నల్లమలలో సోలార్ వెలుగులు
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:58 AM
అది దట్టమైన అటవీ ప్రాంతం. కనీసం వెళ్లేందుకు అవసరమైన రహదారి కూడా లేదు. జీపులు, కమాండర్‌లలో అక్కడకు చేరాలి. అలాంటి నల్లమలలో కనీస సౌకర్యాలు కూడా నోచుకోని గిరిజన గూడేల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషి చేశారు.
6న పాలుట్లలో ప్రారంభించనున్న మంత్రి గొట్టిపాటి
మార్కాపురం, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి) : అది దట్టమైన అటవీ ప్రాంతం. కనీసం వెళ్లేందుకు అవసరమైన రహదారి కూడా లేదు. జీపులు, కమాండర్‌లలో అక్కడకు చేరాలి. అలాంటి నల్లమలలో కనీస సౌకర్యాలు కూడా నోచుకోని గిరిజన గూడేల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషి చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఉన్న వాటితోపాటు మొత్తం 84 గిరిజన గూడేలలో విద్యుత్ పునరుద్ధరణ పనులకు నిధులు మంజూరు చేశారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌లతోపాటు దాదాపు 623 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయించారు. వాటికోసం సుమారు రూ.2.22 కోట్లు వెచ్చించారు. వీటితోపాటు 611 గృహాలకు సోలార్ వెలుతురు ఇచ్చేందుకు 0.3 కిలోవాట్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానెల్‌ను ప్రతి ఇంటికీ అమర్చారు. అందుకోసం దాదాపు రూ.4.05 కోట్లను ఖర్చు చేశారు.
పాలుట్లకు రానున్న మంత్రి గొట్టిపాటి
పూర్తయిన పనులను తానే స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పడంతో అందుకోసం స్థానిక నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పాలుట్ల గిరిజనగూడెంలో ఆయన ఈనెల 6వ తేదీ పర్యటించ నున్నారు. పూర్తయిన పనులను ప్రారంభించను న్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లలో టీడీపీ ఎర్రగొండపాలెం ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు ఉన్నారు. పాలుట్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యం లేకపోవడంతో జిప్సీలు, కమాండర్‌లను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు కూడా అవసరమైన భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.