ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Aug 08 , 2026 | 02:47 AM
జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను ఓటర్లుగా నమోదు చేయించడంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ముసాయిదా ఓటర్ల జాబితాను గతనెల 31న ప్రకటించగా ప్రస్తుతం కొత్త ఓట్ల నమోదు కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
జిల్లాలో 40వేల మందికిపైగా యువత
‘స్వీప్’ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలకు ఏర్పాట్లు
నియోజకవర్గ ఈఆర్వోల నేతృత్వంలో నిర్వహణ
ఒంగోలు కలెక్టరేట్, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులను ఓటర్లుగా నమోదు చేయించడంపై ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ముసాయిదా ఓటర్ల జాబితాను గతనెల 31న ప్రకటించగా ప్రస్తుతం కొత్త ఓట్ల నమోదు కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. అర్హులైన ప్రతిఒక్కరికీ ఒకే చోట ఓటుహక్కు ఉండాలనే నినాదంతో ముందుకు సాగా లని ఎన్నికల సంఘం ఆదేశించడంతో తదనుగుణంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. జిల్లా ఎన్నికల అధికారైన కలెక్టర్ రాజాబాబు ఆదేశాలతో జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో యువ ఓటర్ల నమోదుపై దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 40వేల మంది యువతీ, యువకులు ఉంటారని యంత్రాంగం అంచనా వేసింది. 18ఏళ్లు నిండి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యాసంస్థల్లో స్వీప్ కార్యక్రమం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్, డిగ్రీ, నర్శింగ్ కాలేజీలతోపాటు ఇంటర్ ముగిసిన తర్వాత ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కాలేజీలపై దృష్టి సారించారు. ఆయా కాలేజీల్లో 18 ఏళ్లు నిండిన యువతీ. యువకులందరికీ ఓటుహక్కు కల్పించేందుకు నియోజకవర్గ స్థాయిలోనే కార్యాచరణ రూపొందించి అమలు చేయనున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ఏ విధంగా విలువ ఉందో వివరిస్తూ ఆయా కాలేజీల వారీగా అవగాహన కార్యక్రమాలతోపాటు కొత్త ఓట్ల నమోదు కోసం ఫాం-6 దరఖాస్తులను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గ ఈఆర్వోలు వారి పరిధిలో స్వీప్‌కు అంతా సిద్ధం చేస్తున్నారు. ఆ నియోజకవర్గ పరిధిలో ఎన్ని ఇంజనీరింగ్, డిగ్రీ, నర్సింగ్, ఇతర కాలేజీలు ఉన్నాయనేది గుర్తించి తదనుగుణంగా కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నారు.