‘పరిషత్’లకు ప్రత్యేక అధికారులు
ABN , Publish Date - Sep 20 , 2026 | 11:38 PM
మండల, జిల్లా పరిషత్‌లు ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు పదవీకాలం పూర్తయిన స్థానిక సంస్థల పర్యవేక్షణను ప్రత్యేక అధికారుల పాలనలోకి తెస్తోంది.
జడ్పీలకు కలెక్టర్లు, మండలాలకు జిల్లా అధికారులు
ఈనెల 23తో మండల, 24తో జడ్పీల పదవీకాలం పూర్తి
ఆ వెంటనే స్పెషల్ ఆఫీసర్ల పాలనపై ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం
రెండు జిల్లాలకు విడివిడిగా జిల్లా పరిషత్‌లు
ఒంగోలు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : మండల, జిల్లా పరిషత్‌లు ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి. ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు పదవీకాలం పూర్తయిన స్థానిక సంస్థల పర్యవేక్షణను ప్రత్యేక అధికారుల పాలనలోకి తెస్తోంది. ఈక్రమంలో ఈ ఏడాది మార్చి 21 నుంచి పట్టణ స్థానిక సంస్థలు, ఏప్రిల్ నుంచి గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నాయి. ఈనెల 23తో మండల పరిషత్, 24తో జిల్లా పరిషత్ పాలకవర్గాల పదవీకాలం పూర్తవుతుంది. వాటికి స్పెషల్ ఆఫీసర్లను నియమిస్తూ రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ కాంతిలాల్ దండే ఉత్తర్వులు ఇచ్చారు. జిల్లా పరిషత్‌లకు స్పెషల్ ఆఫీసర్లుగా కలెక్టర్లను నియమించిన ప్రభుత్వం మండల పరిషత్ స్పెషల్ ఆఫీసర్లుగా జిల్లాస్థాయి హోదా కలిగిన సబ్‌కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టరు ఆపైస్థాయి అధికారులను నియమించాలని పేర్కొన్నారు.
ఉన్న సిబ్బందినే సర్దుబాటు
ఇప్పటివరకు ఒంగోలు కేంద్రంగా ఉన్న ఉమ్మడి జిల్లా పరిషత్ ఇటు ప్రకాశం, అటు మార్కాపురం జిల్లా పరిషత్‌లుగా ఈనెల 25 నుంచి ఉనికిలోకి రానున్నాయి. ప్రకాశం జడ్పీకి కలెక్టర్ రాజాబాబు, మార్కాపురం జడ్పీకి కలెక్టర్ విజయసునీతలు ఇప్పటికే ప్రత్యేకాధికారులుగా నియమితులయ్యారు. అధికార వర్గాల సమాచారం మేరకు ప్రస్తుత ఉమ్మడి జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందిలో 50 శాతం మందిని ప్రకాశం జడ్పీకి, కొత్తగా ఏర్పడనున్న మార్కాపురం జిల్లాకు 38 శాతం, అలాగే బాపట్లకు 12 శాతం మందిని కేటాయిస్తున్నారు. పరిషత్‌లలో స్పెషల్ ఆఫీసర్ల పాలన మండలాల్లో ఈనెల 24 నుంచి, జిల్లా పరిషత్‌లో 25నుంచి ప్రారంభం కానుంది.
ఆ నియామకాలపై దృష్టి
జడ్పీ ప్రత్యేకాధికారులుగా కలెక్టర్లను ఇప్పటికే ప్రభుత్వం నియమించడంతో వారు 25న ఆ బాధ్యతలు తీసుకోనున్నారు. మండలాలు 24 నుంచే స్పెషల్ ఆఫీసర్ల పాలనలోకి రానుండటంతో వాటికి అధికారుల రెండు జిల్లాల కలెక్టర్లు దృష్టి సారించారు.