నోమ్యాపింగ్ ఓట్లపై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Jul 19 , 2026 | 02:44 AM
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవ రణ (సర్)లో జిల్లాలో నోమ్యాపింగ్ ఓటర్ల గుర్తింపుపై బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 13,99,006 మంది ఓటర్లు ఉండగా ఈనెల 15 నాటికి 12,69,595 మంది డిజిటలైషన్ పూర్తిచేసుకు న్నారు.
జిల్లాలో ఆరువేల మందిని గుర్తించిన బీఎల్వోలు
ఇంకా అటువంటి వారు 45వేల మంది
ఊరు, తల్లిదండ్రుల పేర్లు చెప్పలేకపోతున్న సంచార జాతులు
ఒంగోలు కలెక్టరేట్, జూలై 18 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవ రణ (సర్)లో జిల్లాలో నోమ్యాపింగ్ ఓటర్ల గుర్తింపుపై బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 13,99,006 మంది ఓటర్లు ఉండగా ఈనెల 15 నాటికి 12,69,595 మంది డిజిటలైషన్ పూర్తిచేసుకు న్నారు. మిగిలిన 1,29,411 మంది ఓటర్లలో 40,737మంది మృతిచెందగా మరో 51,460 మంది మ్యాపింగ్ చేయించుకోలేదు. దీంతో ఆ ఓటర్లను నోమ్యాపింగ్ కింద చేర్చారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగించడంతో క్షేత్రస్థాయిలో మరోసారి ఇంటింటి పరిశీలనకు ఉపక్రమించారు. మ్యాపింగ్ చేయించకుండా మిగిలిపోయిన 51,460 ఓటర్లలో ఈనెల 16వ తేదీ నుంచి శనివారం వరకు జిల్లావ్యాప్తంగా 6వేల మంది సంబంధిత పత్రాలతో డిజిటలైజేషన్ పూర్తిచేసుకున్నారు. ఇంకా 45వేల మంది మిగిలి ఉన్నారు. వారిని కూడా గుర్తించేందుకు బీఎల్వోలు చర్యలు తీసుకున్నారు. జిల్లాకేంద్రమైన ఒంగోలులో ఎంతోకాలం నుంచి కొత్త కూరగాయల మార్కెట్ సెంటర్‌ను కేంద్రంగా ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్న నక్కల జాతి వారిలో కొందరు ప్రస్తుతం జరుగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియలో తమ తల్లిదండ్రుల పేర్లు కూడా చెప్పలేకపోతున్నట్లు సమాచారం. వారి స్వగ్రామం ఎక్కడ, పూర్వీకులకు గతంలో ఓటుహక్కు ఎక్కడ ఉంది తదితర వివరాలు తెలియదని చెప్తుండటంతో వారి ఓట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి.