Share News

నీటి తీరువా వసూళ్లపై ప్రత్యేక దృష్టి

ABN , Publish Date - Mar 29 , 2026 | 02:31 AM

రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ రైతులపై ఒత్తిడి చేయకుండా ఎక్కువ మొత్తంలో నీటి తీరువా పన్ను వసూలు చేయాలని సాగర్‌ కుడికాలువ ప్రాజెక్టు చైర్మన్‌ కాంతారావు సూచించారు. వచ్చే నిధులతో సాగర్‌ కాలువల మరమ్మతులు చేపట్టేందుకు వీలు కలుగుతుందన్నారు.

నీటి తీరువా వసూళ్లపై ప్రత్యేక దృష్టి
సమావేశంలో మాట్లాడుతున్న సాగర్‌ కుడికాలువ ప్రాజెక్టు చైర్మన్‌ కాంతారావు

వచ్చే సీజన్‌లో నీటి సరఫరా విధివిధానాలు ముందస్తుగానే ప్రకటన

సాగర్‌ కుడికాలువ చైర్మన్‌ కాంతారావు

అద్దంకి, మార్చి 28 (ఆంధ్రజ్యోతి): రెవెన్యూ అధికారులను సమన్వయం చేసుకుంటూ రైతులపై ఒత్తిడి చేయకుండా ఎక్కువ మొత్తంలో నీటి తీరువా పన్ను వసూలు చేయాలని సాగర్‌ కుడికాలువ ప్రాజెక్టు చైర్మన్‌ కాంతారావు సూచించారు. వచ్చే నిధులతో సాగర్‌ కాలువల మరమ్మతులు చేపట్టేందుకు వీలు కలుగుతుందన్నారు. అద్దంకి ఎన్‌ఎస్‌పీ కార్యాలయంలో శనివారం జరిగిన ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని సాగర్‌ ఆయకట్టు డిస్ర్టిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, సభ్యుల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సాగునీటి సంఘాలకు ఎలాంటి ఎన్నికలు నిర్వహించలేదన్నారు. కాలువలలో తట్ట మట్టి కూడా పూడికతీత పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్నారన్నారు. సాగర్‌ నీటి సరఫరా వ్యవస్థను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పనిసరి పరిస్థితులలో వైసీపీ నాయకులు చేయని పనులకు బిల్లులు చెల్లించాల్సి వచ్చిందన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యేలు, నేతలు స్వచ్ఛందంగా కాలువల పూడికతీత పనులు చేయించారని చెప్పారు. గతేడాది పూడికతీత, ఇతర పనులకు నిధులు కేటాయించి పనులు చేపట్టడంతో నీటి సరఫరాకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇవ్వగలిగామన్నారు. పలు ప్రాంతాల్లో ప్రస్తుతం పంటలు ఉన్నందున, మరో వారం పదిరోజులు నీటి విడుదల పొడిగించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. వచ్చే సీజన్‌లో ముందస్తుగానే నీటి విడుదల, నిలుపదల తేదీలపై ప్రకటన చేసి నీటి వ ృథాను అరికడతామని పేర్కొన్నారు. సాగర్‌ కాలువలలో సిమెంట్‌ లైనింగ్‌, ఇతర మరమ్మతులపై సీఎం దృష్టికి తీసుకుపోయి నిధులు మంజూరుకు కృషిచేస్తామన్నారు. నీటి తీరువా శిస్తు వసూలు ద్వారా వచ్చే నిధులతోనే తాత్కాలిక పద్ధతిలో లస్కర్‌లను నియమించుకోవాల్సి ఉంటుందన్నారు. వైస్‌చైౖర్మన్‌ ఉప్పలపాటి చక్రపాణి మాట్లాడుతూ సాగర్‌ కాలువలపై బ్రిడ్జిలు, డ్రాపులు ఇతర కట్టడాలు శిథిలావస్థకు చేరినందున పునర్నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. ముండ్లమూరు డీసీ చైర్మన్‌ శ్రీనివాసరావు మాట్లాడుతూ మోదేపల్లి మేజర్‌ చివరి ఆయకట్టుకు నీటి విడుదల చేయాలని కోరితే, దోసెళ్లతో తెచ్చి పోయమంటారా అని అధికారులు ఎగతాళిగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మోదేపల్లి మేజర్‌ ఆయకట్టులో ప్రస్తుతం మిర్చి, మొక్కజొన్న పంటలు ఉన్నందున ఏప్రిల్‌ 10వ తేదీ వరకు నీటి సరఫరా చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కాంతారావు అవసరమైన మేర నీటి తడులకు నీరు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు డీసీ చైర్మన్‌ కృష్ణారావు మాట్లాడుతూ ఎన్‌ఎస్‌పీ భూములు పలుచోట్ల ఆక్రమణలకు గురవుతున్నాయని, స్వాధీనానికి చర్యలు చేపట్టాలని కోరారు. త్రిపురాంతకం డీసీ చైర్మన్‌ దేవినేని చలమయ్య మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో చివరి ఆయకట్టుకు నీరు చేరాలంటే 85/3 మైలు వద్ద కనీసం 2,800 క్యూసెక్కులకు తగ్గకుండా నీటి విడుదల చేయాలని కోరారు. పంగులూరు డీసీ చైర్మన్‌ కుక్కపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ అద్దంకి బ్రాంచి కెనాల్‌లో నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉందన్నారు. సమావేశంలో ఎస్‌ఈ వరలక్ష్మి, ఈఈ విజయలక్ష్మి, సతీష్‌, డీఈఈలు రామకృష్ణ, పూర్ణచంద్‌, స్వామి, లక్ష్మీనారాయణ, వసుంధర పాల్గొన్నారు.

Updated Date - Mar 29 , 2026 | 02:31 AM