మునిసిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:09 AM
పట్టణ స్థానిక సంస్థల పాలక మండళ్ల పదవీ కాలం మరో వారంలో ముగియనుంది. దీంతో ఆయా సంస్థలకు స్పెషలాఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత పాలక మండళ్ల పదవీకాలం ఈనెల 17తో ముగియనుండగా ఇంతవరకు ఎన్నికల నిర్వహణ కసరత్తు చేయలేదు.
పట్టణాలకు డిప్యూటీ కలెక్టర్లు నియామకం
వారంలో ముగియనున్న పాలకమండళ్ల పదవీకాలం
అనంతరం అధికారుల పాలన
ఒంగోలు, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) : పట్టణ స్థానిక సంస్థల పాలక మండళ్ల పదవీ కాలం మరో వారంలో ముగియనుంది. దీంతో ఆయా సంస్థలకు స్పెషలాఫీసర్లను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుత పాలక మండళ్ల పదవీకాలం ఈనెల 17తో ముగియనుండగా ఇంతవరకు ఎన్నికల నిర్వహణ కసరత్తు చేయలేదు. దీంతో పాలనా వ్యవహారాల పర్యవేక్షణకు స్పెషలాఫీసర్లు అవసరమ య్యారు. ఆ మేరకు మునిసిపల్ శాఖ కోరడంతో రాష్ట్రవ్యాప్తంగా 11 కార్పొరేషన్లు, 75 మునిసిపాలిటీలు, నగరపంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అందులో ఉమ్మడి జిల్లాలో ఎన్నికలు జరిగి వారంలో పదవీకాలం పూర్తికానున్న ఒంగోలు కార్పొరేషన్‌తోపాటు మరో ఐదు మునిసిపాలిటీలు, నగరపంచాయతీలు ఉన్నాయి. ఒంగోలుకు స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ రాజాబాబు నియమితులయ్యారు. అద్దంకి నగర పంచాయతీకి అక్కడి ఆర్డీవో, చీమకుర్తి నగర పంచాయతీకి ఒంగోలు ఆర్డీవోను నియమించారు. మార్కాపురం మునిసిపాలిటీకి అక్కడి ఆర్డీవో, కనిగిరి నగరపంచాయతీకి అక్కడి ఆర్డీవో, గిద్దలూరు నగరపంచాయతీకి మార్కాపురంలోని భూసేకరణ. పునరావాస యూనిట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌ను స్పెషల్ ఆఫీసర్‌గా నియమించారు. ఇదిలా ఉండగా దర్శికి ఆలస్యంగా ఎన్నికలు జరగడంతో ప్రస్తుత పాలకవర్గం పదవీ కాలం ఉన్నంత వరకు కొనసాగనుంది. ఎన్నికలు జరగని కందుకూరు, పొదిలిలు ఇప్పటికే స్పెషల్ ఆఫీసర్ల పాలనలో నడుస్తున్నాయి. తాజాగా ఆయా మునిసిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లుగా నిమితులైన అధికారులు గరిష్ఠంగా ఆరు మాసాలు లేదా ఎన్నికలు జరిగే వరకు ఏది ముందుగా అయితే ఆ సమయం వరకు ఆ బాధ్యతల్లో ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.