Share News

పంచాయతీల్లో ‘ప్రత్యేక’ పాలన

ABN , Publish Date - Apr 04 , 2026 | 02:36 AM

జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీలు స్పెషల్‌ ఆఫీసర్ల పాలనలోకి వచ్చేశాయి. పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఐదేళ్ల పదవీకాలం ఈనెల 2తో ముగిసిన విషయం విదితమే. ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడకుండా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకాధికారులను నియమించింది.

పంచాయతీల్లో ‘ప్రత్యేక’ పాలన

సర్పంచ్‌, వార్డు సభ్యుల అధికారాలన్నీ స్పెషల్‌ ఆఫీసర్ల చేతుల్లోకి..

జిల్లావ్యాప్తంగా బాధ్యతల స్వీకరణ

మరింత పెరగనున్న అధికారపార్టీ పట్టు

క్షేత్రస్థాయిలో పూర్తిగాపోనున్న వైసీపీ నేతల పెత్తనం

ఒంగోలు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా గ్రామపంచాయతీలు స్పెషల్‌ ఆఫీసర్ల పాలనలోకి వచ్చేశాయి. పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఐదేళ్ల పదవీకాలం ఈనెల 2తో ముగిసిన విషయం విదితమే. ప్రస్తుతం ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో పంచాయతీల్లో పాలన కుంటుపడకుండా ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేకాధికారులను నియమించింది. జిల్లాలో 519 గ్రామ పంచాయతీలు ఉండగా కొండపి మినహా మిగతా 518 పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. వాటన్నింటికీ స్పెషల్‌ ఆఫీసర్లను నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌ నియమించారు. మండల స్థాయిలో గెజిటెడ్‌ హోదా కలిగిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, వెటర్నరీ డాక్టర్లు తదితర శాఖలకు సంబంధించిన అధికారులు అందులో ఉన్నారు. చాలా మండలాల్లో 20 వరకు గ్రామ పంచాయతీలు ఉండటంతో ఒక్కో అధికారికి రెండు, మూడు గ్రామపంచాయతీల బాధ్యతలను అప్పగించారు. కాస్తంత ఆదాయం అధికంగా ఉండే పంచాయతీలకు సీనియర్‌ అధికారులను నియమించారు. అలా నియమితులైన వారు కలెక్టర్‌ ఆదేశాలకు అనుగుణంగా శుక్రవారం ఆ బాధ్యతలు స్వీకరించారు.

పెరగనున్న ‘అధికార’ పెత్తనం

ఇప్పటివరకు పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, ఇతరత్రాలకు.. అలాగే పంచాయతీకి వివిధ రూపాలలో లభించే రాబడిని ఖర్చుచేయడం, మౌలిక సదుపాయాల నిర్వహణ అంతా సర్పంచ్‌, వార్డు సభ్యులతో కూడిన పాలకవర్గ నిర్ణయానికి అనుగుణంగా గ్రామ కార్యదర్శుల పర్యవేక్షణలో సాగేది. ఇక ఆ విధులన్నీ స్పెషల్‌ ఆఫీసర్ల పరిధిలోకి రానున్నాయి. దాని వల్ల రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతల పెత్తనం గ్రామ పరిపాలన వ్యవహారాల్లో మరింత పెరగనుంది. సాధారణంగా స్థానిక సంస్థల్లో ఎవరు అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ప్రభుత్వంలో ఎవరు ఉంటే వారి సూచనలకు అనుకూలంగా కిందిస్థాయి అధికారులు నడుస్తుంటారు. అయితే గత పంచాయతీ ఎన్నికల్లో 80శాతం వైసీపీ మద్దతుదారులు గెలుపొందారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం వచ్చాక కూడా వైసీపీ సర్పంచ్‌లే ఉండటంతో పాలనా వ్యవహారాల్లో పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రస్తుతం స్పెషల్‌ ఆఫీసర్ల పాలన రావడంతో ఆ సమస్య తీరనుంది. అదేసమయంలో క్షేత్రస్థాయిలో ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండే పంచాయతీల్లో ఇప్పటిదాకా సాగిన వైసీపీ నేతల పెత్తనం ఇక పూర్తిగా తొలగిపోనుంది. అధికారపార్టీ కీలక నేతల సూచనలకు అనుగుణంగా సాగే అవకాశం ఉంది.

Updated Date - Apr 04 , 2026 | 02:36 AM