కొంత బ్యాంకులో.. మిగిలింది చేతికి!
ABN , Publish Date - Sep 24 , 2026 | 03:25 AM
ఎన్‌టీఆర్ భరోసా పథకం సామాజిక పింఛన్‌ల పంపిణీలో ప్రభుత్వం మార్పులు తీసుకొస్తోంది. కొత్త విధానాన్ని అక్టోబర్ ఒకటో తేదీ నుంచే అమ లు చేయబోతోంది. ఈమేరకు రాష్ట్ర పేదరిక నిర్మూ లన సంస్థ (సెర్ప్) నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది.
పింఛన్ల పంపిణీలో మార్పులు
కేంద్ర ప్రభుత్వ వాటా ఖాతాలకు జమ
వృద్ధులు, వితంతు, దివ్యాంగ పింఛన్లలో
కొంతమందికే కొత్త విధానంలో పంపిణీ
ఒంగోలు నగరం, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎన్‌టీఆర్ భరోసా పథకం సామాజిక పింఛన్‌ల పంపిణీలో ప్రభుత్వం మార్పులు తీసుకొస్తోంది. కొత్త విధానాన్ని అక్టోబర్ ఒకటో తేదీ నుంచే అమ లు చేయబోతోంది. ఈమేరకు రాష్ట్ర పేదరిక నిర్మూ లన సంస్థ (సెర్ప్) నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. రాష్ట్రప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ చేస్తున్న కొన్ని రకాల పింఛ న్లకు కేంద్ర ప్రభుత్వం తన వాటా అందజేస్తోంది. దీన్ని ఇంటింటికీ తిరిగి ఇస్తున్నారు. ఇక నుంచి ఇంటింటికీ రాష్ట్రప్రభుత్వ వాటాను మాత్రమే నగదుగా అందజేయనున్నారు. కేంద్రం విడుదల చేసే వాటాధనం లబ్ధిదారుల పేరున బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ అవుతుంది. అయితే అన్ని రకాలకు కాకుండా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారికి మాత్రమే కొంత బ్యాంకు ఖాతాకు, మిగిలిన మొత్తం నగదుగా చేతికి అందించనున్నారు.
అందరికీ కాదు... కొందరికే...
జిల్లాలో 1,10,263 మంది వృద్ధాప్య, 60వేల మంది వితంతు, 21,671మంది దివ్యాంగ పింఛన్లను పొందుతున్నారు. ఇందులో వృద్ధాప్య, వితంతు పింఛన్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6వేలు అందజేస్తోంది. వీరిలో కొంతమందికి మాత్రమే కేంద్రం తన వాటా సొమ్మును రాష్ట్రప్రభుత్వానికి విడుదల చేస్తోంది. మిగిలిన లబ్ధిదారులకు మొత్తం రాష్ట్రప్రభుత్వమే భరించి అందరికీ ఒకేవిధమైన పింఛన్‌ను ఇప్పటి దాకా ఇంటికే అందజేస్తోంది. అయితే ఇక నుంచి కేంద్రప్రభుత్వ వాటాధనం ఇస్తున్న పింఛన్‌దారు లకు కేంద్రం నేరుగా వారి ఖాతాలకు డీబీటీ పద్ధతి ద్వారా సొమ్ము జమచేయనుంది. ప్రస్తుతం వృద్ధాప్య పింఛన్ పొందుతున్న 60-79 ఏళ్ల వయస్సులోపు ఉన్నవారు ప్రస్తుతం ఇంటి వద్ద తీసుకుంటున్న రూ.4వేల పింఛన్ సొమ్ములో ఇక నుంచి రూ.200ల కేంద్రప్రభుత్వ వాటా సొమ్ము వారి బ్యాంకు ఖాతాలకు జమ కానుంది. రాష్ట్రప్రభుత్వం ఇస్తున్న రూ.3,800 మాత్రమే ఇంటింటి తిరిగి అందజేయనున్నారు. 80 ఏళ్లు దాటిన వారికి వృద్ధాప్య పింఛన్‌లో రూ.500లు బ్యాంకు ఖాతాలకు, రూ.3,500 నగదు ఇంటి వద్ద పంపిణీ చేస్తారు. వితంతు పింఛన్ పొందుతున్న వారిలో 40-79ఏళ్లలోపు వారికి ప్రస్తుతం పొందుతున్న రూ.4వేల పింఛన్‌లో బ్యాంకు ఖాతాకు రూ.300లు, ఇంటి వద్ద రూ.3,700లు నగదును అందించనున్నారు. 80ఏళ్లు దాటిని వితంతువులకు బ్యాంకు ఖాతాలకు రూ.500లు, చేతికి రూ.3500 అందించనున్నారు. దివ్యాంగులకు ప్రస్తుతం తీసుకుంటున్న రూ.6వేల పింఛన్ సొమ్ములో 18-79ఏళ్లలోపు వారికి రూ.300లు బ్యాంకు ఖాతాలకు, రూ.5700లు చేతికి అందించనున్నారు. 80ఏళ్లు పైన ఉన్న వారికి రూ.500లు బ్యాంకు ఖాతాలకు రూ.5500లు చేతికి అందించనున్నారు. అ యితే జిల్లాలో పింఛన్లు పొందుతున్న అందరికీ ఈ పద్ధతిలో పంపిణీ జరగదు. కేంద్రప్రభుత్వం ఎవరికైతే తమ వాటా ధనం విడుదల చేస్తుందో వారికి మాత్రమే మరుసటి నెల నుంచి బ్యాంకు ఖాతాలకు జమచేయనున్నారు. ప్రస్తుతం ఈ మూడురకాల పింఛన్లు పొందుతున్న వారిలో కేంద్రప్రభుత్వ వాటా విడుదల అవుతున్న వారి వివరాలను రెండు మూడు రోజుల్లో సెర్ప్ కార్యాలయం నుంచి జిల్లాలకు పంపించే అవకాశం ఉంది.