సబ్ స్టేషన్లకు అనుసంధానంగా సోలార్ ప్లాంట్లు
ABN , Publish Date - May 02 , 2026 | 03:15 AM
ఇళ్ల మీద సోలార్ యూనిట్‌లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వ్యవసాయానికి పగలు నిరంతరాయంగా 9 గంటలపాటు కరెంటు సరఫరాకు అవసరమయ్యే విద్యుత్‌ను సోలార్ ప్లాంట్‌ల ద్వారా ఉత్పత్తి చేసే చర్యలను వేగవంతం చేసిం ది.
పఎం కుసుమ్ పథకం ద్వారా ప్రకాశం, మార్కాపురం జిల్లాలలో ఏర్పాటు
36 చోట్ల 127 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు
అద్దంకి, మే 1 (ఆంధ్రజ్యోతి) : ఇళ్ల మీద సోలార్ యూనిట్‌లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వ్యవసాయానికి పగలు నిరంతరాయంగా 9 గంటలపాటు కరెంటు సరఫరాకు అవసరమయ్యే విద్యుత్‌ను సోలార్ ప్లాంట్‌ల ద్వారా ఉత్పత్తి చేసే చర్యలను వేగవంతం చేసిం ది. ప్రకాశం, మార్కాపురం జిల్లాల పరిధిలో మొదటి దశ లో 36 సబ్‌స్టేషన్‌ల వద్ద రైతుల నుంచి పొలాలు లీజుకు తీసుకొని ప్రైవేట్ కంపెనీల ద్వారా సోలార్ యూనిట్‌లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 4 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఈనేప థ్యంలో ఆయా సబ్‌స్టేషన్‌ల వద్ద భూముల లభ్యతను బట్టి సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను సమీపంలో ఉన్న సబ్‌స్టేషన్‌కు అనుసంధానం చేస్తారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా విభజించిన ఫీడర్‌ల ద్వారా ఉచితంగా వ్యవసాయానికి అందజేయనున్నారు. దీంతో రైతులకు పగలు సమయంలో 9 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు అవకాశం కలుగుతుంది.
అద్దంకి నియోజకవర్గంలో ఐదు
పీఎం కుసుమ్ పథకం ద్వారా ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 36 సబ్‌స్టేషన్‌ల సమీపంలో సోలార్ ప్లాంట్‌లనుఏర్పాటు చేయనున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఐదు సబ్‌స్టేషన్‌ల వద్ద వీటిని ప్రతిపాదించారు. అద్దంకి మండలం కుంకుపాడులో మూడు మెగావాట్ల ఉత్పత్తికి 12 ఎకరాలు, సాఽధునగర్‌లో ఐదు మెగావాట్ల ఉత్పత్తికి 20 ఎకరాలు, శంకవరప్పాడులో మూడు మెగావాట్ల ఉత్పత్తికి 12 ఎకరాలు, బల్లికురవ మండలం వల్లాపల్లి వద్ద మూడు మెగావాట్లకు 12 ఎకరాలు, వి.కొప్పెరపాడు వద్ద మూడు మెగావాట్లకు 12ఎకరాల భూమిని రైతుల వద్ద నుంచి లీజుకు తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే సోలార్ ప్లాంట్‌లు ఏర్పాటుచేసే ప్రైవేట్ కంపెనీ ఆయా సబ్‌స్టేషన్‌ల వద్ద ఉప్న భూములను లీజుకు తీసుకునేందుకు రైతులతో సంప్రదింపులు జరుపుతోంది. సబ్‌స్టేషన్‌ల వద్ద ఏర్పాటు చేసే సోలార్ ప్లాంట్‌లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైతే రైతులకు పగలు సమయంలో నిరంతరాయంగా మెరుగైన విద్యుత్ సరఫరాకు అవకాశం ఏర్పడనుంది.