Share News

2,071 పాఠశాలలకు ఎస్‌ఎంసీ ఎన్నికలు

ABN , Publish Date - Sep 17 , 2026 | 02:48 AM

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజ మాన్యాల్లో నిర్వహిస్తున్న 2,071 స్కూళ్లకు యాజమాన్య కమిటీల ఎన్నికలు జరగ నున్నాయి. ఈ మొత్తంలో 1,470 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఎస్‌ఎంసీలు పునర్‌ వ్యవస్థీకరణ తప్పనిసరిగా జరగాల్సి ఉంది.

2,071 పాఠశాలలకు ఎస్‌ఎంసీ ఎన్నికలు

50శాతం మంది ఓటర్లు వస్తేనే కోరం

ఒంగోలు విద్య, సెప్టెంబరు 16 (ఆంధ్ర జ్యోతి) : జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజ మాన్యాల్లో నిర్వహిస్తున్న 2,071 స్కూళ్లకు యాజమాన్య కమిటీల ఎన్నికలు జరగ నున్నాయి. ఈ మొత్తంలో 1,470 ప్రభుత్వ, ప్రభుత్వ రంగ పాఠశాలల్లో ఎస్‌ఎంసీలు పునర్‌ వ్యవస్థీకరణ తప్పనిసరిగా జరగాల్సి ఉంది. వీటన్నింటిలో ఎన్నికలకు సంబంధిత ప్రధానోపాధ్యాయులు నోటిఫికేషన్‌ జారీచేసి నోటీసు బోర్డులో ఉంచారు. మిగిలిన 601 ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో కూడా పరిపాలన పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ఎస్‌ఎంసీల ఏర్పాటును ప్రోత్సహించాలని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే ఈ పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణ తదితర తతంగాలు ఏమీ లేకుండా తల్లిదండ్రులతో కమిటీలను ఏర్పాటు చేసుకుంటారు. ఎస్‌ఎంసీ ఎన్నికల్లో బడుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు కీలకం కానున్నారు. కమిటీల్లో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ విద్యార్థుల తల్లిదండ్రుల్లోని 75శాతం సభ్యుల నుంచే ఎన్నుకుంటారు. పాఠశాల హెచ్‌ఎం ఎస్‌ఎంసీ మెంబర్‌, సెక్రటరీగా వ్యవహరించనున్నారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, స్థానిక విద్యావేత్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, సీనియర్‌ విద్యార్థులు, పూర్వ విద్యార్థుల నుంచి ఎస్‌ఎంసీ సభ్యులుగా ఎన్నికైన వారు సలహా మండలిగా వ్యవహరించనున్నారు. ఎస్‌ఎంసీలో ఏ తీర్మానమైన తల్లిదండ్రుల నుంచి ఎన్నికైన 75శాతం మంది సభ్యుల నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది.

పదవీ కాలం రెండేళ్లు

ఎస్‌ఎంసీ ఎన్నికలకు కనీసం 50శాతం మంది ఓటర్లు వస్తేనే కోరం అవుతుంది. కోరం అయితేనే ఎన్నికలు నిర్వహించాలి. ఎస్‌ఎంసీ సభ్యులు ఎవరైనా వరుసగా నాలుగు సమావేశాలకు హాజరుకాకపోతే ఆ సభ్యుడిని కమిటీ నుంచి తొలగిస్తారు. ఎవరైనా విద్యార్థి పాఠశాల నుంచి వెళ్లిపోతే ఆ విద్యార్థి తల్లిదండ్రులను, క్రిమినల్‌ కేసుల్లో అరెస్టు అయిన వారిని, వలసపోయిన వారిని, ఎవరైనా మరణించినా, వారిని ఎస్‌ఎంసీ నుంచి సభ్యులుగా తొలగిస్తారు. ప్రతినెలా విధిగా ఎస్‌ఎంసీ సమావేశం నిర్వహించాలి. ఎస్‌ఎంసీ పదవీ కాలం రెండేళ్లు ఉంటుంది.

Updated Date - Sep 17 , 2026 | 02:51 AM