చక్కదిద్దుకోండి
ABN , Publish Date - May 26 , 2026 | 01:39 AM
స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం సరికొత్త వ్యూహానికి శ్రీకారం పలికింది. నియోజకవర్గాలలో పార్టీ నాయకులు, కూటమి పార్టీలతో సఖ్యతను పెంచుకుని సమైక్యంగా ముందుకు వెళ్లాలని సూచించింది.
మీ సమస్యను మీరే పరిష్కరించుకోండి
ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలకు టీడీపీ అధిష్ఠానం సూచన
అలగొద్దు.. నాకు సమాచారం ఇవ్వండి: లోకేష్
మంత్రి స్వామితో సత్య, పూర్ణచంద్రరావు భేటీ
కూటమి పార్టీల మధ్య సఖ్యతకు ప్రాధాన్యం
స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొత్త వ్యూహం
స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో టీడీపీ అధిష్ఠానం సరికొత్త వ్యూహానికి శ్రీకారం పలికింది. నియోజకవర్గాలలో పార్టీ నాయకులు, కూటమి పార్టీలతో సఖ్యతను పెంచుకుని సమైక్యంగా ముందుకు వెళ్లాలని సూచించింది. అదేతరుణంలో సమస్యలకు మీరే బాధ్యులు కాబట్టి తక్షణం వాటిని మీరే పరిష్కరిం చుకోవాలని ఆదేశించింది. కాదూ కూడదంటే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రధానంగా లోకేష్ ఈ వ్యవహారాలకుఅత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. తద్వారా కొన్నిచోట్ల నేతలు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. కొండపిలో ఇటీవల అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్న మంత్రి స్వామి, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఆయన తండ్రి పూర్ణచంద్రరావు రెండ్రోజుల క్రితం ప్రత్యేకంగా భేటీ అయి సమస్యను పరిష్కరించుకోవడం అందులో భాగంగానే చె ప్పుకోవచ్చు.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
తెలుగుదేశం పార్టీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయం పార్టీ క్యాడర్‌లో పెరి గింది. ప్రతి జిల్లాలోనూ అత్యధిక నియోజకవర్గాల్లో ఆ పరిస్థితి నెలకొంది. మరీ ముఖ్యంగా కొన్ని నియోజక వర్గాలలో కష్టకాలంలో పార్టీతో ఉన్న వారికన్నా కొత్త గా వైసీపీ, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే ప్రాధా న్యమిస్తున్న దాఖలాలు ఉన్నాయి. పార్టీ పదవులను అధిష్ఠానం ప్రత్యేకంగా పరిశీలించి ఇస్తున్నప్పటికీ, పలు నామినేటెడ్ పోస్టులు కొత్తగా వచ్చిన వారికే దక్కాయన్న అసంతృప్తి టీడీపీ క్యాడర్‌లో పెరిగింది. దీంతో కొన్ని నియోజకవర్గాలలో ద్వితీయ శ్రేణి నాయకులు, ఎమ్మెల్యేలకు.. ద్వితీయశ్రేణి, గ్రామస్థాయి నాయకులకు మధ్య దూరం పెరిగినట్లు కూడా అధిష్ఠానం గుర్తించింది. వీటికితోడు కూటమిలో భాగస్వామ్య పార్టీలైన జనసేన, బీజేపీలతో కూడా పలుచోట్ల సఖ్యత లేకపోవడం అధిష్ఠానం దృష్టికెళ్లింది. ఈ కోణంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నియోజకవర్గాలలో కూడా అధిష్ఠానం పరిశీలన చేపట్టగా ఒకట్రెండు మినహా మిగిలిన అన్నిచోట్లా సదరు సమస్యలు ఉన్నట్లు వెల్లడైంది.
కొండపి నేతల భేటీ
రమారమి రెండు దశాబ్దాల నుంచి మంత్రి, కొండపి ఎమ్మెల్యే స్వామి.. దామచర్ల కుటుంబంతో కలిసి ముందుకు సాగుతున్నారు. దివంగత ఆంజనేయులు కుమారుడు పూర్ణచంద్రరావు, యువనేత సత్య, మంత్రి స్వామిలు ఐక్యంగా నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారు. కారణం ఏమైనా ఇటీవల వారి మధ్య దూరం పెరిగినట్లు అధిష్ఠానం గుర్తించింది. ఆ విషయంలో ప్రత్యేక నివేదికను కూడా తెప్పించుకుంది. వీరి మధ్య పెరిగిన అగాధం స్థానిక ఎన్నికల్లో టీడీపీని దెబ్బతీస్తుందని కూడా గుర్తించింది. అయితే రెండురోజుల క్రితం విజయవాడలోని సత్య ఇంట్లో మంత్రి స్వామి, సత్య, పూర్ణచంద్రరావు భేటీ అయ్యారు. నియోజకవర్గ పరిస్థితులు, సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించుకున్నారు. ఈ విషయంలో సత్య ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో వలే పాలనా వ్యవహారాలను మంత్రి పర్యవేక్షించినా పార్టీ వ్యవహారాలను పూర్ణచంద్రరావు, సత్యలే చూడాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. అందుకనుగుణంగా స్థానిక ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కూడా ఇప్పటి నుంచే దృష్టి సారించాలని సమష్టిగా నిర్ణయాలు తీసుకోవాలని తీర్మానించుకున్నారు. వారు సమావేశమైన తర్వాత కొండపి నియోజకవర్గంలో ఇరువైపులా చేరి ఎవరిమాట వారికి చెబుతున్న కొందరు ద్వితీయశ్రేణి నాయకులు కూడా ముందస్తు జాగ్రత్తలో భాగంగా కలిసిపోయే ప్రయత్నాలను ప్రారంభించారు.
పర్యటనల్లో పశ్చిమ ఎమ్మెల్యేలు
పశ్చిమప్రాంతంలోని ఓ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ హెచ్చరికతో నియోజకవర్గాలలో పర్యటనలను పెంచారు. దక్షిణ ప్రాంతంలోని ఒక ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంతోపాటు మునిసిపాలిటీలో వీధివీధి పర్యటనలను ప్రారంభించారు. మరో ఎమ్మెల్యే నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతూ పార్టీలోని ఒక సామాజికవర్గం నాయకుల్లో పెరిగిన అసంతృప్తిని సవరించుకునే పనిలో పడిపోయారు. ఇద్దరు టీడీపీ ఇన్‌చార్జిలలో ఒకరిని నోరు అదుపులో పెట్టుకోవాలని అధిష్ఠానం హెచ్చరించినట్లు తెలిసింది. మరొకరిని ‘మీరు బాగా కష్టపడుతున్నారు. ఆ మేరకు ప్రచారం జరగడం లేదు. వెంటనే డిజిటల్ మీడియాలో ప్రచారం పెంచుకోండి’ అని సూచించినట్లు సమాచారం.
జనసేనతో సఖ్యత పెంచుకోవాలి
జనసేన నాయకులతో సఖ్యత పెంచుకోవాలని టీడీపీ అధిష్ఠానం సూచించడంతో దాదాపు అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు, జనసేన నాయకుల ప్రత్యేక సమావేశాలు ఇటీవల పెరిగాయి. ఒకట్రెండు నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు భేషజానికి పోయి దూరంగా ఉన్న సీనియర్ నాయకులను దరిచేర్చుకునే ప్రక్రియకు శ్రీకారం పలకలేదు. కీలకమైన ఒక నియోజకవర్గంలో పార్టీకి పూర్వం నుంచి ఉన్న పలువురు సీనియర్లు ఎమ్మెల్యే వద్దకెళ్లి ఆరునెలలు దాటిందంటే అతిశయోక్తి కాదు. ఇలాంటి విషయాలను రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా గుర్తించిన లోకేష్ తాజాగా ‘మీరు అలకలు మానండి, సమస్యలు నా దృష్టికి తెండి. నా వాట్సాప్‌కు సమాచారం ఇవ్వండి’ అని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు.