో కొన్ని మండలాల్లో మూడు నాలుగు పంచాయతీలకు ఒకే అధికారి స్పెషల్‌ ఆఫీసర్‌గా నియామకం జరిగే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Mar 18 , 2026 | 02:53 AM