Share News

ఎస్సీ, ఎస్టీలకు సోలార్‌ ఉచితం

ABN , Publish Date - Apr 25 , 2026 | 12:44 AM

రెండు వందల యూనిట్లు విద్యుత్‌ వాడుకొనే ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్లను మంజూరు చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు.

ఎస్సీ, ఎస్టీలకు సోలార్‌ ఉచితం

పార్టీలకతీతంగా ప్రతి ఇంటికీ మంజూరు

ఆర్డీఎస్‌ ద్వారా గ్రామాలలో ప్రత్యేక విద్యుత్‌లైన్లు

విద్యుత్‌ చార్జీ తగ్గించిన ఘనత ప్రజాప్రభుత్వానిదే

మంత్రి గొట్టిపాటి రవికుమార్‌

బల్లికురవ, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): రెండు వందల యూనిట్లు విద్యుత్‌ వాడుకొనే ప్రతి ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా సోలార్‌ రూఫ్‌ టాప్‌ యూనిట్లను మంజూరు చేస్తోందని విద్యుత్‌ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం బల్లికురవ ఎస్సీ కాలనీలో 30 మందికి ఏర్పాటు చేసిన సోలార్‌ రూఫ్‌టాప్‌ యూనిట్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్‌ చార్జీలు లేకుండా ఉచితంగా సోలార్‌ ద్వారా ప్రజలు విద్యుత్‌ను పొందే అవకాశం ఉందన్నారు. త్వరలో బీసీలకు రూ.98 వేల రాయితీతో సోలార్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఓసీలకు మూడు కిలో వాట్ల సోలార్‌ యూనిట్‌ పెట్టుకుంటే ప్రభుత్వం రూ.78 వేల సబ్సిడీ ఇస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల సోలార్‌ యూనిట్లను మంజూరు చేసినట్టు మంత్రి చెప్పారు. విద్యుత్‌ చార్జీలను తగ్గించిన ఘనత ప్రజాప్రభుత్వానిదేనన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారంగా విద్యుత్‌ చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. ప్రజాప్రభుత్వం ఎన్నికల సమ యంలో చెప్పిన మాటప్రకారం చార్జీలను పెంచకుండా తగ్గించిందన్నారు. అలాగే, పెద్దఎత్తున ఆర్డీఎస్‌ పథకం ద్వారా అద్దంకి నియోజకవర్గంలో రూ.128 కోట్లతో ప్రత్యేక విద్యుత్‌ లైన్లు, నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేసినట్టు చెప్పారు.విద్యుత్‌పరంగా సమస్యలు లేకుండా అధికా రులను అప్రమత్తం చేసి పనులు చేయిస్తున్నామన్నారు. సోలార్‌ యూనిట్లు అవసరమైన అందరికీ అందిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షుడు గొట్టిపాటి లక్ష్మయ్య, విద్యుత్‌ శాఖ బాపట్ల జిల్లా ఎస్‌ఈ అంజనేయులు, ఈఈ నల్లూరి మస్తాన్‌రావు, ఏడీఈ సురేంద్రబాబు, మాజీ సర్పంచ్‌ పందిరి అంజిబాబు, తహసీల్దార్‌ రవినాయక్‌ు పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2026 | 12:44 AM