స్పెషల్ ఆఫీసర్లు సిద్ధం
ABN , Publish Date - Mar 29 , 2026 | 02:25 AM
ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. వచ్చేనెల 2వతేదీతో పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచే పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి.
గ్రామ పంచాయతీల్లో నియామకానికి ఏర్పాట్లు
ఇప్పటికే మండలాల నుంచి చేరిన జాబితాలు
కలెక్టర్ ఆమోదముద్ర వేసిన వెంటనే ప్రకటన
3 నుంచి పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన
ఒంగోలు కలెక్టరేట్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని గ్రామ పంచాయతీలకు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. వచ్చేనెల 2వతేదీతో పాలకవర్గాల పదవీకాలం ముగియనుంది. ఆ మరుసటి రోజు నుంచే పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలోకి రానున్నాయి. ప్రకాశం జిల్లాలో 519, మార్కాపురం జిల్లాలో 406 కలిపి 925 పంచాయతీలు ఉన్నాయి. కొండపి పంచాయతీ మినహా మిగిలివన్నీ ప్రత్యేకాధికారుల పాలనలోకి రానున్నాయి. ఇటీవలనే కొండపి పంచాయతీ ఎన్నికలు జరగడంతో అక్కడ నూతనంగా పాలకవర్గం ఏర్పడింది. దానిని మినహాయించి మిగిలిన అన్నింటిల్లో స్పెషలాఫీసర్లను నియమించనున్నారు. ఆయా మండలాల్లో ఉన్న పంచాయతీలకు గెజిటెడ్ హోదా ఉన్న అధికారులను నియమించాల్సి ఉంది. అందుకు ఒక ప్రొఫార్మాను కూడా జారీచేశారు. దానికి అనుగుణంగా మండల స్థాయిలోని ఎంపీడీవో. డిప్యూటీ ఎంపీడీవోల ఆధ్వర్యంలో ఆయా పంచాయతీల వారీగా ప్రత్యేక అధికారుల నియామకాలను పూర్తిచేసి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి పంపారు. ఇప్పటికే ఆ జాబితాల కసరత్తు పూర్తైంది. మండల స్థాయిలో అధికారులు ముఖ్య ప్రజాప్రతినిధుల సూచనలకు అనుగుణంగా ఆ జాబితాలను రూపొందించి పంపారు. అలా రెండు జిల్లాల నుంచి వచ్చిన జాబితాలను జిల్లా పంచాయతీ కార్యాలయంలో పరిశీలించి కలెక్టర్‌కు నివేదించనున్నారు. ఆయన ఆమోదముద్ర వేసిన వెంటనే ఏ పంచాయతీకి ఎవరిని నియమించింది ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియ మొత్తం రెండు, మూడు రోజుల్లో పూర్తిచేసే అవకాశం ఉంది.