గిరిజన గూడేలలో సోలార్ వెలుగులు
ABN , Publish Date - Feb 08 , 2026 | 12:06 AM
అనాదిగా చీకట్లో మగ్గుతున్న గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతమైన పాలుట్ల గిరిజన తాండాలో సోలార్ లైట్లను శుక్రవారం పొద్దుపోయాక లబ్ధిదారులతో కలసి మంత్రి ప్రారంభించారు.
పాలుట్లలో లైట్లను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి, కలెక్టర్ రాజాబాబు
ఒక్కో ఇంటికి రూ.50 వేల విలువైన సామగ్రి అందజేత
చెంచు కుటుంబాలతో సహ భోజనం
చీకట్లో మగ్గుతున్న కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం చంద్రబాబుదే
ఎర్రగొండపాలెం రూరల్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి) : అనాదిగా చీకట్లో మగ్గుతున్న గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలోని నల్లమల అటవీ ప్రాంతమైన పాలుట్ల గిరిజన తాండాలో సోలార్ లైట్లను శుక్రవారం పొద్దుపోయాక లబ్ధిదారులతో కలసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ పాలుట్ల గూడెంలోని ప్రజలు చీకట్లో మగ్గిపోతున్నారని తన దృష్టికి నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, గూడెం పెద్దలు తీసుకొచ్చారన్నారు. ఇదే విషయాన్ని సీఎం చందబ్రాబు దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి వెంటనే అందుకు అవసరమైన నిధులను మంజూరు చేశారన్నారు. గూడేలను వీలైనంత త్వరగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. కేవలం ఏడాదిలోనే పాలుట్ల గూడెంలో పీఎం జన్‌మన్ పథకం(అప్ గ్రేడ్ సోలార్ గృహ విద్యుదీకరణ) కింద 511 గుడిసెల్లో వెలుగులు నింపామన్నారు. ఒక్కో కుటుంబానికి 5 లైట్లు, రెండు ఫ్యాన్‌లు, యూఎ్‌సపీ పోర్టల్, బ్యాటరీ మొత్తం రూ.50వేల విలువల చేసి సామగ్రిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం సుమారు రూ.3కోట్ల నిధులతో వెలుగులు నింపామన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ఓడినా.. అభివృద్ధిలో గెలిచారు
మొన్నటి ఎన్నికల్లో 4వేల ఓట్లతో ఎరిక్షన్‌బాబు ఓడిపోయినా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంలో గెలిచి ప్రజల మనసు చూరగొన్నారని ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి చెప్పారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నారని అభినందించారు.
అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఇన్‌చార్జి కలెక్టర్ పీ రాజాబాబు చెప్పారు. గిరిజనుల కోసం ఎన్నో పథకాలు అమలవుతున్నాయన్నారు. గూడెంలో 3వేల ఎకరాలు సాగులో ఉండగా, పొలాలకు కూడా సోలార్ సిస్టమ్ కావాలని, రోడ్డు సదుపాయం కావాలని వినతులు వచ్చాయని,ఆ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అనుమతులు వచ్చేలా కృషి చేస్తామని చెప్పారు.
గిరిజన యువతకు ఉపాధిపై శిక్షణ
గిరిజన యువతీయువకులు తమకాళ్లమీద వారు నిలబడేలా అనేక రంగాలపై ఉచిత శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు చూపుతున్నామని టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు అన్నారు. వైపాలెం వైటీసీలో గిరిజన మహిళలకు కుట్టు మిషన్‌పై, యువకులకు కారు డ్రైవింగ్‌లో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ముందుగా గూడెంలో గోకులం షెడ్‌ను ప్రారంభించి ఇంటింటికీ తిరిగి సోలార్ లైట్లపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, విద్యుత్ శాఖ ఎస్సీ వెంకటేశర్లు, ఐటీడీఏ పీవో వెంకటశివప్రసాద్ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.