‘అద్దంకి’లో సోలార్ పరికరాల తయారీ పరిశ్రమ
ABN , Publish Date - Jun 18 , 2026 | 03:02 AM
దేశంలోనే మొట్టమొదటగా సోలార్ పరికరాల తయారీ పరిశ్రమ అద్దంకి నియోజకవర్గంలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా కృషిచేస్తున్నారు.
దేశంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు
ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి రవికుమార్
వెయ్యి ఎకరాల భూసేకరణకు నిధులు విడుదల
ప్రక్రియ వేగవంతంపై అధికారుల కసరత్తు
అద్దంకి, జూన్ 17(ఆంధ్రజ్యోతి) : దేశంలోనే మొట్టమొదటగా సోలార్ పరికరాల తయారీ పరిశ్రమ అద్దంకి నియోజకవర్గంలో ఏర్పాటు కానుంది. దీని ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే దిశగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా కృషిచేస్తున్నారు. ప్రస్తుతం ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. బల్లికురవ మండలం ఎస్‌ఎల్ గుడిపాడు, సంతమాగులూరు మండలం కుందుర్రు, మామిళ్లపల్లి రెవెన్యూ పరిధిలో సుమారు వెయ్యి ఎకరాలలో సోలార్ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ వేగవంతమైంది. ఆయా గ్రామాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు పోను రైతులకు సంబంధించిన పొలాలను ఎకరా సుమారు రూ.18 లక్షల రూపాయల చొప్పున కొనుగోలుకు నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే పలుసార్లు అధికారులు ఆయా గ్రామాలలో సభలు కూడా నిర్వహించి రైతులు అభిప్రాయాలను తెలుసుకున్నారు. అత్యధిక శాతం మంది భూములు ఇచ్చేందుకు సిద్ధంకాగా, కొద్దిమంది మాత్రం సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. వీరికి సంబంధించి నష్టపరిహారం కోర్టులో జమ చేసి భూసేకరణ ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భూసేకరణకు సుమారు రూ.150 కోట్ల నిధులు కూడా విడుదలైనట్లు సవచాఆరం. పరిశ్రమ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతుల కుటుంబంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.
జిల్లా మార్పుతో కొంచెం ఆలస్యం
దేశంలోనే మొట్టమొదటగా అద్దంకిలో సోలార్ పరికరాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుండటంతో మంత్రి రవికుమార్ కూడా పలు దఫాలు జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి భూములకు సంబంధించి పరిహారం ఎక్కువ వచ్చే విధంగా కృషి చేశారు. భూసేకరణను వేగవంతం చేసినట్లు సమాచారం. జిల్లా మార్పుతో భూసేకరణ కొంచెం ఆలస్యమైంది. అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా పరిధిలో ఉన్న సమయంలోనే కొలిక్కి వచ్చినప్పటికీ రికార్డులు మొత్తం ప్రకాశం జిల్లా పరిధిలోకి మార్చాల్సి రావడంతో ఆలస్యమవుతోంది. భూసేకరణ పూర్తయితే పరిశ్రమ ఏర్పాటు పనులు వెంటనే ప్రారంభించి వేగవంతంగా నిర్మించే అవకాశం ఉంది. పరిశ్రమ ఏర్పాటైతే యువతకు ఉపాధి అవకాశాలు పెరగటంతోపాటు ఆయా గ్రామాలలో ఆర్థికాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని రైతులు చెబుతున్నారు.