Share News

విజయమార్తండేశ్వర స్వామికి ఆదాయ వనరు

ABN , Publish Date - Jan 29 , 2026 | 11:15 PM

కనిగిరి కొండపైన శ్రీవిజయమార్తండేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన స్థానిక నగరికంటి బసవయ్య సెంటర్‌ వద్ద ఉన్న రూముల లీజుకు ఈనెల 28న వేలం పాట నిర్వహించారు. గతంలో ఉన్న పురాతన రూములను తొలగించి కొత్తవి నిర్మించేలా ప్రైవేట్‌ వ్యక్తులకు అధికారులు అనుమతులు ఇచ్చారు.

విజయమార్తండేశ్వర స్వామికి ఆదాయ వనరు
తుదిదశ నిర్మాణంలో ఉన్న విజయమార్తేండేశ్వరాలయ కాంప్లెక్స్‌

పాత షాపింగ్‌ కాంప్లెక్స్‌ స్థానంలో కొత్తది నిర్మాణం

దేవదాయ శాఖపై భారం పడకుండా ప్రైవేట్‌ వ్యక్తి చేత పూర్తి

నాన్‌ రీఫండ్‌ ధరావత్తు రూపంలో షాపులలీజుదారుల నుంచి నిర్మాణదారుడికి డబ్బు చెల్లింపు

ప్రతి నెలా అద్దె చెల్లింపు తప్పనిసరి

శాశ్వత పరిష్కారానికి మార్గం చూపిన ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్ర

కనిగిరి, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : కనిగిరి కొండపైన శ్రీవిజయమార్తండేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన స్థానిక నగరికంటి బసవయ్య సెంటర్‌ వద్ద ఉన్న రూముల లీజుకు ఈనెల 28న వేలం పాట నిర్వహించారు. గతంలో ఉన్న పురాతన రూములను తొలగించి కొత్తవి నిర్మించేలా ప్రైవేట్‌ వ్యక్తులకు అధికారులు అనుమతులు ఇచ్చారు. ఈమేరకు రెండు ఫ్లోర్‌లలో మొత్తం 20 షాపులు నిర్మాణం చేపట్టారు. వాటిలో 2, 3, 4, 5 నెంబర్‌ రూములకు ఇన్నర్‌ మెట్లతో పైరూంకు కూడా హక్కులు నిర్ణయించి ధరావత్తు వసూలు చేశారు. అవి ఇన్నర్‌ మెట్ల కారణంగా 16రూములుగా విశదీకరించారు. త్వరలో నిర్మాణం పూర్తి కానుందని అధికారులు చెప్తున్నారు.

తొలుత పది రూములకు లీజు

కొత్తగా నిర్మించిన వాటిల్లో 10 రూములకు బుధవారం స్థానిక సాయిబాబా మందిరంలో వేలం నిర్వహించారు. ఈ వేలంలో గదుల నిర్మాణానికైన ఖర్చును నాన్‌ రీఫండ్‌గా నిర్ణయించి షాపులు అద్దెకు తీసుకునే వారి నుంచి వసూలు చేశారు. అందుకోసం 11ఏళ్ల పాటు లీజుకు షాపును దక్కించుకున్నారు. ఆయా రూములకు ప్రతి మూడేళ్లకోమారు అద్దెను పెంచుతామని ఈవో శ్రీగిరిరాజు నరసింహబాబు తెలిపారు. కాగా రీఫండ్‌ కింద రూ.80లక్షలు నిర్మాణదారుడికి షాపు లీజుదారులు చెల్లించారు. వాటిలో తూర్పు - దక్షిణం ఉన్న కార్నర్‌ రూముకు నాన్‌ రీఫండ్‌ (తిరిగి చెల్లించని నగదు) కింద రూ.20లక్షలు అద్దెకింద రూ.25వేలతోపాటు అదనంగా ఈఎండీ కింద మరో రూ.15వేలు వసూలు చేశారు. దాంతో పాటు ప్రతి రూంకు ధరావత్తు(డిపాజిట్‌) కింద రూ.25వేలు ఈఎండీ కింద మరో రూ.15వేలు చెల్లించాల్సి ఉంది. అదేవిధంగా ప్రతి రూమును లీజుకు తీసుకున్న వ్యక్తి ఆ షాపు నిర్మాణవ్యయంతో పాటు ధరావత్తు ముందుగా చెల్లించి లీజు ఖరారు చేసుకున్నారు. ఈప్రకారం లీజుదారులు ప్రతి నెలా అద్దె చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ప్రతి నెలా దేవాలయానికి లక్షా 7వేల రూపాయలు ఇప్పటి వరకు జరిగిన వేలం రూములకు అద్దె రానుంది. ఇంకా 6రూములకు వేలం నిర్వహించాల్సి ఉందని ఈవో శ్రీగిరిరాజు నరసింహబాబు చెప్పారు. గుంటూరు దేవదాయశాఖ డిప్యూటి కమిషనర్‌ కేబీ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్‌ సుధాకర్‌బాబు పర్యవేక్షణలో వేలం నిర్వహించగా ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఎన్నోఏళ్ల సమస్యకు పరిష్కారం

శ్రీవిజయమార్తేండేశ్వరస్వామి ఆలయం దూపదీప నైవేద్యాలకు ఎదురు చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. పట్టణంలోని ప్రధాన సెంటర్‌లో ఉండే స్వామి కాంప్లెక్స్‌ రూములకు అరకొరగానే అద్దెఉండటంతో పాటు అవి శిధిలావస్థకు చేరాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్‌ ఉగ్రనరసింహా రెడ్డి ఆ సమస్యకు పూర్తి పరిష్కార మార్గం చూపారు. నూతన కాంప్లెక్స్‌ నిర్మాణం చేయించి ఆలయానికి ఆదాయం తెచ్చిపెట్టే మార్గం చూపడంతో ప్రజలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 29 , 2026 | 11:15 PM