అలా ముగించారు
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:57 AM
జడ్పీ సమావేశం మొక్కుబడిగా సాగింది. కీలకమైన, ఎక్స్ అఫిషియో హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు స్వల్పంగానే హాజరయ్యారు. సమావేశంలో వైసీపీకి చెందిన జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్, ఇతర మండల స్థాయి ప్రజాప్రతినిధులు... ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొక్కుబడిగా జడ్పీ సమావేశం
రూ.1.33 కోట్ల మిగులుతో బడ్జెట్
మొత్తం ఆదాయం రూ 852.15 కోట్లు, వ్యయం రూ.850.51 కోట్లుగా అంచనా
మార్కాపురం జిల్లాతో ప్రజల కోరిక నెరవేరిందన్న ఎంపీ మాగుంట
విద్యుత్ అధికారుల తీరుపై బీఎన్ సీరియస్
ప్రొటోకాల్ పాటించడం లేదంటూ వైసీపీ ప్రజాప్రతినిధుల రగడ
జడ్పీ సమావేశం మొక్కుబడిగా సాగింది. కీలకమైన, ఎక్స్ అఫిషియో హోదాలో ఉన్న ప్రజాప్రతినిధులు స్వల్పంగానే హాజరయ్యారు. సమావేశంలో వైసీపీకి చెందిన జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, వైపాలెం ఎమ్మెల్యే టి.చంద్రశేఖర్, ఇతర మండల స్థాయి ప్రజాప్రతినిధులు... ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించడం లేదంటూ రగడకు దిగారు. మూడు గంటలపాటు జరిగిన సమావేశంలో అజెండాలోని అంశాలపై పట్టుమని గంటపాటు కూడా చర్చ లేకుండానే మమ అనిపించారు.
ఒంగోలు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యలపై చర్చించి వారికి ఉపయోగపడే నిర్ణ యాలు తీసుకోవాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. శనివారం ఉదయం 10.30గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశాన్ని 11.10కు ప్రారంభించి 2.15 గంటలకు ముగించేశారు. ముఖ్యమైన అంశాలను అజెండాలో పొందుపర్చినా వాటిపై చర్చ జరిగిన పరిస్థితి లేదు. కేవలం వ్యక్తిగత అజెండాగానే ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడగా అందు కు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి దీటుగా సమాధానం చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27)కు రూ.1.33 కోట్ల మిగులుతో జిల్లాపరి షత్ బడ్జెట్‌ను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదిం చింది. స్థానిక పాత జడ్పీహాలులో శనివారం చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావే శం జరిగింది. రానున్న ఏడాది బడ్జెట్ ఆమోదం ప్రధాన అంశంగా నిర్వహించారు. వచ్చే ఏడాది అన్నిరకాల గ్రాంట్లు, పన్నులు ఇతర రంగాల్లో మొత్తం జడ్పీకి రూ.852.15 కోట్ల ఆదాయం, సుమారు రూ.850.81 కోట్ల వ్యయం చూపుతూ జడ్పీ సీఈవో చిరంజీవి బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అందులో రూ.45 కోట్లు జడ్పీకి సాధారణ నిధులు, ఆర్థిక సంఘం గ్రాంటు ద్వారా సమకూరనున్నాయి. మిగిలిన మొత్తం ప్రభుత్వం నుంచి డ్వామా, పంచాయతీరాజ్, ఇతర శాఖల ద్వారా సమకూరనున్నట్లు ప్రతిపాదనల్లో చూపారు. మొత్తంగా వచ్చే ఏడాదికి రూ 1.33 కోట్ల మిగులుతో బడ్జెట్ ఆమోదం పొందింది. అదేసమయంలో 2025-26 వార్షిక సవరణ బడ్జెట్ అంచనాకు కూడా ఆమోదం తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.848.82 కోట్ల ఆదాయం, రూ.847.20 కోట్లు వ్యయాన్ని సవరించిన అంచనా ప్రకారం చూపించారు.
సీఎంకు ధన్యవాదాలు
సమావేశానికి హాజరైన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పశ్చిమప్రాంత ప్రజల కోరికను మార్కాపురం జిల్లా ఏర్పాటు ద్వారా సీఎం చంద్రబాబు నెరవేర్చారన్నారు. అందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తారని, తద్వారా ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందన్నారు. సంతనూతలపాడు ఎమ్మెల్యే బీఎన్.విజయకుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారుల తీరుపై మండిపడ్డారు. విద్యుత్ లైన్లను కాంట్రాక్టర్లు ఇష్టానుసారం వేస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాబోయే రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. రానున్న వేసవిలో నియోజకవర్గంలో తాగునీటి ఇక్కట్లు రాకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో ఓబులేశు, బాపట్ల డీఆర్వో గంగాధర్‌గౌడ్‌తోపాటు పలుశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కేవలం ప్రొటోకాల్‌పైనే..
జడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మతోపాటు వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఇతర జడ్పీటీసీ సభ్యులు కేవలం ప్రొటోకాల్‌పై తప్ప ప్రజలకు ఉపయోగపడే అంశాలపై మాట్లాడని పరిస్థితి నెలకొంది. అధికారపార్టీ ఇన్‌చార్జిలకు మండల స్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను విస్మరించడం ఏమిటని ప్రశ్నించారు. సాధారణంగా ప్రొటోకాల్‌ను మండల స్థాయిలోనే సంబంధిత అధికారులు చూసుకుంటారన్న విషయాన్ని కూడా వారు పట్టించుకోలేదు. వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లకుపైగా అవసరం కాగా రూ.700 కోట్లకు టెండర్లు పిలిచారని, నిధులు ఇచ్చింది కేవలం రూ.80 కోట్లు మాత్రమేనన్నారు. ఈ విషయంలో వైసీపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాట్లాడటంతో ఎంపీ మాగుంట కల్పించుకున్నారు. సమావేశంలో రాజకీయాలు చేయొద్దని చెప్పడంతోపాటు ఈ విషయలన్నీ ప్రజలందరికీ తెలుసని దీటుగానే సమాధానం ఇచ్చారు.
గౌరవ వేతనం ఇవ్వాలి
వెలిగండ్ల ఎంపీపీ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో కలిపితే త్వరగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు పలువురు జడ్పీటీసీ సభ్యులు తమకు గత 20నెలలకుపైగా గౌరవ వేతనం రావడం లేదని ఏకరువు పెట్టారు. దీనిపై నిరసన తెలిపేందుకు వారు సిద్ధం కావడంతో జోక్యం చేసుకున్న సీఈవో చిరంజీవి ఇప్పటికే ఆ బిల్లులను ట్రెజరీకి పంపామని, త్వరలోనే వస్తాయని హామీ ఇచ్చారు.